విశాఖపట్నం
స్కిల్ డెవలప్మెంట్ కేసులో పక్కా ఆధారాలతోనే చంద్రబాబుకు రిమాం డు విధించారని, దీనిలో ఎటువంటి కక్షసాధింపు, దురుద్దేశం లేవని రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత అన్నారు. విశాఖలోని హోటల్లో అధికారిక సదస్సుకు హాజరైన ఆమె ప్రత్యేకంగా విలేకర్ల సమావేశం నిర్వహించి మాట్లా డారు. చట్టం ఎవ్వరికీ అతీతం కాదని, అందరికీ సమానమేనని చెప్పారు. జైల్లో చంద్రబాబుకు ప్రాణహాని ఉందని చెప్పడం ఊహాజనితమన్నారు. అది సానుభూతి, రాజకీయ లబ్ధి కోసం చేసిన ఆరోపణలు మాత్రమేనని పేర్కొన్నారు. రాజమండ్రి జైలులో ఆయనకు అన్ని సదుపాయాలు, సెక్యూరిటీ ఉంటుందని తెలిపారు. టిడిపి పిలుపునిచ్చిన బంద్ ప్రభావం ఎక్కడా కనిపించలేదని చెప్పారు. దీనిని బట్టే చంద్రబాబుపై రాష్ట్ర ప్రజలకు ఉన్న సానుభూతి అర్థమవుతుందని తెలిపారు.