కడప, సెప్టెంబర్ 17, (న్యూస్ పల్స్)
వివేకాహత్య కేసులో విచారణ ముగిందని సీబీఐ వెల్లడించింది. అయితే తన వాంగ్మూలాన్ని వక్రీకరించారని, జగన్‌ను భారతి పైకి పిలిచారని తాను చెప్పినట్లుగా తప్పుగా చెప్పారని సీఎం జగన్ సలహాదారు అజేయ కల్లం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. ఈ సందర్భంగా అజేయ కల్లంపై సీబీఐ అసహనం వ్యక్తం చేసింది. వివేకా హత్య కేసులో సాక్షిగా అజేయ కల్లం అంగీకారంతోనే చట్ట ప్రకారమే ఆయన ఇంట్లోనే వాంగ్మూలం నమోదు చేశామని కోర్టుకు సీబీఐ తెలిపింది. అజేయ కల్లంను విచారించినప్పుడు.. ఆయన ఆడియోను రికార్డు చేశామని స్పష్టం చేసింది. ఆ ఆడియో రికార్డింగ్‌ను సీల్డ్ కవర్‌లో ధర్మాసనానికి సమర్పించామని తెలిపింది. తమ విచారణ సమయంలోనూ.. ప్రస్తుతమూ అజేయ కల్లం సీఎం జగన్ సలహాదారుడిగా ఉన్నారని కోర్టు దృష్టికి సీబీఐ తీసుకెళ్లింది.
అంతేకాదు అజేయ కల్లం సీఎం ప్రధాన సలహాదారుడు కావడదంతో పిటిషన్ విచారణార్హంకాదని సీబీఐ పేర్కొంది. ఏపీ ప్రభుత్వంతో ఉన్న అనుబంధాన్ని అజేయ కల్లం సైతం పిటిషన్‌లో ఒప్పుకుంటున్నారని స్పష్టం చేసింది. అంతేకాదు అజేయ కల్లం ప్రభావితమైనట్లు చాలా స్పష్టంగా కనిపిస్తోందని అనుమానం వ్యక్తం చేసింది. అజేయ కల్లం పిటిషన్‌లో తెలిపిన విషయాలు.. తమ విచారణ తర్వాత వచ్చిన ఆలోచనలేనని పేర్కొంది. అజేయ కల్లం ఇచ్చిన వాంగ్మూలంతో కొందరిని ఇరికించే ప్రయత్నం చేస్తున్నామన్న ఆరోపణలు వాస్తవం కాదని తెలిపారు. వివేకా కేసును నిబద్ధతతో, పారదర్శంగా దర్యాప్తు చేశామని సీబీఐ తెలిసింది. అజేయ కల్లంతో సహా పలువురు సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేశామని, ఎవరినీ ఇరికించే ప్రయత్నం చేయలేదని కోర్టుకు సీబీఐ పేర్కొంది. ఐఏఎస్‌గా చేసిన కల్లంకు సీ ఆర్పీసీ 161 వాంగ్మూలం ఉద్దేశమేంటో తెలుసని, దర్యాప్తు అధికారిపై ఆయన చేసిన ఆరోపణలు అబద్ధమని సీబీఐ దాఖలు చేసిన కౌంటర్‌లో పేర్కొంది.