హైదరాబాద్, సెప్టెంబర్ 23, (న్యూస్ పల్స్)
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో గతంలో ఎప్పుడూ లేనంత పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రతీ సారి ఎన్నికలు అంటే సీనియర్లంతా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ఉంటారు. తమ వర్గానికే టిక్కెట్లు ఇప్పించుకోవాలని ప్రయత్నిస్తూంటారు. ఈ సారి కూడా అలాంటివి ఉన్నా బయటకు రానివ్వడం లేదు. అంతర్గతంగా పూర్తి చేసేసుకుంటున్నారు. అదే సమయంలో వ్యూహాత్మకంగా ప్రచార కార్యక్రమాలు ఖరారు చేసుకుంటున్నారు. భారీ బహిరంగసభలు నెలకు రెండు, మూడు వారాలకు ఒకటి ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇటీవలే తుక్కుగూడ బహిరంగసభను భారీగా నిర్వహించిన నేతలు వచ్చే నెల పదో తేదీన బీసీ గర్జన నిర్వహించాలని నిర్ణయించారు. కాంగ్రెస్ బీసీ గర్జనకు ముహూర్తం ఖరారైంది.
హైదరాబాద్ నగర శివార్లలో షాద్‌నగర్ వద్ద ఈ సభను నిర్వహించాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. ఈ సభకు ముఖ్య అతిథిగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య హాజరయ్యే అవకాశం ఉంది. కర్ణాటకలో దళిత, బహుజన, ఓబీసీ వర్గాల్లో గట్టి పట్టున్న నేతగా పేరొందిన సిద్ధరామయ్యను ముఖ్య అతిథిగా ఆహ్వానించడం ద్వారా కర్ణాటక తరహాలో వెనుకబడిన వర్గాల ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ ఉన్నట్టుగా కనిపిస్తోంది. బీసీ గర్జన ద్వారా తెలంగాణలోని బీసీ వర్గాల్లో నూతనోత్సాహం వస్తుందని .. మహిళా రిజర్వేషన్ల బిల్లులో వెనుకబడిన వర్గాలకు కూడా అవకాశం కల్పించాలని కాంగ్రెస్ డిమాండ్ డిమాండ్ చేస్తోంది. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఉండే 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2-3 నియోజకవర్గాలను బీసీలకు కేటాయించాలని నిర్ణయించారు.
మొత్తంగా రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాల పరిధిలో 34 మంది బీసీ అభ్యర్థులను బరిలోకి దింపాలని భావిస్తోంది. ఇప్పటికే బలమైన బీసీ అభ్యర్థుల జాబితాను ఫైనల్ చేసుకున్నారు. కొన్ని చోట్ల పోటీ ఎక్కువగా ఉండటంతో బుజ్జగింపులు చేస్తున్నారు. బీసీలకు అత్యధిక సీట్లు ఇవ్వడం ద్వారా ఈ సారి బీసీ ఓటు బ్యాంక్ ను గణనీయంగా తమ వైపు తిప్పుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ఈ నిర్ణయం మధుయాష్కీ లాంటి నేతలకు కలసి వస్తోంది. బలమైన నేత కావడంతో ఆయనకు ఎల్బీనగర్ టిక్కెట్ ఖరారయిందన్న ప్రచారం జరుగుతోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను స్క్రీనింగ్ కమిటీ దాదాపుగా పూర్తి చేసింది.
సర్వేలు, గెలుపు అవకాశాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తున్నట్లు తెలుస్తోంది. సామాజిక సమీకరణలు, ఆర్థిక, రాజకీయ అంశాల ఆధారంగా అభ్యర్థులను వడపోసినట్లు సమాచారం. తొలి జాబితాను సిద్ధం చేసిన అనంతరం స్క్రీనింగ్ కమిటీ ఆ లిస్టును అధిష్ఠానానికి చేరవేయనుంది. ఈ నెలాఖరు లేదా అక్టోబరు తొలివారంలో మొదటి జాబితాను ప్రకటించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం 119 స్థానాలకుగానూ 70కి పైగా స్థానాల్లో ఇప్పటికే స్పష్టత వచ్చినట్లు సమాచారం. బీసీ గర్జన సభలోపే తొలి జాబితాను ప్రకటించే అవకాశం ఉంది.