Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

మీ డబ్బులు సీజ్ చేశారా… అయితే ఇలా సొందండి

0

హైదరాబాద్, అక్టోబరు 25, 

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో పోలీసులు చేస్తున్న వాహనాల తనిఖీలు సామాన్యులకు చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. ఎన్నికల్లో పంపిణీకి రాజకీయ పార్టీలు డబ్బు తరలించే అవకాశాలున్న నేపథ్యంలో ఎలక్షన్ కోడ్ వచ్చిన నాటి నుంచి రోడ్లపై తనిఖీలను ముమ్మరం చేశారు పోలీసులు. ప్రధానంగా కార్లతో పాటు అనుమానం వచ్చిన ప్రతి వాహనాన్ని చెక్ చేస్తున్నారు. ఇది ఎన్నికల ప్రవర్తనా నియమావళిలో భాగమే అయినా రూ.50 వేలకు మించిన నగదు, 10 గ్రాముల కంటే ఎక్కువ బంగారం దొరికితే సీజ్ చేయడం వ్యాపారులు, సామాన్యుల నిత్య కార్యకలాపాలకు సంకటంగా మారింది. ఎవరి దగ్గరైనా రూ.50 వేలకు మించి నగదు దొరికితే పోలీసులు సీజ్ చేస్తున్నారు. అలాగే ఆ ఖరీదుకు మించి బంగారం దొరికినా వదలడం లేదు.

ఆ నగదు లేక నగలకు సంబంధించిన ఆధారాలు చూపిస్తే ఓకే.. లేని పక్షంలో సీజ్ చేస్తున్నారు. అయితే అత్యవసర పనులపై డబ్బులు తీసుకెళ్లే వారికి ఇది ఇబ్బందిగా మారింది. వివాహాది శుభకార్యాలు, హాస్పిటల్ చెల్లింపులు, ఫీజులు కట్టేందుకు, గృహోపకరణాల కొనుగోలు వంటి అవసరాలకు డబ్బు తీసుకెళుతున్న సామాన్య ప్రజల వద్ద నుంచి డబ్బులు సీజ్ చేస్తున్న సందర్భాలు లేకపోలేదు.వ్యాపారులు తమ బిజినెస్ ముగించుకుని డబ్బును ఇంటికి తీసుకెళుతున్న సందర్భాల్లోనూ పోలీసులు సీజ్ చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి డబ్బుల్లో ప్రతి రూపాయికి లెక్క ఎలా చూపించగలమని వ్యాపారులు గగ్గోలు పెడుతున్నారు. ఇలా సీజ్ చేసిన సొమ్మును ఎలా విడిపించుకోవాలో అర్ధం కాని పరిస్థితిలో బాధితులు పోలీస్ స్టేషన్, తహసీల్దార్ ఆఫీస్, ఎన్నికల అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. కాగా డబ్బు సీజ్ చేసిన తర్వాత లెక్కలు చూపినప్పటికీ ఆ డబ్బును తిరిగి అప్పగించే విషయంలో తమకు ఎలాంటి ఆదేశాలు లేవని అధికారులు చేతులెత్తేస్తున్న తీరుతో కొందరు జిల్లా కలెక్టర్ ను సైతం కలిసి మొర పెట్టుకుంటున్నారు.

ఖమ్మం జిల్లాలో ఇప్పటికి రూ.2.40 కోట్లను అధికారులు సీజ్ చేసి స్వాధీనం చేసుకోగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రూ. 3.10 కోట్లను సీజ్ చేశారు. ఈ మొత్తంలో 70 శాతం సొమ్ము సాధారణ ప్రజానీకం వద్ద సీజ్ చేసిందేనని అధికారులే అనధికారికంగా ఒప్పుకోవడం గమనార్హం.అయితే సీజ్ చేసిన నగదు, బంగారం తిరిగి పొందడానికి ఎన్నికల సంఘం పలు సూచనలు చేసింది. రికవరీ చేసిన సామాన్యుల సొమ్మును తిరిగి ఇచ్చేందుకు ప్రతి జిల్లాలో గ్రీవెన్స్‌ సెల్‌ను ఏర్పాటు చేసినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. పోలీసుల వాహన తనిఖీల్లో సీజ్ చేసిన నగదు, బంగారం… గ్రీవెన్స్ సెల్‌ ఛైర్మన్‌ను సంప్రదించి సరైన ఆధారాలు సమర్పిస్తే 48 గంటల్లోనే వాటిని తిరిగిచ్చేస్తామని ఎన్నికల సంఘం ప్రకటించింది. అయితే సీజ్‌ చేసిన సొత్తు విలువ రూ.10 లక్షలలోపు మాత్రమే ఉండాలని ఎన్నికల సంఘం పేర్కొంది. అంతకు మించి విలువైన నగదు, బంగారం ఉంటే ఐటీ అధికారులకు వివరాలు అందించాలని సూచించింది.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie