Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

రాష్ట్ర ఉత్సవంగా మొల్ల జయంతి

0

కడప, సెప్టెంబర్ 22, (న్యూస్ పల్స్)

రామాయణాన్ని అతి సులువైన పదాలతో తెలుగులో రాసి తన సరళమైన పదజాలానికి అందరూ ముద్దులయ్యేలా చేసిన కవయిత్రి మొల్ల. ఆమె రాసిన రామాయణం ‘మొల్ల రామాయణం’గా ఎంతో ప్రసిద్ధి చెందింది. రామాయణాన్ని తెలుగులో రాసిన తొలి కవయిత్రిగా కూడా ఆమె ఎంతో పేరు ప్రఖ్యాతలు గాంచింది. అందుకే ప్రభుత్వం ఇప్పుడు మొల్ల జయంతి అయిన మార్చి 13వ తేదీని రాష్ట్ర ఉత్సవంగా చేయాలని నిర్ణయించి జీవో(99)ను  విడుదల చేసింది. మొల్ల అసలు పేరు ఆతుకూరి మొల్లమాంబ. ఆమె 16వ శతాబ్దపు తెలుగు కవయిత్రి.  తెలుగులో తాను రాసిన రామాయణం మొల్ల రామాయణంగా ప్రసిద్ధి చెందింది.ఈమె కుమ్మరి కుటుంబంలో జన్మించింది.

మొల్ల శ్రీ కృష్ణదేవరాయల సమయంలోనిదని కూడా ప్రసిద్ది. ఇక మొల్ల రచనలను చదివినవారు మొల్ల రచనా శైలి చాలా సరళమైందని, రమణీయమైనదని అంటారు.మొల్ల స్వస్థలం కడప జిల్లా, గోపవరం మండలం, గోపవరం గ్రామం. ఈ గ్రామం కడప పట్టణానికి 56 కి.మీ దూరంలో, బద్వేలుకు 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. కొన్ని మూలాల ఆధారంగా మొల్ల స్వంతంత్ర భావాలు కలిగి ఉండేదని, చిన్న తనంలోనే తల్లిని కోల్పోగా తండ్రి కేసన శెట్టి ఈమెను గారాబంగా పెంచారని ఈమెకు తండ్రి అంటే అమిత ఇష్టం కావడంతో పెళ్ళి కూడా చేసుకోలేదని స్దానికులు చెబుతారు. మొల్ల రామాయణం మొత్తం ఆరు కాండాలలో 871 పద్యాలతో కూడుకుంది.

ఈ కావ్యాన్ని మొల్ల కేవలం ఐదు రోజులలో రాసిందని ప్రతీతి. మొల్ల రచన ఆనాటి పద్ధతికి విరుద్ధంగా వాడుక భాషకు దగ్గరగా ఉండేదని సాహిత్యకారులు చెబుతుంటారు.పలువురు కవులు, రచయితలు, కవయిత్రులు, కుమ్మర, శాలివాహన సంఘం ఇచ్చిన వినతుల మేరకు సీఎం జగన్ నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం మొల్ల జయంతిని రాష్ట్ర ఉత్సవంగా చేయడానికి పూనుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి ముత్యాల రాజు తెలిపారు. అందుకు గానూ ప్రభుత్వం  జీవో (99) ను కూడా విడుదల చేసింది. ఈ ఉత్సవాలను ప్రతి ఏడాది మార్చి 13వ తేదీన జరపనున్నట్లు ముత్యాల రాజు తెలిపారు . ఈ కార్యక్రమాలను బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మొల్ల జయంతిని రాష్ట్ర ఉత్సవంగా జరపడాన్ని కవులు, రచయితలు స్వాగతించి హర్షం వ్యక్తం చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie