Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

అప్పుల ఊబిలో రైతులు..

0

నాగార్జున సాగర్ రైట్ బ్యాంక్‌‌లో నివాసం ఉండే రాములు అనే వ్యక్తికి మూడెకరాల పొలం ఉంది. కోవిడ్ సోకిన తర్వాత రాములు ఆరోగ్యం కుదుట పడలేదు. దీంతో వ్యవసాయం అటకెక్కింది. ఆయనకు ముగ్గురు సంతానం. ఇద్దరు ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేశాడు. పెద్దమ్మాయికి ఇద్దరు కుమార్తెలు. ఆడపిల్లలే పుట్టారని అల్లుడు వదిలేశాడు. మరో యువతితో వివాహేతర సంబంధం పెట్టుకొని వెళ్లిపోయాడు.రాములు కుమారుడు వ్యసనాలకు బానిసయ్యాడు. కుటుంబాన్ని పట్టించుకోవడం లేదు.

 

గత్యంతరం లేని స్థితిలో పెద్ద కూతురు బిడ్డలను గుంటూరులోని చిన్నమ్మాయి, అల్లుడు దగ్గరకు చేర్చారు. బతుకుదెరువు కోసం రాములు దంపతులతోపాటు పెద్దమ్మాయిని తీసుకుని రెండు నెలల క్రితం గుంటూరు వచ్చేశారు. భార్యాభర్తలు రెస్టారెంట్‌లో పనికి కుదిరారు. పెద్దమ్మాయి ఓ వృద్ధ దంపతుల ఆలనాపాలనా చూసే పనిలో చేరింది. పొలం అమ్మి తనకు డబ్బు ఇవ్వాలని కొడుకు వేధిస్తున్నాడట.రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం చిన్నసన్నకారు రైతుల దుస్థితి దాదాపు ఇదే.

 

ఆయా కుటుంబాల్లోని వారసులు ఇతర వ్యాపకాల్లో నిమగ్నమవడం లేదా కన్నవాళ్లను పట్టించుకోకపోవడం సాధారణమైపోయింది. పంటలు సాగు చేసే ఓపిక లేక నగరాలకు వలసబాట పడుతున్నారు. వ్యవసాయం లాభసాటిగా లేకపోవడం.. ప్రస్తుత జీవన వ్యయానికి తగ్గట్లు ఆదాయం రాకపోవడంతో బక్క రైతులు సాగు వదిలేస్తున్నారు. పొట్ట చేతబట్టుకొని నగరాలకు వలసబాట పడుతున్నారు. పది మందికి అన్నం పెట్టిన వారు నేడు కడుదయనీయ స్థితిలో ప్రాణాలు నిలుపుకోవడానికి నానా అవస్థలు పడుతున్నారు.ఇక కౌలు రైతులది మరో సమస్య.

 

రాష్ట్రంలో సెంటు భూమి లేకుండా పూర్తిగా కౌలు సాగు మీదనే ఆధారపడిన కుటుంబాలు 18 లక్షలుంటాయి. అందులో మూడొంతులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలే ఉన్నాయి. ఈ ఏడాది అకాల వర్షాలతో ఖరీఫ్ పంటలు దెబ్బతిన్నాయి. కొద్దోగొప్పో పండినా అదంతా కౌలు, పెట్టుబడికే చాలదు. ప్రధానంగా రబీ పంటలే కీలకం. అకాలవర్షాలకు మొక్కజొన్న మొలకెత్తింది.ధాన్యం తడిసి రంగు మారింది. ఆరబెట్టిన మిర్చి వర్షార్పణమైంది. పసుపు కుళ్లిపోయింది. మామిడి పంట సైతం మంగు తెగులు సోకి ఎకరానికి ఐదారు టన్నుల దిగుబడి తగ్గిపోయింది.

అడుగంటిన భూగర్భ జలాలు

వచ్చిన పంట కూడా గాలివానలకు పంటకు రాకముందే రాలిపోయింది. ఇలా రబీలో సాగయిన విస్తీర్ణంలో 9 లక్షల ఎకరాల్లో పంట దెబ్బతిని కౌలు రైతులను నిండా ముంచేసింది. మళ్లీ కౌలు చేపట్టే తాహతు లేక బతుకుదెరువు కోసం నగరాలకు వలసపోతున్నారు.మొత్తం పంటలసాగులో 75 శాతం కౌలు రైతులుంటే అందులో ఒక్క శాతం మందికి కూడా ప్రభుత్వ సాయం అందడం లేదు. కౌలుదారి చట్టంలోని లోపాల వల్ల కౌలు రైతులు (సీసీఆర్సీ) గుర్తింపు కార్డులకు నోచుకోవడం లేదు. ఈ క్రాప్లో కౌలు రైతుల పేర్లు నమోదు కావడం లేదు.

 

ప్రభుత్వం అందించే రైతు భరోసా, ఇన్పుట్ సబ్సిడీ, సున్నా వడ్డీ పంట రుణం, పంట నష్ట పరిహారంతో సహా ఏ ఒక్కటీ కౌలు రైతుల దరిచేరడం లేదు. వరుసగా మూడేళ్ల నుంచి కౌలు రైతులు తీవ్రంగా నష్టపోతున్నా ప్రభుత్వం కళ్లుండీ చూడలేని కబోదిలా వ్యవహరిస్తోంది. వరుస నష్టాలతో పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయారు. గత్యంతరం లేక అర్బన్ ప్రాంతాల్లో కూలీలవుతున్నారు.ఎన్నో ప్రభుత్వాలను చూశాం. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం ప్రతి అంశాన్ని రాజకీయ లబ్ది కోణంలో చూస్తున్నందునే కౌలు రైతులు అన్యాయమైపోతున్నారు.

 

గ్రామాల్లో భూయజమానులను ప్రసన్నం చేసుకునేందుకు అధికార పార్టీ తపనపడుతోంది. అందుకే వ్యవసాయానికి ఇచ్చే అన్ని ప్రోత్సాహకాలను వాళ్లకే అందిస్తోంది. వాస్తవ కౌలు రైతులను విస్మరిస్తోంది. భూయజమానుల అనుమతితోనే గుర్తింపు కార్డులు ఇవ్వాలనే నిబంధన వల్ల కౌలు రైతులు దగా పడుతున్నారు. చివరకు పంట కూడా భూ యజమానుల పేరు మీదనే అమ్ముకోవాల్సిన దుస్థితికి దిగజార్చారు. ఇప్పటికైనా ఈ దుర్మార్గాన్ని గుర్తించి కౌలు రైతులు ప్రభుత్వానికి తగిన గుణపాఠం నేర్పాలని కోరుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie