Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

ఏయూ తెలుగు విభాగం లో గుంటూరు శేషేంద్రశర్మ జయంతి వేడుకలు

తెలుగు సాహిత్యాన్ని ప్రపంచమార్గం పట్టించిన ఇంద్రజాలకుడు శేషేంద్ర

0

విశాఖపట్నం

ఆంధ్రవిశ్వకళాపరిషత్,తెలుగు విభాగం మరియు  సంగీత నృత్యశాఖ,సమైక్యభారతి & విశాఖ రచయితల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో గుంటూరు శేషేంద్రశర్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి.ముందుగా గుంటూరు శేషేంద్రశర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.అనంతరం జరిగిన సభకు తెలుగు శాఖాధిపతి ఆచార్య జర్రా అప్పారావు అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా ప్రముఖ వైద్య నిపుణులు,విశాఖ రసఙ్ఞ వేదిక వ్యవస్ధాపక అధ్యక్షులు డా జి రఘురామారావు హాజరయ్యారు.వారు విద్యార్ధులనుద్దేశించి మాట్లాడుతూ గుంటూరు శేషేంద్ర శర్మ కవిత్వం ఇంద్రజాలయుతమైనదని,తెలుగు సాహిత్యాన్ని ప్రపంచ మార్గం పట్టించిన ఇంద్రజాలకుడు శేషేంద్రన్నారు.

ఆయన కవిత్వం ప్రజలభాషలో రాయబడి విప్లవ చైతన్యపూరిత స్పృహను కల్గిస్తుందన్నారు.చీకటి గుహలలోనుండి వెలికివచ్చిన కాంతిపుంజంలాంటిది ఆయన కవిత్వమని,ఆ కవిత్వంలో రసఙ్ఞతతో పాటు సామాజిక దృకోణం కల్గించగల శక్తి ఉందని, పదునైన ఖడ్గాన్ని  ఉపయోగించే వ్యక్తి నైపుణ్యం వలె శేషేంద్రకవిత్వంలో సృజనశీలత ఉందన్నారు.ప్రపంచ స్ధాయి సాహిత్యంతో పోటీపడగల శక్తి శేషేంద్రకవిత్వంలో ఉందని అందుకే తెలుగు సాహిత్యం నుండి నోబుల్ బహుమతికి నామినేట్ అయిన  నాదేశం-నాప్రజలు కావ్య వైశిష్ట్యాన్ని నేటి యువతతో పాటు ప్రతి సాహితీకారుడు తెలుసుకోవాలన్నారు.ఈ నాడు చాలామంది రాజకీయనాయుకులు తమ ఉపన్యాసాలలో శేషేంద్ర కవితా పంక్తులను ఉదాహరిస్తూ యువతను ఊర్రూతలూగిస్తున్నారంటే అందుకు కారణం ఆయన కవిత్వం విప్లవ ప్రబోధం కలిగించే గొప్ప శక్తిసంపదతో కూడుకున్నదన్నారు.

     విశిష్ట అతిథిగా విచ్చేసిన గీతం విశ్వవిద్యాలయ ఆంగ్ల విశ్రాంతాచార్యులు ఆచార్య ప్రయాగ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ శేషేంద్ర కవిత్వంలో అద్భుతమైన ప్రతీకలు తొణికిసలాడుతాయన్నారు.భాష పరిణామశీలమైందని దానిని గ్రహించి రచనల్లో పొందుపరిచిన సాహిత్యం సమాజాభివృధ్ధికి తోడ్పడుతుందని లేకపోతే సాహిత్య మనుగడ ప్రశ్నార్ధకమౌతుందనే విషయాన్ని శేషేంద్ర కవితల్లో పొందుపర్చారన్నారు.ఆయనబహుభాషా పండితుడి కావటంచేత అనువాద సాహిత్యంలో విశేషమైన కృషిచేసారని తెలుగు సాహిత్య మాధూర్యాన్ని దశదిశలా విస్తరించిన సృజనశీల,అభ్యుదయ సాహితీకారుడన్నారు.

ఆత్మీయ  అతిథిగా విచ్చేసిన ఆచార్య వెలమల సిమ్మన్న మాట్లాడుతూ తెలుగు సాహితీ  సంద్రాన్ని పరిపుష్టం చేసిన మహానీయుడు  శేషేంద్రశర్మఅని  కొనియాడారు అనంతరం అతిథులను ఆచార్యులు, విద్యార్ధులు ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమం లో తెలుగు ఆచార్యులు డా ఏ సీతారత్నం ,డా ఏ ఈశ్వరమ్మ ,ఆచార్య బూసి వెంకటస్వామి ,డా కట్టెపోగు రత్నశేఖర్ ,డా పెండ్యాల లావణ్య ,డా ఏ వెంకటేశ్వర్లు (యోగి ),శ్రీ అడపా  రామకృష్ణ,సమైక్యభారతి జాతీయ సమన్వయకర్త శ్రీ పి.కన్నయ్య,డా దామెర వెంకటసూర్యారావు,శ్రీ మేడా మస్తానరెడ్డి,డా మరడాన సుబ్బారావు,డా కె వి యస్ మూర్తి,పరమేశ్వరరావు,విస్సా రామకృష్ణ,పరిశోధక విద్యార్ధులు,స్నాతకోత్తర విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు .

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie