విజయవాడ, సెప్టెంబర్ 12, (న్యూస్ పల్స్) ఉమ్మడి కృష్ణా జిల్లాలో మంచి పలుకుబడి కలిగిన రాజకీయవేత్త అనడంలో సందేహం లేదు. మరీ ముఖ్యంగా బెజవాడ రాజకీయాలలో ఆయన ఆధిపత్యం తిరుగులేనిది. తాజాగా చంద్రబాబు అరెస్ట్ నేపధ్యంలో ఆయన వెనక్కే కనిపించారు. పార్టీలో పట్టు కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఆయన గత ఎన్నికలలో విజయవాడ నుంచి ఎంపీగా ఎన్నిక కావడమే అంటారు. విజయవాడ లోక్ సభ నియోజకవర్గ పరిధిలో అత్యధిక అసెంబ్లీ స్థానాలలో వైసీపీ విజయం సాధించినా.. లోక్ సభ సభ్యుడిగా కేశినేని నాని గెలవడమే బెజవాడలో ఆయనకు ఉన్న ఆదరణకు నిదర్శనంగా చెబుతారు.అటువంటి నాని ఇప్పుడు తన రాజకీయ భవిష్యత్ ఏం కాబోతోందన్న బెంగలో పడ్డారు.
అసలు ఆయన రాజకీయాలలోకి రావడమే కాకతాళీయం అంటారు ఆయన ప్రస్థానం గురించి తెలిసిన వారు. అసలు నాని రాజకీయ నాయకుడు కాదు.. సినిమా హీరో కావాల్సిన వారు. తొలుత ఆయన తన భవిష్యత్ కు, ఎదుగుదలకు సినీ హీరోగా కెరీర్ ప్రారంభించాలని భావించారు. ఇందు కోసం ఆయన దర్శక రత్న దాసరి వద్దకు వెళ్లారు. దాసరి అప్పట్లో కొత్త నటీనటులతో ఓ సినిమా తీసే యోచనలో ఉన్నారు. అందులో ఇద్దరు హీరోలలో ఒకరిగా నానికి దాదాపు చాన్స్ ఇచ్చేశారు. అయితే అప్పట్లో కేశినేని నానితో పోటీ పడి చివరి నిముషంలో కేశినేని నాని అవకాశాన్ని తన్నుకు పోయిన వ్యక్తి కలెక్షన్ కింగ్ గా విలక్షణ నటుడిగా గుర్తింపు పొందిన మోహన్ బాబు. ఔను అప్పటిలో చివరి క్షణంలో సినీమా హీరోగా అవకాశం తప్పిపోవడంతో కేశినేని నాని ఇక సినిమాలకు గుడ్ బై చెప్పేసి వ్యాపార రంగంలో స్థిరపడ్డారు.
కేశినేని ట్రావెల్స్ స్థాపించి రవాణా రంగంలో రాణించారు.అక్కడి నుంచి ఆయన తెలుగుదేశం పార్టీలో చేరి ఎంపీగా ఎదిగారు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఆయన కెరీర్ లో ఏరీ ఆయన చాయిస్ కాదు.. చాన్స్ అంతే. రాజకీయంగా తన ఎదుగుదలకు దోహదపడిన తెలుగుదేశంతో గత కొంత కాలంగా ఆయన అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. 2019 ఎన్నికలలో తెలుగుదేశం పరాజయం పాలై విపక్ష పాత్రకు పరిమితమైన నాటి నుంచీ అధికార వైసీపీతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నట్లుగా నాని తీరు ఉంది. పార్టీలోని కొందరు నాయకులతో తన కున్న విభేదాలను అడ్డుపెట్టుకుని తన స్థాయిని మరిచి మరీ సొంత పార్టీ తెలుగుదేశంపై, ఆ పార్టీ అధినాయకత్వంపై విమర్శలు గుప్పించి ఉద్దేశపూర్వకంగా పార్టీకి దూరం అవుతున్న సంకేతాలు ఇచ్చారు. అధికార వైసీపీ కేశినేని నాని అదే సమయంలో అధికార వైసీపీ నేతలపై పొగడ్తల వర్షం కురిపించి ఇక తెలుగుదేశం పార్టీ కూడా తనను లెక్కలోంచి తీసేసే పరిస్థితిని స్వయంగా తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలోనే కేశినేని నాని వైసీపీ గూటికి చేరే అవకాశాలున్నాయని పరిశీలకులు పలు సందర్భాలలో విశ్లేషించారు.
తెలుగుదేశం పార్టీ కూడా అదే నిర్ణయానికి వచ్చేసి కేశినేని నాని స్థానంలో ఆయన సోదరుడు కేశినేని చిన్నిని ప్రోత్సహించడం ప్రారంభించింది. వచ్చే ఎన్నికలలో విజయవాడ లోకసభ స్థానం నుంచి కేశినేని చిన్నిని పార్టీ అభ్యర్థిగా నిలపాలన్న నిర్ణయానికి వచ్చేసింది. దీంతో బెజవాడ బరి అన్నదమ్ముల సవాల్ గా మారనున్నదన్న భావన సర్వత్రా కలిగింది. అయితే వైసీపీ పట్ల పెల్లుబుకుతున్న ప్రజా వ్యతిరేకతను గమనించారో ఏమో కానీ కేశినేని నాని తన ప్రయాణం తెలుగుదేశంతోనే అని పదే పదే చెబుతూ పార్టీ అధిష్ఠానం మెప్పు పొందాలన్న ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన పదే పదే తాను విజయవాడ లోక్ సభ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా రానున్న ఎన్నికలలో నిలబడతానని చెబుతున్నారు. అదే సమయంలో పార్టీ అధినేత చంద్రబాబును పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. హస్తినలో ఆయనకు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు కూడా నిరాకరించిన సంగతిని మరిచిపోయి ఆయన వంటి దార్శనికుడు, నిజాయితీ పరుడు లేడంటూ కీర్తిస్తున్నారు. తాజాగా కంచికచర్లలోని ఏకత్వ ఇంటర్నేషనల్ స్కూల్ భూమి పూజ కు హాజరైన కేశినేని నాని మరోసారి చంద్రబాబుపై ప్రశంసల వర్షం కురిపించారు. దేశ రాజకీయాల్లోనే చంద్రబాబు వంటి నిజాయితీ పరుడు లేడన్నారు.
నాలుగు దశాబ్దాల రాజకీయాలలో మచ్చ లేని వ్యక్తిగా చంద్రబాబుది స్వచ్ఛమైన వ్యక్తిత్వమన్నారు.ఇంతకీ అంత చేసిన కేశినేని నాని ఇప్పుడు ప్లేట్ ఫిరాయించి తెలుగుదేశం విశ్వాసాన్ని పొందగలరా అన్న అనుమానాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతున్నాయి. చంద్రబాబు కు ఐటీ నోటీసులపై స్పందించిన కేశినేని నాని నోటీసులు పెద్ద విషయం కాదన్నారు. వివరణ ఇస్తే సరిపోతుందనీ దానిపై అనవసర ఊహాగానాలు వ్యర్థమని వైసీపీకి చురకలంటించారు. అక్కడితో ఆగకుండా తాను తెలుగుదేశంలోనే ఉన్నాననీ, ఉంటాననీ చెబుతూ వచ్చే ఎన్నికలలో విజయవాడ నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా తానే బరిలో ఉంటానన్నారు. ఇక ఏపీలో పొత్తులపై చర్చ గురించి మాట్లాడుతూ పొత్తుల విషయం పూర్తిగా తెలుగుదేశం అధిష్ఠానం నిర్ణయమేననీ, పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే క్యాడర్ అంతా దానికి కట్టుబడి ఉంటుందన్నారు. తాను తెలుగుదేశం పార్టీకి దూరం అవుతున్నానంటూ వస్తున్న వార్తలన్నీ అసత్యాలనీ, తాను పార్టీలోనే పార్టీతోనే ఉంటానని స్పష్టం చేశారు.