విజయవాడ, సెప్టెంబర్ 12
విజయవాడ ఇంద్రకీలాద్రిపై భారీ కొండ చరియలు విరిగి పడ్డాయి. కేశఖండనశాల సమీపంలో కొండ చరియలు ఒక్కసారిగా కూలిపోయాయి.జాతీయ రహదారి విస్తరణలో భాగంగా రెండేళ్ళ క్రితం దేవస్థానం సత్రాన్ని తొలగించి విస్తరణ చేపట్టారు. కృష్ణానదికి, ఇంద్రకీలాద్రికి మధ్య ఉన్న రోడ్డు మార్గాన్ని విస్తరించారు. గతంలో ఈ ప్రాంతంలో ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఉండేది. ఫ్లైఓవర్ నిర్మాణంతో దానిని తొలగించారు. భక్తుల రాకపోకల కోసం, కృష్ణానది దుర్గాఘాట్‌కు చేరుకునేందుకు అండర్ పాస్ నిర్మించారు.
కేశఖండన శాలను అనుకుని ఉన్న కొండ చరియలు కొంత కాలంగా ప్రమాదకరంగా ఉన్నాయి. గతంలో కొండ చరియల్ని తొలగించి అవి కింద పడకుండా రాక్ ర్యాఫ్టింగ్ చేపట్టారు. పనులు లోపభూయిష్టంగా నిర్వహించడంతో కొన్నేళ్లకే మళ్లీ కొండ చరియలు ప్రమాదకరంగా తయారయ్యాయి. తాజా ఘటనలో భారీ కొండ చరియలు విరిగి రోడ్డుపై పడిపోవడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. కుమ్మరిపాలెం నుంచి కెనాల్ రోడ్డులోకి వచ్చే వాహనాలను నిలిపివేశారు.
కొండ చరియల్న తొలగించడానికి మరికొంత సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు.ఈ ఘటనలో ఎవరికి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇంద్రకీలాద్రిపై కొలువైన అమ్మవారి దర్శనాలకు వచ్చే భక్తులతో సాధారణంగా ఈ మార్గం రద్దీగా ఉంటుంది. అమ్మవారికి మొక్కులు చెల్లింపులో భాగంగా కేశఖండన శాలకు వచ్చి, ఆ తర్వాత నదీ స్నానాలకు వెళుతుంటారు. రద్దీగా ఉండే ప్రదేశంలో కొండ చరియలు విరిగిపడటంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు. ఆదివారం రాత్రి విజయవాడలో భారీ వర్షం కురవడంతో కొండ చరియల్లో వర్షపు నీరు చేరి రాళ్లు కిందకు జారిపోయి ఉంటాయని భావిస్తున్నారు.