Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

ఆవులకు సరోగసి…

0

ఒంగోలు, సెప్టెంబర్ 15

ఒంగోలు జాతి ఆవుల పునరుజ్జీవం, సంరక్షణ కోసం చేసిన ప్రయోగం విజయవంతం అయ్యింది. ఆధునిక పరిజ్ఞానం ద్వారా ఒంగోలు జాతి ఆవులను పునరుజ్జీవం కోసం పశువైద్యులు ప్రయోగాత్మకంగా చేసిన ప్రక్రియ సక్సెస్‌ను అందుకుంది. బాపట్ల జిల్లా మార్టూరు మండలం బొల్లాపల్లిలో ఓపీయూ, ఐవీఎఫ్‌ ఈటీ టెక్నాలజీతో ఒంగోలు జాతి ఆవు గర్భంలో ప్రవేశపెట్టిన పిండం రూపుదాల్చగా.. మేలు జాతి ఒంగోలు కోడె దూడకు ఆవు జన్మనిచ్చింది.ప్రకాశం జిల్లా చదలవాడ పశుఉత్పత్తి క్షేత్రం పశు వైద్యులు డాక్టర్‌ సోమశేఖర్‌ భద్రపరిచిన ఒంగోలు జాతి ఆవు పిండాన్ని.. గతేడాది నవంబరు 21న బొల్లాపల్లిలో ఉన్న శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం గోశాలలోని ఆవులోకి ప్రవేశపెట్టారు. ఆ ఆవును కోలలపూడి పశువైద్యురాలు మాధవీలత ఎంపిక చేశారు.

9 నెలల 20 రోజులు తర్వాత ఈ ఆవుకు మేలు జాతి ఒంగోలు కోడె దూడ జన్మించింది. చదలవాడ పశుఉత్పత్తి క్షేత్రం నుంచి పశు వైద్యులు బొల్లాపల్లి గ్రామం వచ్చి దూడను పరిశీలించారు. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో.. రాబోయే రోజుల్లో ఒంగోలు జాతి ఆవుల పునరుజ్జీవం కోసం మరికొన్ని ఆవులలో కూడా పిండం ప్రవేశపెట్టి ఇలాగే ప్రయోగం చేయాలని భావిస్తున్నారు.దేశంలో తొలిసారిగా సరోగసి పద్ధతిలో తిరుపతిలోని ఎస్వీ గోశాలలో ఒంగోలు ఆవుకు సాహివాల్ దూడ జన్మించిన సంగతి తెలిసిందే. టీటీడీ, ఎస్వీ పశువైద్య విశ్వవిద్యాలయం సంయుక్తంగా దేశావాళీ గోజాతులను అభివృద్ధి చేయాలని ఆలోచన చేసింది. గతేడాది ఎంవోయు కుదుర్చుకుని మేలు రకమైన దేశవాళీ గో జాతిని అభివృద్ధి చేసే క్రమంలో ఎస్వీ గో సంరక్షణ శాలలోని మేలు జాతి ఆవుల నుండి అండం సేకరించి.. ఎస్వీ పశువైద్య విశ్వవిద్యాలయంలోని ఐవిఎఫ్ ల్యాబ్ లో కృత్రిమంగా పిండాలను అభివృద్ధి చేశారు . వీటిని టీటీడీ గోశాలలోని ఆవులలో ప్రవేశపెట్టి దేశంలోనే తొలిసారిగా విజయం సాధించారు.

ఒంగోలు ఆవుకు జన్మించిన సాహివాల్ దూడకు పద్మావతి అని నామకరణం చేశారు.తిరుమల శ్రీవారి ఆలయంలో ధూప దీప నైవేద్యాలకు, నిత్య కైంకర్యాలకు అవసరమయ్యే పాలు, పెరుగు, వెన్న, నెయ్యిని దేశవాళీ ఆవుపాల నుండి ఉత్పత్తి చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం ఇప్పటికే 200 దేశీయ గోవులను దాతలు సమకూర్చారు.. మరో 300 గోవులను సమకూర్చేందుకు సిద్ధంగా ఉన్నారు. ఆవుల ఆరోగ్య పరంగా, అధిక పాల దిగుబడి దిశగా నాణ్యత కలిగిన దాణా తయారీ చేసుకోవడానికి ఇటీవలే గోశాలలో ఫీడ్ మిక్సింగ్ ప్లాంట్ ప్రారంభించారు. గోశాలలో రోజుకు సుమారు 3 వేల నుండి 4 వేల లీటర్ల ఆవు పాలను ఉత్పత్తి చేయనున్నారను.

రోజుకు 60 కేజీల స్వచ్ఛమైన నెయ్యిని సాంప్రదాయ పద్ధతిలో తయారు చేసి స్వామి వారి నిత్య కైంకర్యం, నైవేద్యాలకు వాడేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.గో ఆధారిత వ్యవసాయాన్ని ప్రోత్సహించడంలో భాగంగా రైతులకు టీటీడీ ఉచితంగా గోవులను అందిస్తోంది. రానున్న ఐదేళ్లలో 324 మేలు రకమైన సాహివాల్ గోజాతి దూడలను ఉత్పత్తి చేయాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా పిండ మార్పిడి చేయబడిన ఆవులలో ఇప్పటి వరకు 11 గోవులు గర్భం దాల్చాయి. రానున్న రోజుల్లో ఇంకొన్ని సాహివాల్ దూడలు జన్మించనున్నాయి. లింగ నిర్ధారిత వీర్యాన్ని ఎస్వీ గోశాలలో ఉన్న సాహివాల్, గిర్ గోవులలో కృత్రిమ గర్భధారణ ద్వారా ప్రవేశపెట్టనున్నారు. దీనివల్ల సరోగసి చెందే ఆవు లక్షణాలు దూడకు రావంటున్నారు. ఈ కార్యక్రమం ద్వారా మేలు రకమైన దేశీయ జాతి గోవులను రైతులకు సబ్సిడీపై అందించవచ్చని భావిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie