Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

మరో దుబ్బాకగా గజ్వేల్

0

మెదక్, అక్టోబరు 25, 

 ఇద్దరూ రాజకీయంగా సమవుజ్జీలే. ప్రజలను తమ ప్రసంగాలతో కదిలించగల సత్తా ఉన్నవారే.. ఇద్దరిలో రాజకీయ నేపథ్యం వేరువేరుగా ఉన్నప్పటికీ స్వతహాగా ఎదిగిన వారే. అలాంటి ఆ నాయకులు ఇప్పుడు తెలంగాణ ఎన్నికల్లో పోటీపడుతున్నారు. ఇది పోటీ అనేకంటే ఇద్దరు వ్యక్తుల మధ్య వైరం అనుకోవచ్చు. ఇంతకీ ఎవరు ఆ వ్యక్తులు? వారి పోటీని మరో దుబ్బాక లాగా రాజకీయ విశ్లేషకులు ఎందుకు భావిస్తున్నారు.క్యాబినెట్‌ నుంచి అత్యంత అవమానకర రీతిలో తనను బర్తరఫ్‌ చేశారన్న కసితో, హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో తనను ఓడించడానికి అధికార బలాన్ని, ధనబలాన్ని ప్రయోగించారన్న ఆగ్రహంతో రగిలిపోతూ.. కేసీఆర్‌పై పోటీ చేస్తానని చెబుతూ వస్తున్న రాష్ట్ర మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ నిజమయ్యాయి.

ఈటల మాటలకు విలువనిస్తూ భారతీయ జనతా పార్టీ అధిష్ఠానం ఆయనకు హుజురాబాద్‌తో పాటు గజ్వేల్‌ అభ్యర్థిత్వాన్ని కూడా ఖరారు చేసింది. దీంతో.. గజ్వేల్‌ పోరు గరంగరంగా మారింది. ఎందుకంటే గజ్వేల్‌ నియోజకవర్గంతో ఈటల రాజేందర్‌కు 30 ఏళ్ల అనుబంధం ఉంది. 1994 నుంచి గజ్వేల్‌ నియోజకవర్గంలోని వర్గల్‌ మండలం శాఖారం, మల్లారెడ్డిపల్లి గ్రామాల్లో పౌల్ట్రీ వ్యాపారం చేస్తూ అక్కడి ప్రజలతో సత్సంబంధాలు ఏర్పర్చుకున్నారాయన. గజ్వేల్‌, వర్గల్‌, ములుగు మండలాలకు చెందిన పలువురు బడా నాయకులతోనూ ఆయనకు సంబంధాలు ఉన్నాయి.2002లో సిద్దిపేట జిల్లా గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ మునిసిపాలిటీ పరిధిలోని ప్రజ్ఞాపూర్‌ శ్రీ పార్థివేశ్వరాలయంలోనే ఆయన బీఆర్‌ఎస్‌ సభ్యత్వం తీసుకుని పార్టీలో చేరారు.

ఈ క్రమంలోనే ఆయనకు కేసీఆర్‌తో సాన్నిహిత్యం ఏర్పడింది. తెలంగాణ ఉద్యమంలో ఇద్దరూ కలిసి పనిచేశారు. కానీ, ఇప్పుడు వారిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉండడంతో.. కేసీఆర్‌ను ఓడించాలని ఈటల సంకల్పించారు. ఇందుకు అనుగుణంగా ఇటీవల పలు దఫాలుగా గజ్వేల్‌కు చెందిన తన సన్నిహితులతో ఆయన చర్చించినట్లు తెలుస్తున్నది. గజ్వేల్‌ నుంచి పోటీచేస్తే విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని తన వ్యక్తిగత సర్వేలో తేలడంతోనే ఈటల ఆ నియోజకవర్గంపై ఫోకస్‌ చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన పదిరోజుల క్రితం ఒకసారి, వారం రోజుల క్రితం మరోసారి.. కేసీఆర్‌పై తాను పోటీ చేయడం తథ్యమని తేల్చిచెప్పారు. సీఎం కేసీఆర్‌పై పోటీచేసి ఓడిస్తే.. రాష్ట్ర రాజకీయాల్లో తనకు తిరుగుండదని ఈటల భావిస్తున్నట్టు సమాచారం.

అంతేకాక.. గజ్వేల్‌లో ఏ పార్టీ అభ్యర్థి గెలిస్తే ఆ పార్టీ ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడుతుందన్న సెంటిమెంట్‌ కూడా ఈటల పోటీకి కారణంగా తెలుస్తోంది. గజ్వేల్‌లో గత రెండుసార్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌పై పోటీచేసిన వంటేరు ప్రతాప్ రెడ్డి బీఆర్‌ఎస్ లో చేరిపోవడం.. కాంగ్రెస్‌ పార్టీ ఈసారి తన అభ్యర్థిగా తూంకుంట నర్సారెడ్డిని ప్రకటించడంతో ఈ దఫా ఎన్నికల్లో కేసీఆర్‌ విజయం నల్లేరు మీద నడకే బీఆర్‌ఎస్‌ నాయకులు భావించారు. సీఎం కేసీఆర్‌, నర్సారెడ్డి మధ్య పోటీ నామమాత్రమేనని భావించారు. కానీ, ఈటల రంగప్రవేశంతో గజ్వేల్‌ నియోజకవర్గం రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా హాట్‌టాపిక్‌గా మారిందని చెప్పవచ్చు.

ఇటీవల బీఆర్‌ఎస్ కు చెందిన పలువురు నాయకులు అసంతృప్త రాగం అందుకుని ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేయడం, యువత బీజేపీ వైపు ఆసక్తిగా చూస్తుండడంతో.. సీఎం కేసీఆర్‌కు ఈటల రాజేందర్‌ గట్టి పోటీని ఇవ్వడం ఖాయంగా కనిపిస్తున్నది.గజ్వేల్‌ నియోజకవర్గం ఒకప్పుడు కాంగ్రెస్‌ కంచుకోటగా ఉండేది. 1957లో ఇక్కడ కాంగ్రెస్‌ అభ్యర్థి జేబీ ముత్యాలరావు గెలుపొందగా, 1967, 1972, 1978, 1989, 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులే విజయం సాధించారు. 2014లో కేసీఆర్‌ గజ్వేల్‌ బరిలో నిలవగా, కాంగ్రెస్‌ అభ్యర్థి నర్సారెడ్డి మూడోస్థానంలో నిలిచారు. 2018లో కాంగ్రెస్‌ తరఫున బరిలో నిలిచిన వంటేరు ప్రతా్‌పరెడ్డి సీఎం కేసీఆర్‌కు గట్టి పోటీని ఇచ్చినా ఓడిపోయారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie