Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

మళ్లా బాలినేని హవా

0

ఒంగోలు, సెప్టెంబర్ 14

ప్రకాశం జిల్లా వైసీపీలో అసమ్మతి రాగాలు శృతిమించి నూటొక్క రాగాలు ఆలపిస్తున్నాయి. దీంతో రీజనల్‌ కో ఆర్డినేటర్‌ విజయసాయిరెడ్డికి పార్టీ సమీక్షా సమావేశాలు కత్తిమీద సాములా మారాయట. ఒంగోలులో రెండు రోజులు జరిగిన సమావేశాల్లో కొందరు నేతలు ఆయనముందే అసమ్మతి రాగాన్ని ఆలపించారు. కొండపి నేతలు మేమింతే అన్నట్లు అడ్డంతిరిగారు. సంతనూతలపాడు నేతలు తోపులాటదాకా వెళ్తే.. కనిగిరి, దర్శి, మార్కాపురం, గిద్దలూరు నేతలు ఆరోపణలు, ప్రత్యారోపణలతో సమీక్షా సమావేశాల్ని హీటెక్కించారు. చివరికి బాలినేని కూడా తన నియోజకవర్గంలో బయటివాళ్ల పెత్తనమెక్కువైందని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రకాశంజిల్లాలో పార్టీకి చేయాల్సిన రిపేర్లు చాలా ఉన్నాయని అర్ధమైందట విజయసాయిరెడ్డికి.

అందుకే పరిస్థితి చేయిదాటకముందే దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. మొదట మాజీమంత్రినుంచే సర్దుబాటు చర్యలు స్టార్ట్‌ చేశారట ట్రబుల్‌షూటర్‌. ప్రకాశం జిల్లాలో బలమైన నాయకుడు బాలినేని ఆధ్వర్యంలోనే కార్యక్రమాలు జరుగుతాయని, టికెట్ల విషయంలోనూ ఆయన సూచనలు పరిగణనలోకి తీసుకుంటామని రీజనల్‌ కోఆర్డినేటర్‌ ప్రకటించడం జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారింది. దీంతో నిన్నటిదాకా ఓ లెక్క..ఇప్పటి నుంచి మరో లెక్క అన్నట్టు ప్రకాశం వైసీపీ రాజకీయాలు మరో టర్న్‌ తీసుకున్నాయి.ప్రకాశంజిల్లా వైసీపీ రాజకీయాలు మొదట్నించీ బాలినేని చుట్టే తిరుగుతుంటాయి. వైఎస్‌కి సమీప బంధువు కావడంతో 1999 నుంచి బాలినేనికి కాంగ్రెస్‌లో, తర్వాత వైసీపీలో ఎదురులేకుండా పోయింది. అయితే మంత్రి వర్గ విస్తరణలో చోటు లభించకపోవడంతో షాక్‌తిన్నారాయన. అలకబూనిన బాలినేని ఓ దశలో పార్టీ వీడతారన్న చర్చకూడా నడిచింది. ఈ క్రమంలో రీజనల్‌ కో ఆర్డినేటర్‌ బాధ్యతలిచ్చి వైసీపీ అధిష్ఠానం బుజ్జగించింది.

ఆ తరువాత అనూహ్యంగా తన పరిధిలోని ప్రకాశం, బాపట్ల జిల్లాలను తప్పించి కడప, చిత్తూరు జిల్లాలను కేటాయించడంతో బాలినేని తీవ్ర అసంతృప్తితో రీజనల్‌ కో ఆర్డినేటర్‌ పదవికి రాజీనామా చేసేశారు.సీఎం స్వయంగా జోక్యం చేసుకున్నా బాలినేని కేవలం ఒంగోలుకే పరిమితమయ్యారు. జిల్లాలోని మిగిలిన నియోజకవర్గాలను పట్టించుకోవడం మానేశారు. దీంతో చాలా నియోజకవర్గాల్లో అడిగేదెవరన్నట్లు అసమ్మతి పెరిగిపోయింది. ఈ పరిస్థితుల్లో ప్రకాశం, బాపట్ల, నెల్లూరు జిల్లాలకు కొత్త కో ఆర్డినేటర్‌గా ఎంపీ విజయసాయిరెడ్డిని నియమించింది వైసీపీ అధిష్ఠానం.

రెండ్రోజులు విజయసాయిరెడ్డి 8 నియోజకవర్గాలపై సమీక్ష నిర్వహించారు. బాలినేనిని పక్కన కూర్చోబెట్టుకుని అసంతృప్త నేతలను కట్టడికి ప్రయత్నించినా కొందరు దారికి రాకపోవటంతో ఓ దశలో గట్టి హెచ్చరికలే చేశారట విజయసాయిరెడ్డి. బాలినేనిపైనే బాధ్యతలు పెట్టారు పార్టీ రీజనల్‌ కోఆర్డినేటర్‌.ఒంగోలు బాసు – బాలినేని వాసు అంటూ ఆయన అనుచరులు ఓ ట్యాగ్‌ లైన్‌ పెట్టుకున్నారు. ఇప్పుడది మరోసారి తెరపైకొచ్చింది. ప్రకాశం జిల్లాలో బాలినేని ఆధ్వర్యంలోనే కార్యక్రమాలు, నిర్ణయాలు జరుగుతాయని మీడియా సమావేశంలో బహిరంగంగానే ప్రకటించారు విజయసాయిరెడ్డి.

కొన్ని విషయాలపై బాలినేని ఆవేదన వాస్తవమేనని స్పష్టం చేశారు. ఇతర నియోజకవర్గాల్లో సమస్యలు పరిష్కరించే బాధ్యతని బాలినేని తన భుజానవేసుకున్నారన్న విజయసాయిరెడ్డి.. జిల్లాలో ఆయన తిరుగులేని నాయకుడని పార్టీనేతలకు చెప్పేశారు. ప్రకాశం జిల్లాలో ఇక ఏదైనా బాలినేని సారధ్యంలో జరగాల్సిందేని ప్రకటించారు. విజయసాయిరెడ్డి ప్రకటనతో జిల్లా వైసీపీ రధసారధిగా బాలినేనే ఉంటారని పార్టీ అధిష్ఠానం నిర్ణయించినట్టుగా తేలిపోయింది. దీంతో ప్రకాశంలో మళ్లీ బాలినేని హవా మొదలైనట్లే..

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie