Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

పక్కా ప్లాన్ తో టీ కాంగ్రెస్

0

హైదరాబాద్, సెప్టెంబర్ 14

తెలంగాణ కాంగ్రెస్‌ వీర దూకుడు ప్రదర్శిస్తోంది. మునుపెన్నడూ లేనివిధంగా స్పీడ్‌ పెంచి దూసుకుపోతోంది. ఏదిఏమైనాసరే, ఈసారి కొట్టి తీరాల్సిందే! అన్న కసితో ముందుకెళ్తున్నారు కాంగ్రెస్‌ నేతలు. అధికార బీఆర్‌ఎస్‌కి దీటుగా యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధంచేశారు. ఇంతకీ అదేంటి?. తెలంగాణ కాంగ్రెస్‌ ఏం చేయబోతోంది. ఈ కథనంలో తెలుసుకుందాం..ఆరునూరైనాసరే గెలిచి తీరాల్సిందే-అధికారం చేపట్టాల్సిందే.. ఇదీ తెలంగాణ కాంగ్రెస్‌ పెట్టుకున్న టార్గెట్‌.. అందుకోసం సర్వశక్తులన్నీ ఒడ్డుతోంది కాంగ్రెస్‌ దళం. ప్రతి చిన్న అవకాశాన్నీ వదిలిపెట్టకుండా అస్త్రంగా మలుచుకుంటోంది. ఒకవైపు అభ్యర్ధుల ఎంపికపై కసరత్తు చేస్తూనే, ఇంకోవైపు ప్రజల్లోకి వెళ్లేందుకు వ్యూహరచన చేస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్‌ హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై ఫోకస్‌ పెట్టింది.

అందులో భాగంగా ఇంటింటికీ గ్యారెంటీ కార్డులు పంచబోతోంది. అదే టైమ్‌లో కలిసొచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు సిద్ధమైంది టీపీసీసీ. హైదరాబాద్‌ వేదికగా ఈనెల 15, 16, 17 తేదీల్లో జరగబోతోన్న కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశాల్లో ఎన్నికల శంఖారావం పూరించేందుకు సన్నాహాలు చేసుకుంటోంది. అందుకు సంబంధించిన యాక్షన్‌ ప్లాన్‌ను బయటపెట్టారు సీఎల్పీ నేత భట్టివిక్రమార్క. సిడబ్ల్యూసీ వేదికగా టీకాంగ్రెస్‌ ఏమేం చేయబోతోందో చెప్పుకొచ్చారు.బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ఛార్జిషీట్లు విడుదల చేయబోతోంది టీకాంగ్రెస్‌. ఈనెల పదిహేను తేదీ వరకు ప్రతి నియోజకవర్గంలో ఛార్జిషీట్లు రిలీజ్ చేస్తారు. ముఖ్యంగా ఆయా నియోజకవర్గాల్లోని సమస్యలపైనే మెయిన్‌గా ఫోకస్‌ చేయబోతోంది. ఇక, సీడబ్ల్యూసీ సమావేశాల చివరి రోజు భారీ బహిరంగ సభ నిర్వహించబోతోంది కాంగ్రెస్‌. ఈ వేదికపై నుంచి చారిత్రాత్మక నిర్ణయాలను ప్రకటించబోతున్నట్టు చెప్పారు భట్టివిక్రమార్క. అదే టైమ్‌లో టీకాంగ్రెస్‌ మేనిఫెస్టో కమిటీ కూడా హామీలపై విస్తృత చర్చలు జరుపుతోంది. ఎలాంటి హామీలు ఇవ్వాలి. సాధ్యాసాధ్యాలపై నిపుణుల అభిప్రాయాలు తీసుకుంటోంది. హామీ ఇచ్చామంటే అమలుచేసేవిధంగా ఉండాలన్నరీతిలో మేనిఫెస్టోను రూపొందిస్తోంది.

అయితే, ఈనెల 17న జరగబోయే బహిరంగసభలో ఐదు ముఖ్యమైన గ్యారంటీలపై కీలక ప్రకటన చేయబోతోంది కాంగ్రెస్‌. మొత్తానికి, అధికారమే లక్ష్యంగా మునుపెన్నడూలేని వీర స్పీడ్‌ చూపిస్తోంది. మరి, కాంగ్రెస్‌ వ్యూహాలు ఫలిస్తాయో.. అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తుందో లేదో కొన్ని నెలల్లోనే తేలిపోనుంది.
తుమ్మల చేరికకు బ్రేక్
ఖమ్మం జిల్లాలో కీలక నేత, సీనియర్ పొలిటిషీయన్ తుమ్మల నాగేశ్వరావు కాంగ్రెస్ పార్టీలో చేరుబోతున్నారంటే గత కొంత కాలంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్న ఆయన ఇటీవల సీఎం కేసీఆర్ ప్రకటించిన అసెంబ్లీ అభ్యర్థుల జాబితాలో పేరు లేకపోవటంతో మనస్థాపం చెందారు. దానికి తోడు పార్టీలో ప్రాధాన్యత దక్కటం లేదని గత కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారు. దీంతో ఆయన పార్టీ మారబోతున్నారనే ప్రచారం ఊపందుకుంది.ఆ వార్తలకు బలం చేకూర్చుతూ ఇప్పటికే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆయనతో భేటీ అయ్యారు.

పార్టీలో చేరాల్సిందిగా ఆహ్వానించారు. అయితే కార్యకర్తలతో మాట్లాడి త్వరలోనే నిర్ణయం చెబుతానని ఆయన వారితో వెల్లడించారు. ఈనెల 17 కాంగ్రెస్ పార్టీ తుక్కుగూడలో విజయభేరి సభ నిర్వహిస్తోంది. ఆ సభకు సోనియా గాంధీ హాజరవుతున్నారు. ఆమె సమక్షంలోనే తుమ్మల పార్టీలో చేరనున్నారనే ప్రచారం జరిగింది. అయితే ఆయన చేరికకు బ్రేక్ పడినట్లు తెలుస్తోంది.అసెంబ్లీ ఎన్నికలు ఆలస్యం అవుతాయని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయ భవిష్యత్తుపై తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దనే ఆలోచనలో తుమ్మల ఉన్నట్లు సమాచారం. అలాగే పాలేరు సీటు విషయంలో కాంగ్రెస్ నుంచి కన్ఫర్మేషన్ లేకపోవడంతో ఆయన అయోమయంలో పడినట్లు టాక్ వినిపిస్తోంది.

అందుకే ఆచితూచి వ్యవహరిస్తున్నారని.. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా రాజకీయ అడుగులు వేస్తున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు.గత 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పాలేరు నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అక్కడ విజయం కాంగ్రెస్ తరపున విజయం సాధించిన కందాల ఉపేందర్ రెడ్డి ఆ తర్వాత బీఆర్ఎస్ గూటికి చేరారు. దీంతో ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరమయ్యారు. ఇక ఇటీవల ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థుల్లోనూ సిట్టింగ్ అయిన కందాల వైపే కేసీఆర్ మెుగ్గు చూపారు. దీంతో తుమ్మల తీవ్ర అసహనానికి గురయ్యారు. తనకు టికెట్ కేటాయించకపోవటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.పార్టీ టికెట్ ఇవ్వకపోయినా.. ప్రజాభీష్టం మేరకు తాను పోటీ చేసి తీరుతానని చెప్పారు. దీంతో ఆయన్ను పార్టీలో చేర్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోంది. ఇప్పిటికే పార్టీ కీలక నేతలు ఆయనతో భేటీ కాగా.. పార్టీ జాయిన్ అయ్యే విషయంపై స్పష్టత ఇవ్వలేదు. ఈనెల 17న హస్తం గూటికి చేరుతారని వార్తలు వినిపించినా.. మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie