Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

ఉమ్మడి నల్గోండలో గులాబీకి ఇంటి పోరు

0

నల్గోండ, సెప్టెంబర్ 14

నల్లగొండ జిల్లాలోని మూడు నియోకవర్గాల్లో బీఆర్ఎస్ కు అసమ్మతి నేతలతో చిక్కొచ్చిపడింది. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు అధిష్టానం సీట్లు కేటాయింపుపై అసంతృప్తితో ఉన్న స్థానిక నేతలు… అభ్యర్థులను మార్చాలని పట్టుబడున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 12 అసెంబ్లీ స్థానాలకు అధికార బీఆర్ఎస్ తన సిట్టింగ్ ఎమ్మెల్యేలనే అభ్యర్థులుగా ప్రకటించింది. ఇందులో మూడు నియోజకవర్గాల్లో సిట్టింగ్ ల టికెట్లను క్యాన్సిల్ చేయాలని, కొత్త అభ్యర్థులను ప్రకటించాలన్న డిమాండ్ పెరిగిపోయింది.

టికెట్లు ప్రకటించిన రోజు నుంచే దేవరకొండ, నాగార్జున సాగర్, కోదాడ అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన బీఆర్ఎస్ నాయకులు స్థానికంగా అసమ్మతి కుంపట్లు రాజేస్తున్నారు. దేవరకొండ, కోదాడ ఎమ్మెల్యేలు రవీంద్ర కుమార్ నాయక్, బొల్లం మల్లయ్య యాదవ్ లు అసమ్మతి నాయకులను బుజ్జగించే ప్రయత్నాలు చేసినా ఆ పాచికలు పారలేదు. పోనీ హైకమాండ్ ఈ విషయం చూసుకుంటుందిలే అనుకుని వదిలేద్దామంటే రోజుకో చోట అసమ్మతి నాయకులు భేటీలు జరుపుతూ తమ వాణి వినిపిస్తున్నారు. చివరకు అధినాయకత్వం కూడా వీరిని పిలిపించి సముదాయించే ప్రయత్నాలేవీ చేయలేదు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్లు ఇచ్చినా.. చివరిలో పార్టీ అవసరాలు, ప్రత్యేక పరిస్థితుల్లో కొన్ని చోట్ల అభ్యర్థుల మార్పు ఉండే అవకాశం ఉందని టికెట్ల ప్రకటన సందర్భంగా బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన వీరికి ఊతంగా మారింది.

ఈ కారణంగానే తమ అభ్యర్థులను మార్చాల్సిందేనని పట్టుబడుతున్నారు.తమ గోడును పెడ చెవిన పెట్టి ఒకవేళ సిట్టింగ్ అభ్యర్థులను మార్చకుంటే ఏం చేయాలన్న అంశంపైనా అసమ్మతి నాయకులు ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ నాయక్ తమకు ముందు నుంచీ పట్టించుకోలేదని, ఎలాంటి ప్రాధాన్యం కూడా ఇవ్వలేదని, మళ్లీ ఈ సారి గెలిస్తే.. రాజకీయంగా తమకు సమాధి తప్పదన్న అభిప్రాయంలో దేవరకొండ అసమ్మతి నాయకులు ఉన్నారు. ఎస్టీ రిజర్వుడు స్థానమైనా దేవరకొండ నుంచి 2018లో తొలిసారి బీఆర్ఎస్ విజయం సాధించింది. గతంలో ఇక్కడ కాంగ్రెస్ , లేదంటే సీపీఐ విజయాలు సాధిస్తూ వచ్చాయి. సుదీర్ఘ కాలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి కూడా ఇక్కడ గెలవడం సాధ్యం కాలేదు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగిన సీపీఐ నుంచి రవీంద్రకుమార్ నాయక్ ఇక్కడి నుంచి గెలిచారు. కానీ, ఆ తర్వాత సీపీఐని వీడి గులాబీ కండువా కప్పుకున్నారు. అయితే ముందు నుంచీ పార్టీలో ఉన్న సీనియర్లను దగ్గరకు తీయలేదు. వారిని కలుపుకొని వెళ్లలేదు. 2018లో బీఆర్ఎస్ టికెట్ పై ఆయన గెలిచిన తర్వాత బీఆర్ఎస్ పాత నాయకత్వాన్ని పూర్తిగా పక్కన పెట్టారు. ఈ కారణంగానే ఇప్పుడు వీరంతా తిరుగుబాటు చేశారు. మున్సిపల్ ఛైర్మెన్ ఆలంపల్లి నర్సింహ నాయకత్వంలో వీరు ఏకమవుతున్నారు. దేవరకొండ మున్సిపల్ మాజీ ఛైర్మన్ వడ్త్యా దేవేందర్ కు టికెట్ ఇవ్వాలని పట్టుబుతున్నారు. ప్రతీ రోజూ ఏదో ఒక చోట సమావేశం అవుతూ తమ వాయిస్ పెంచుతున్నారు.

రవీంద్ర కుమార్ ను మార్చి దేవేందర్ నాయక్ కు టికెట్ ఇవ్వకుంటే పార్టీ మారాలని నిర్ణయించుకున్నారని విశ్వసనీయంగా తెలిసింది.నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే నోముల భగత్ కు, స్థానిక నాయకత్వానికి పొసగడం లేదు. ఉమ్మడి నల్లగొండ స్థానిక సంస్థల శాసన మండలి సభ్యునిగా ఉన్న ఎంసీ కోటిరెడ్డి వర్గీయులూ భగత్ మార్పును డిమాండ్ చేస్తున్నారు. వీరిలో ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి సహా అత్యధికులు గతంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కుందూరు జానారెడ్డి అనుచరులే కావడం గమనార్హం. ఎమ్మెల్సీ కోటిరెడ్డిని మినహాయిస్తే.. అసమ్మతి వర్గంలోని అత్యధికులు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నట్లు చెబుతున్నారు. వీరిలో జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, ఇతర స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారని అంటున్నారు.కోదాడ నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీడీపీ నుంచి బీఆర్ఎస్ లోకి వచ్చి టికెట్ సంపాదించి విజయం సాధించిన ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కు ఇంటిపోరు తప్పడం లేదు. మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావు, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు శశిధర్ రెడ్డి, పార్టీ నేతలు మహ్మద్ జానీ, ఎర్నేని బాబు, డీసీసీబీ మాజీ ఛైర్మన్ పాండురంగారావు, మెజారిటీ జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, కోదాడ మున్సిపాలిటీలో ఛైర్ పర్సన్ సహా పలువురు కౌన్సిలర్లు బొల్లం మల్లయ్య యాదవ్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. అధిష్టానం ఒక వేళ అభ్యర్థిని మార్చకుంటే.. వీరిలో అత్యధికులు పార్టీ మారే ఆలోచనలో ఉన్నారని బీఆర్ఎస్ వర్గాల నుంచే సమాచారం అందుతోంది. ఇప్పుడు.. ఆయా నియోజకవర్గాలోని బీఆర్ఎస్ అసమ్మతి రాజకీయాలు, పరిణామాలను పరిశీలిస్తే.. ఈ వ్యవహారమంతా కాంగ్రెస్ కు కలిసొచ్చేలా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie