హైదరాబాద్, సెప్టెంబర్ 22, (న్యూస్ పల్స్)
సీపీఐ, సీపీఎం కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటాయా..? కామ్రేడ్ల కోసం హస్తం పార్టీ కీలక సీట్లను వదులుకుంటుందా..? అన్నది ఇప్పుటు హాట్ టాపిక్ గా మారింది. జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో వామపక్షాలు, కాంగ్రెస్ కలిసే కొనసాగుతున్నాయి. తొలుత బీఆర్ఎస్ తో పొత్తును ఆశించిన కామ్రేడ్లకు చేదు అనుభవం ఎదురైంది. దీంతో వాళ్లు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. సీపీఐ హుస్నాబాద్, కొత్తగూడెం, మునుగోడు, బెల్లంపల్లి, దేవరకొండ స్థానాలను ఆశిస్తోంది. సీపీఎం భద్రాచలం, పాలేరు, మిర్యాలగూడ, మధిర, ఖమ్మం, ఇబ్రహీంపట్నం సెగ్మెంట్లు ఆశిస్తోంది.
ఈ సెగ్మెంట్లలో కాంగ్రెస్ పార్టీ తరఫున పార్టీకి ముఖ్యనేతలు దరఖాస్తు చేసుకున్నారు. కాంగ్రెస్ తో సంప్రదింపులు, పోటీ చేసే స్థానాలపై చర్చించేందుకు సీపీఐ, సీపీఎం ముఖ్య నేతలు ఇవాళ సీపీఎం రాష్ట్ర కార్యాలయం ఎంబీ భవన్ లో సమావేశమయ్యారు.సీపీఎం, సీపీఐ పొత్తు అంశాలనే చర్చించామని, కాంగ్రెస్ విషయం ప్రస్తావనకే రాలేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చెబుతున్నారు. హుస్నాబాద్ స్థానాన్ని సీపీఐ ఆశిస్తుండగా ఇక్కడి నుంచి కాంగ్రెస్ తరపున పోటీకి మాజీ ఎంపీ పొన్నం, ప్రవీణ్ రెడ్డి దరఖాస్తు చేసుకున్నారు. సీపీఎం పాలేరు సెగ్మెంట్ ను అడుగుతున్న విషయం తెలిసిందే.
ఇక్కడి నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పోటీకి సిద్ధమవుతున్నారు. ఖమ్మం సీటునూ కామ్రేడ్లు అడుగుతున్నారు. ఇక్కడి నుంచి ఇటీవలే కాంగ్రెస్ లో చేరిన తుమ్మల నాగేశ్వరరావు పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఇబ్రహీంపట్నం టికెట్ ను మల్ రెడ్డి రంగారెడ్డి ఆశిస్తుండగా.. సీపీఎం ఈ స్థానాన్ని కోరుతోంది. మధిర నుంచి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ స్థానం కోసం సీపీఎం పట్టుబడుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ తో పొత్తు కుదురుతుందా..? చర్చల ద్వారా కొన్ని స్థనాలను వదులుకొని పోటీకి దిగుతారా..? సీపీఐ, సీపీఎం కలిసి బరిలోకి దిగుతారా..? అన్నది చర్చనీయాంశంగా మారింది.