హైదరాబాద్, సెప్టెంబర్ 23, (న్యూస్ పల్స్)
టికెట్ రాని ఎమ్మెల్యేలిద్దరూ బేజార్. టికెట్ వచ్చిన ఎమ్మెల్యే కూడా నారాజ్. ముగ్గురికి ముగ్గురూ కినుక వహించారు. అందులో ఇద్దరైతే ధాం ధూం అన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ టిక్కెట్లు ప్రకటించాక టికెట్లు రాని ఉప్పల్, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యేలతో పాటు టిక్కెట్ వచ్చిన మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత రావు కూడా పార్టీలో కొనసాగాలో లేదో తేల్చుకునేందుకు ఓ డెడ్ లైన్ పెట్టుకున్నారు. వీరిలో స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే చివరికి అలక వీడితే మిగిలిన ఇద్దరూ మరోదారి చూసుకుంటారా.. రాజీపడతారా అన్నదే సస్పెన్స్.టికెట్ రాకపోవటంతో ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి తీవ్ర అసంతృప్తి చెందారు. అధినాయకత్వం కనీసం పిలిచి మాట్లాడకపోవడంపై ఆవేదనకు గురయ్యారు.
15 రోజుల పాటు నియోజకవర్గంలో తిరిగి ప్రజాభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకుంటానని ప్రకటన చేశారు. ప్రెస్‌మీట్ పెట్టి స్టేట్మెంట్ ఇచ్చాక సైలెంట్ అయిపోయిన ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి సడెన్‌గా ప్రభుత్వ కార్యక్రమంలో ప్రత్యక్షమయ్యారు. డబుల్ బెడ్రూం ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఉప్పల్ ఎమ్మెల్యే హోదాలో పాల్గొనడంతో అయన చల్లబడ్డారా అనే టాక్ మొదలైంది.సిట్టింగ్ సీటు మళ్లీ దక్కినా కొడుకుకి ఛాన్స్ రాకపోవటంతో అలకవహించారు మల్కాజ్‌గిరి సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు. పది రోజులపాటు ప్రజల్లో తిరిగి నిర్ణయం తీసుకుంటానని ప్రకటించారు మైనంపల్లి.
ఇదే గ్యాప్‌లో అయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారని, సోనియాగాంధీ సమక్షంలో పార్టీలో చేరతారన్న ప్రచారం జరిగింది. కానీ ఆయన కండువా మార్చలేదు.. ఎటూపోలేదుగానీ ఇంకా సైలెంట్‌గానే ఉండటంతో అసలాయన వ్యూహమేంటో ఎవరికీ అంతుపట్టటంలేదు. తన కుమారుడి రాజకీయ భవిష్యత్ గురించే మైనంపల్లి ఎక్కువ ఆలోచిస్తున్నట్టు సమాచారం. మల్కాజ్‌గిరి నియోజకవర్గంలో దళిత బంధు లాంటి పథకాలకు ప్రభుత్వం బ్రేకేసిందన్న ప్రచారం జరిగినా.. అలాంటిదేమీ లేదని కొట్టిపారేస్తోంది మైనంపల్లి అనుచరవర్గం. ప్రస్తుతం విహారయాత్రలో ఉన్న మైనంపల్లి తిరిగొచ్చాక ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
ఇక నిన్న మొన్నటిదాకా భావోద్వేగంగా స్పందించిన స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే టి.రాజయ్య అలకపాన్పు దిగారు. తన స్థానంలో టికెట్ దక్కించుకున్న కడియంశ్రీహరితో ఆయనకు సయోధ్య కుదిరింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జోక్యంతో చివరికి శ్రీహరికి మద్దతు ప్రకటించారు రాజయ్య. ప్రగతిభవన్‌లో స్టేషన్‌ఘన్‌పూర్ నేతలతో చర్చలు జరిపారు కేటీఆర్. రాజయ్య రాజకీయ భవిష్యత్తుపై కేటీఆర్ హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. దీంతో శ్రీహరి అభ్యర్థిత్వానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు రాజయ్య. ఇద్దరు నేతలు ఒకటి కావటంతో స్టేషన్ ఘన్‌పూర్‌లో టికెట్ ప్రకటప్పటినుంచీ నడుస్తున్న పంచాయితీకి ఫుల్‌స్టాప్ పడినట్లే కనిపిస్తోంది. ఇప్పటిదాకా ఉప్పునిప్పులా ఉన్న నేతలు మొత్తానికి చేతులు కలపటంతో ఇక ఇద్దరూ కలిసే ప్రచారం నిర్వహిస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. రాజయ్య అలకవీడినా.. మిగిలిన ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రం డెడ్‌లైన్లు పెట్టి సైలెంట్‌గా ఉండటంపై ఇంటాబయటా చర్చ జరుగుతోంది.