Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

వరద నష్ట ప్రభావిత ప్రాంతాల్లో కేసీఆర్ టూర్

0

వడగళ్ల వానతో నష్టపోయిన ప్రాంతాల్లో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. ఒకటి, రెండు రోజుల్లో పర్యటన ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఈ లోపు అధికారులు ఆ ప్రాంతాల్లో పర్యటించిన నష్టాలు అంచనా వేయనున్నారు. దీనికి సంబంధించిన ఆదేశాలు ఇప్పటికే వెళ్లినట్టు సమాచారం. ఆ నివేదికలు వచ్చిన తర్వాత ఎక్కువ నష్టం వాటిల్లిన ప్రాంతాల్లో సీఎం కేసీఆర్ పర్యటించి రైతులకు అక్కడి పరిస్థితులు తెలుసుకుంటారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలపై ఆరా తీస్తారు. నాలుగు రోజులుగా అకాల వర్షం రైతులకు తీవ్రంగా ముంచేసింది. వడగళ్ల వానకు భారీగా నష్టపోయారు రైతులు.

మామిడి, మిరప, మొక్కజొన్న, టమాటో, అక్కడక్కడా వరి, కూరగాయలు వేసిన అన్నదాతలకు కోలుకోలేని బాధను మిగిల్చాయి ఈ వానలు. దారుణంగా దెబ్బతిన్న రైతులను ఇప్పటికే మంత్రులు, అధికార పార్టీ నేతలు, ప్రతిపక్షాల నేతలు పరామర్శించారు. అకాలవర్షాలకు పంటనష్టాలపై ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ నేతలు ప్రభుత్వానికి లేఖలు రాశారు. నష్టపోయిన రైతులను కేంద్ర రాష్ట్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవలాని డిమాండ్ చేశారు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. అకాల వర్షంతో రాష్ట్రంలో 5 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందన్నారు రేవంత్ రెడ్డి. మామిడి, మొక్కజొన్న, ఇతర పంటలు అకాల వర్షానికి బాగా దెబ్బతిన్నాయన్నారు. వ్యవసాయ, రెవెన్యూ అధికారులు గ్రామాల్లో పంటల వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలన్నారు రేవంత్ రెడ్డి. నష్టపోయిన పంటల నివేదికలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అందించి పరిహారం అందేలా చూడాలని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ హయాంలో రైతులకు పంట నష్ట పరిహారం అందించి రైతులను ఆదుకుందని గుర్తు చేశారు.

అకాల వర్షాలు, వడగళ్ల వానతో తీవ్రంగా నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. రైతుల సమస్యలపై రెండ్రోజుల్లో స్పందించకుంటే ఈనెల 22న తిరుమలగిరి మండలంలో నిరాహార దీక్ష చేస్తానని ఆయన హెచ్చరించారు. అకాల వర్షం, వడగళ్ల వాన అన్నదాతల ఆశలను చిదిమేశాయని కోమటిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయానికి వాన తుడిచిపెట్టిందని అన్నారు. రెండ్రోజుల్లో ప్రభుత్వం స్పందించకుంటే రైతుల పక్షాన తానే స్వయంగా రంగంలోకి దిగుతానని స్పష్టం చేశారు. నష్టపోయిన ప్రతీ రైతుకు పరిహారం అందేవరకు పోరాటం ఆగదని వెల్లడించారు. తక్షణమే పంటనష్టం అంచనా వేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. భువనగిరి పార్లమెంట్ పరిధిలోని తిరుమలగిరి మండలంలో 99 శాతం పంటలు దెబ్బతిన్నాయని, వరి, మిర్చి, మామిడి, మొక్కజొన్న, తదితర పంటలు పాడైపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు.

అకాలవర్షాల గురించి నాలుగు రోజుల ముందు నుంచే ప్రభుత్వం అప్రమత్తం చేస్తుందన్నారు మంత్రి నిరంజన్‌రెడ్డి. వర్షాలు కురిసిన 24 గంటలలోపే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో దెబ్బతిన్న పంటలను అంచనా వేయాలని వ్యవసాయ శాఖను ఆదేశించామని వివిధ ప్రాంతాల్లో ఆయా నియోజకవర్గాల శాసనసభ్యులు పంట నష్టం జరిగిన వ్యవసాయ క్షేత్రాలను సందర్శించి రైతులకు భరోసా కల్పిస్తున్నారని మంత్రి స్పష్టం చేశారు.కేవలం రాజకీయ ప్రయోజనాల కొరకు చేసే ప్రతిపక్షాల రాజకీయ దీక్షలను రైతులు గమనిస్తున్నారని మంత్రి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం వారి బాధ్యత అని గుర్తుచేశారు. అంతేకానీ రాజకీయ దురుద్దేశాలతో ప్రభుత్వాన్ని బద్నాం చేయాలనే అలోచన సబబు కాదని హితవు పలికారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు, వ్యవసాయానికి మొదటి ప్రాధాన్యత ఇచ్చి వ్యవసాయ అనుకూల విధానాలతో దేశంలోనే అగ్రగామిగా సాగుతున్నదని మంత్రి స్పష్టం చేశారు.

Leave A Reply

Your email address will not be published.