Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

టీడీపీలో కనిపించని నెంబర్ 2

0

గుంటూరు, సెప్టెంబర్ 14

స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు అరెస్ట్, రిమాండ్‌పై జైలుకెళ్లి నాలుగు రోజులు గడిచిపోయాయి. మెల్లగా ఈ విషయంలో హడావుడి తగ్గిపోతోంది. బాబు అరెస్ట్‌తో టీడీపీకి సానుభూతి దక్కుతుందనే వాదనల్లో నిజమెంత, అసలు జగన్ వ్యూహం ఏమిటి..?టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్‌, రిమాండ్ నేపథ్యంలో ఏపీ రాజకీయాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడిని అరెస్ట్‌ చేస్తే సానుభూతి వస్తుందని తెలిసినా ఏపీ ప్రభుత్వం వెనకాడకపోవడానికి కారణం ఏమిటన్నది అంతుచిక్కని ప్రశ్నగా మారింది. జగన్మోహన్ రెడ్డి అన్ని ఆలోచించుకున్న తర్వాతే చంద్రబాబు విషయంలో ముందడుగు వేశారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు జైలుకెళ్లి మూడ్రోజులు గడిచిపోయాయి. చంద్రబాబును కనీసం గృహ‍ నిర్భాందంలో అయినా ఉంచాలని  ప్రయత్నాలు జరుగుతునే ఉన్నాయి. సిద్ధార్థ లుథ్రా నేతృత్వంలోని టీడీపీ లీగల్‌ టీమ్‌లు ఏసీబీ కోర్టు, ఏపీ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేస్తూనే ఉన్నాయి.

అయితే చంద్రబాబుకు ఊరట దక్కే పరిస్థితులు కనిపించడం లేదు. చంద్రబాబును వీలైనన్ని ఎక్కువ రోజులు జైల్లో ఉంచడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రచారం జరుగుతోంది.చంద్రబాబు జైలుకు వెళ్లిన తర్వాత రాష్ట్రం నిరసనలు హోరెత్తిపోతాయని టీడీపీ భావించింది. అయితే పోలీసుల ఆంక్షలు, నిర్బందాలు, ముందస్తు అరెస్ట్‌లతో ముఖ్యమైన నాయకులు ఎవరు ఇళ్ల నుంచి అడుగు కూడా బయటపెట్టలేకపోయారు. ముందుండి నడిపించే వారు లేకపోవడంతో ద్వితియ శ్రేణి నాయకులు, కార్యకర్తలు సైలెంట్ అయ్యారు. టీడీపీకి బలమైన పట్టున్న విజయవాడ, గుంటూరు ఒంగోలు, ఏలూరు వంటి ప్రాంతాల్లో కూడా పెద్దగా ఆ పార్టీ వర్గాలు బయటకు రాలేకపోయాయి.

చంద్రబాబు నాయుడును గత శనివారం తెల్లవారుజామున ఏపీ సిఐడి అదుపులోకి తీసుకుంది. హెలికాఫ్టర్‌లో విజయవాడ తరలించేందుకు ఏర్పాట్లు చేసినా రోడ్డు మార్గంలోనే వస్తానని బాబు పట్టుబట్టడంతో 12గంటలకు పైగా ప్రయాణించి విజయవాడ చేరుకున్నారు. ఈ మార్గంలో నాలుగైదు చోట్ల మినహా పెద్దగా పోలీసులకు ప్రతిఘటన ఎదురు కాలేదు. చంద్రబాబును కుంచనపల్లిలోని సిట్ కార్యాలయానికి తరలించిన తర్వాత కొన్ని గంటల పాటు నాలుగైదు వందల మంది కార్యకర్తలు మాత్రమే అక్కడ ఆందోళనకు దిగారు. టీడీపీకి ఉన్న ఫాలోయింగ్‌కు జనం పోటెత్తాల్సి ఉన్నా అలా జరగలేదు. హైవే మీద వెళ్లే వారు మినహా అప్పుడు కూడా పెద్దగా టీడీపీ శ్రేణులు ఆందోళనల్లో కనిపించలేదు. విజయవాడ కోర్టు కాంప్లెక్స్‌ దగ్గర కూడా అదే పరిస్థితి కనిపించింది. నాయకులు ఇళ్ల నుంచి బయటకు రాకపోవడంతో కార్యకర్తలు చల్లారిపోయారు. ముఖ్యమైన కొద్దిపాటి నాయకులు మినహా కోర్టు దగ్గర కూడా ప్రశాంతంగానే గడిచింది.

చంద్రబాబును అరెస్ట్ చేస్తే కార్యకర్తలు రగిలిపోయి రోడ్డెక్కుతారని భావించారు. నిజానికి టీడీపీ కార్యకర్తలో ఆవేశంతో ఉన్నా వాళ్లను సరైన మార్గంలో నడిపించే నాయకుడు కనిపించడం లేదు. చంద్రబాబు తప్ప టీడీపీలో మరో నాయకుడు లేకపోవడమే దీనికి కారణం. చంద్రబాబు తర్వాత స్థానం ఎవరిదనే ఆలోచన వస్తే కనుచూపు మేరలో మరో నాయకుడు లేరు. పార్టీని ఒక్కతాటిపై నడిపించే శక్తి కనిపించడం లేదు. బాబు అరెస్ట్‌తో ఆయన కుమారుడు లోకేష్ పాదయాత్రకు బ్రేకులు పడ్డాయి. జైలు నుంచి చంద్రబాబును విడిపించడం మీదే కుటుంబ సభ్యుల దృష్టి ఉంది. ఏపీలో ఏ క్షణానైనా ఎన్నికలు రావొచ్చని ప్రచారం జరుగుతోంది. ముందస్తు ఎన్నికలు, జమిలీ ఎన్నికలు రావొచ్చని రకరకాల కథనాలు ప్రచారంలో ఉన్నాయి. పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లోనే దీనిపై నిర్ణయం ఉంటుందని భావిస్తున్నారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటే పార్లమెంటు ఎన్నికలు జరుగుతాయని ఓ ప్రచారం జరుగుతుంటే, అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సిన రాష్ట్రాల్లో ఎన్నికలు వాయిదా వేసి ఒకేసారి జమిలీఎన్నికలు నిర్వహిస్తారని మరో ప్రచారం జరుగుతోంది. పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయిఎన్నికలను దృష్టిలో ఉంచుకునే చంద్రబాబును అరెస్ట్‌ చేయడానికి ఇదే సరైన సమయం అని జగన్ భావించారనే ప్రచారం ఉంది. కేంద్ర రాజకీయాలను ఒంటి చేత్తో నడిపించానని చెప్పుకునే చంద్రబాబును మూడ్రోజులుగా రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు పరిమితం చేశారు. ఎంత కాలంలో జైల్లో ఉంటారనే దానిపై కూడా క్లారిటీ లేదు. ఐపిసి సెక్షన్ 409 ప్రయోగం ద్వారా చంద్రబాబుకు వెంటనే బెయిల్ రాకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించారు.

మరో రెండు కేసుల్లో కస్టడీ కోరుతూ సిఐడి పిటిషన్లు వేసింది. వాటిలో కూడా చంద్రబాబును నిందితుడిగా పరిగణించాలని కోరింది. ఏసీబీ ప్రత్యేక కోర్టు అందుకు అనుమతిస్తే ఇప్పట్లో బెయిల్ రాదు. ఒక కేసులో బెయిల్ వచ్చినా మరో కేసులో రిమాండ్ కొనసాగించవచ్చు. దీంతో పాటు ఆయనపై మరిన్ని కేసులు నమోదయ్యే అవకాశాలు లేకపోలేదు. అంతిమంగా వీలైనంత ఎక్కువ కాలం చంద్రబాబు జైల్లోనే ఉంటారు.ఎన్నికల సమీపిస్తున్న సమయంలో చంద్రబాబు జైల్లో ఆ ప్రభావం ఖచ్చితంగా పార్టీపై ఉంటుంది. టీడీపీ భావించినట్లు ఆ పార్టీకి సానుభూతి దక్కడం కంటే పార్టీ క్యాడర్‌ను ఒక్కటిగా ఉంచడం కష్టం అవుతుంది.తెలుగుదేశం పార్టీలో ఎలక్షన్ మేనేజ్మెంట్ మొత్తం చంద్రబాబు కనుసన్నల్లోనే జరుగుతుంది. అభ్యర్థుల ఎంపిక నుంచి ఎన్నికల ఖర్చు వరకు ఆయన చూసుకుంటారు. ఇప్పుడు ఆ బాధ్యతలు ఎవరివనే సందేహం తలెత్తుతుంది.మరోవైపు అవినీతి కేసుల్లో మాజీ మంత్రి నారా లోకేష్‌ను కూడా జైలుకు పంపుతారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు, లోకేష్ ఇద్దరు జైలుకు వెళితే ఆ పార్టీని ఎవరు కాపాడలేరన్నది జగన్‌ వ్యూహంగా చెబుతున్నారుఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డిని.. జైలు పక్షి, లక్ష కోట్ల అవినీతి, సిబిఐ కేసులు అంటూ విమర్శించిన టీడీపీకి ఇకపై అలా విమర్శించే అవకాశం లేకుండా పోతుంది. వీటన్నింటికంటే ముఖ్యంగా టీడీపీని దెబ్బతీస్తే తప్ప ఏపీలో బీజేపీ బలపడే అవకాశాలు లేవనే విషయాన్ని ఆ పార్టీ గ్రహించిందని చెబుతున్నారు.

ఏపీలో నంబర్ టూ స్థానానికి రావాలని 2019 నుంచి బీజేపీ చేయని ప్రయత్నాలు లేవు. పార్టీ అధ్యక్షుల్ని మార్చినా పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు.ఏపీలో ఎప్పటికైనా సొంతంగా ఎదగాలనే బీజేపీ అకాంక్ష నెరవేరాలంటే దానికి బలమైన ప్రత్యర్థి టీడీపీయే అవుతుంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు విషయంలో బీజేపీ అగ్రనేతలెవరు జోక్యం చేసుకున్నట్లు కనిపించడం లేదు.చంద్రబాబు విషయంలో ఇతర ప్రాంతీయ పార్టీల నాయకులు కూడా స్పందించడం లేదు. 2019లో కాంగ్రెస్‌తో జట్టు కట్టి ఎన్నికల్లో ఓటమి తర్వాత వారికి గుడ్‌బై చెప్పేశారు. బీజేపీకి దగ్గరయ్యేందుకు నాలుగేళ్లుగా రకరకాల ప్రయత్నాలు చేశారు. అవేమి పెద్దగా ఫలించలేదు. అటు ఎన్డీఏ కూటమికి, ఇటు ఇండియా కూటమికి కాకుండా పోయారు.బాబు అరెస్టైన నాలుగు రోజుల తర్వాత రకరకాల ప్రయత్నాల తర్వాత ఒకరిద్దరు ప్రాంతీయ పార్టీల నాయకులు తమ స్పందన తెలిపారు. కక్ష రాజకీయాల్లో బాబును అరెస్ట్ చేశారని ఎస్పీ, తృణమూల్ కాంగ్రెస్, జేడీయూ వంటి పార్టీలు విమర్శించాయి.

ప్రస్తుత పరిస్థితుల్లో చంద్రబాబు ఏ పక్షం నుంచి రాజకీయంగా కూడా మద్దతు లభించదనే అంచనాతోనే జగన్ టైమ్‌ చూసి దెబ్బ కొట్టినట్టు చెబుతున్నారుఎన్నికలు ఇప్పటికిప్పుడు ముంచుకొచ్చినా, షెడ్యూల్ ప్రకారం జరిగినా ప్రధాన ప్రతిపక్షం పోటీలో నిలిచే పరిస్థితే లేకుండా చేయాలన్నది జగన్ వ్యూహంగా చెబుతున్నారుచంద్రబాబు అరెస్ట్‌తో సొంత పార్టీ నాయకులకు కూడా జగన్‌ పరోక్షంగా ఓ మెసేజ్ ఇచ్చారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ధిక్కార స్వరాలు వినిపిస్తున్న నాయకులకు వార్నింగ్ ఇచ్చినట్లైంది. పార్టీ గీత దాటే వారికి ఫ్యూచర్ ఉండదనే సందేశాన్ని పంపినట్టైంది.ఇప్పటికే వైసీపీని వీడి ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్‌ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వంటి వారు టీడీపీలో చేరిపోయారు. ఎన్నికల్లో టిక్కెట్ రాకపోతే పార్టీ మారాలనే ఆలోచనలో మరికొందరు ఉన్నారు. పిల్లి సుభాష్‌ చంద్రబోస్, బాలినేని శ్రీనివాస రెడ్డి వంటి నాయకులు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు వ్యవహారంతో అసమ్మతి గళాలన్నింటికి చెక్‌ పెట్టేసినట్టేనని చెబుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie