జాతీయ భాషగా హిందీని 1949 సెప్టెంబర్ 14న రాజ్యాంగ సభ ఆమోదించిందని ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా సెప్టెంబర్ 14న దేశవ్యాప్తంగా హిందీ భాషా దినోత్సవం జరుపుకుంటున్నామని పి ఆర్ ప్రభుత్వ కళాశాల హిందీ విభాగ అధిపతి పి. హరి రామ్ ప్రసాద్ పేర్కొన్నారు. రమణయ్యపేట ఏపీఐఐసీ కాలనీలో అడబాల ట్రస్ట్ ఆధ్వర్యంలో హిందీ భాషా దినోత్సవం ఘనంగా జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014 నుంచి వినూత్న రీతిలో ప్రధాని నరేంద్ర మోడీ కృషితో అన్ని కేంద్ర ప్రభుత్వ శాఖల్లో హిందీ అమలులోకి వచ్చిందని అన్నారు. దేశంలో సుమారు 14 రాష్ట్రాల్లో ఎక్కువ మంది మాట్లాడే భాష హిందీ అని అన్నారు. హిందీ భాష అంతర్జాతీయ స్థాయి భాషగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. రవిశంకర్ పట్నాయక్ మాట్లాడుతూ మనకు మాతృభాష తెలుగు అయినా రెండో భాషగా హిందీని నేర్చుకోవాలని అన్నారు.
డాక్టర్ అడ్డాల సత్యనారాయణ మాట్లాడుతూ నేటి ఆధునిక కాలంలో హిందీని నేర్చుకోవడం తప్పనిసరి అని అన్నారు. అనంతరం అడబాల రత్న ప్రసాద్ ఆధ్వర్యంలో హరిరాం ప్రసాద్ ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో చింతపల్లి సుబ్బారావు, ఎస్. నగేష్, సత్యనారాయణ చౌదరి తదితరులు పాల్గొన్నారు.