Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

ఆలూ లేదు… చూలు లేదు…

0

హైదరాబాద్, అక్టోబరు 12, (న్యూస్ పల్స్)

కొత్తగా అధ్యక్ష పదవి చేపట్టిన కిషన్ రెడ్డిని అయినా ప్రశాంతంగా పని చేసుకోనివ్వాలని బండి సంజయ్ చెప్పారు. అంతటితో ఆగకుండా ఇకనైనా ఢిల్లీ వెళ్లి ఫిర్యాదులు చేయడం ఆపాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు మరో అడుగు ముందుకేసి కిషన్ రెడ్డిని సీఎం చేయాలనడం చర్చనీయాంశంగా మారింది. అసలు బీజేపీ చరిత్రలో ఇలా ఎన్నికల ముందే బహిరంగంగా ఫలానా నేత సీఎం కావాలని చెప్పిన ఉదంతాల్లేవు. ఇప్పుడు తెలంగాణ బీజేపీలో అన్నిరకాలుగా పార్టీ కట్టుదాటేసినట్టే కనిపిస్తోంది. బండి సంజయ్ ని అధ్యక్ష పదవి నుంచి తప్పించడంతో తనకు కన్నీళ్లొచ్చాయని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పారు. కొందరు బీజేపీకి గుడ్ బై చెప్పబోతున్నారని, గత వారం రోజులుగా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. బుజ్జగించేందుకు స్వయంగా ఈటల రాజేందర్ రంగంలోకి దిగి చర్చలు జరిపినా ఫలితం లేకపోయింది. పార్టీ బలోపేతం విషయం పక్కనపెట్టి సీఎం జపం కూడా నేతలు మొదలుపెట్టడం హైకమాండ్ కు షాకిచ్చే విషయమే. కిషన్ రెడ్డి వచ్చాక అయినా సమస్యలు సద్దుమణుగుతాయని భావిస్తే, కొత్త సమస్యలు వచ్చే అవకాశం ఉండటం, మరింత కలవరపరిచే విషయం. అసలు బీజేపీ బేసిక్ సూత్రాల్ని ఇప్పుడు తెలంగాణ బీజేపీలో ఎవరూ పాటించడం లేదనే వాదన గట్టిగా వినిపిస్తోంది.

అమిత్ షాతో బండి భేటీ

నామమాత్రపు పార్టీగా ఉన్నప్పుడే పార్టీలో క్రమశిక్షణ ఉండేదని, ఇప్పుడు కాస్త ఊపొచ్చాక ఇలా విపరీత పోకడలు కనిపించడం ఏంటని సీనియర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీజేపీలో పదవులు వస్తుంటాయి. పోతుంటాయి. వచ్చినవాళ్లు చంకలు గుద్దుకోవడం, పోయినవాళ్లు ఏదో కోల్పోయినట్టు బాధపడటం పెద్దగా ఉండేవి కాదు. కానీ గతానికి భిన్నంగా బండి సంజయ్ పదవి పోయిన దగ్గర్నుంచీ నర్మగర్భ వ్యాఖ్యలు చేస్తున్నారు. కిషన్ రెడ్డి ముందే ఆయన్నైనా ప్రశాంతంగా పనిచేయనీయండని చెప్పడం హెచ్చరికనే అన్న చర్చ జరుగుతోంది. తెలంగాణ బీజేపీలోని విబేధాలు తారా స్థాయికి చేరాయని స్పష్టమైపోయింది. స్వయంగా హైకమాండ్ కూడా రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దే వరకు వచ్చింది. కొత్తగా వచ్చిన ఇద్దరు నేతలను కూడా ఢిల్లీకి పిలిపించి మాట్లాడింది అధినాయకత్వం. కట్ చేస్తే అప్పటి వరకు శభాష్ సంజయ్ జీ అంటూ భుజం తట్టి పలుమార్లు కితాబు ఇచ్చిన కమలం పార్టీ పెద్దలు సంజయ్ కు షాక్ ఇచ్చారు. పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించేశారు. వెనువెంటనే పార్టీ సీనియర్ నేత, కేంద్రమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డిని రాష్ట్ర అధ్యక్షుడిగా నియమిస్తున్నట్లు ప్రకటన కూడా వచ్చేసింది. ఫలితంగా అసలు తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోందన్న చర్చ జోరుగా జరిగింది. అయితే సంజయ్ ను తప్పించటంపై పార్టీలోని కేడర్ చాలా అసంతృప్తితో ఉన్నారు. సంజయ్ అధ్యక్షుడు అయిన తర్వాతనే పార్టీకి ఊపు వచ్చిందని, అలాంటి నేతను ఎన్నికల వేళ తప్పించటమేంటన్న పలువురు నేతలు ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా పార్టీలోని నేతలు వర్గాలుగా విడిపోయి పని చేస్తున్నారనే అంశాన్ని ఓ రకంగా ఎత్తిచూపినట్లు అయింది. మొత్తంగా సంజయ్ కామెంట్స్ తో తెలంగాణలో నాయకత్వ మార్పునకు బలమైన కారణాలు దొరికాయనే చెప్పొచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే కొత్త అధ్యక్షుడు కిషన్ రెడ్డి నాయకత్వంలోనైనా నేతలంతా సమైక్యంగా పని చేస్తారా అంటే ప్రశ్నార్థకంగా మారింది.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie