విశాఖపట్టణం, సెప్టెంబర్ 23, (న్యూస్ పల్స్)
సరాకు విశాఖ నుంచి పరిపాలన చేస్తామని అందరూ సిద్ధమవ్వాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేబినెట్ భేటీలో మంత్రి వర్గ సహచరులకు చెప్పారు. అయితే ఈ విషయంపై అధికారికంగా మాత్రం ఐ అండ్ పీఆర్ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ స్పందించలేదు. ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటన చేస్తారని అన్నారు. అంటే దసరాకు విశాఖ రాజధాని తరలింపు ఇన్ సైడ్ న్యూస్ . కానీ వైసీపీ విశాఖ ఇంచార్జ్ వైవీ సబ్బారెడ్డి మాత్రం కార్యాలయాలు చూస్తున్నామని ప్రకటించారు. కానీ ఇక్కడే చాలా మందికి డౌట్ వస్తోంది. కార్యాలయాలు తరలింపు సాధ్యమేనా ? సుప్రీంకోర్టులో తేలకుండా ఎలా కార్యాలయాలు తరలిస్తారు ? రుషికొండలో జరుగుతున్న ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ నిర్మాణ పనుల్ని వేగవంతం చేశారు. ప్రస్తుతం ఇంటీరియర్ పనులు జరుగుతున్నాయి.
మరో 15 రోజుల్లో ఈ పనులు పూర్తి కావచ్చు. నిర్మాణాలు పూర్తవడమే ఆలస్యం..ముఖ్యమంత్రి జగన్ విశాఖకు మకాం మార్చేందుకు సిద్ఘంగా ఉన్నారని తెలుస్తోంది. ఇప్పటికే విశాఖలోని రుషికొండ చుట్టూ భద్రతా వలయాన్ని ఏర్పాటు చేస్తున్నారు. టూరిజం ప్రాజెక్టు చుట్టూ భారీ రక్షణ గోడను 10 అడుగుల ఎత్తులో దాదాపు 8.58 కోట్ల ఖర్చుతో నిర్మించనున్నారు. మరో 4.20 కోట్ల ఖర్చుతో గార్డెనింగ్ టెండర్లు పిలిచారు. ముఖ్యమంత్రి విశాఖ బదిలీ కార్యక్రమంలో భాగంగానే ఇటీవల విశాఖపట్నం పోలీస్ కమీషనరేట్‌ను అడిషనల్ డీజీ కేడర్‌కు అప్‌గ్రేడ్ చేసి రవిశంకర్ అయ్యన్నార్‌ను సీపీగా నియమించారు. శాంతి భద్రతల సమస్య రాకుండా ఈ ఏర్పాట్లు చేశారు.
అంటే ముఖ్యమంత్రి జగన్ బదిలీ అయ్యేనాటికి లా అండ్ ఆర్డర్ ఏర్పాట్లు పూర్తి కానున్నాయి.అమరావతి రాజధాని కోసం రైతుల వద్ద తీసుకున్న భూములు, వారితో చేసుకున్న చట్టబద్దమైన ఒప్పందాలను ఉల్లంఘించి రాజధానిని తరలించడం సాధ్యం కాదని హైకోర్టు చాలా స్పష్టంగా తీర్పు చెప్పింది. దీనిపై చట్టాలు కూడా చేసే అధికారం లేదని రిట్ ఆఫ్ మాండమస్ విధించింది. ఈ అంశంలో సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. ఇప్పుడు ప్రతివాదంలదరికీ నోటీసులు జారీ చేశారు. . వారి వాదనలు సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంటుంది. ఈ విచారణ డిసెంబర్‌లో ఉంటుంది. రాజధాని తరలింపు వద్దని హైకోర్టు ఇచ్చిన తీర్పులోని అంశంపైనా స్టే తెచ్చుకుని.. తరలింపు కోసం సుప్రీంకోర్టు అనుమతి తీసుకుంటే ఏ సమస్యా లేకుండా తరలించుకోవచ్చు. లేకపోతే సాధ్యం కాదని న్యాయనిపుణులు చెబుతున్నారు.రాజధాని అనే విషయంలో రైతులు స్టేక్ హోల్డర్లు కాకపోతే అసలు వివాదం అయ్యేది కాదు.
రాజధాని కోసం వారు భూముల్ని ఇచ్చారు. భూముల్ని ఇచ్చినందుకు వారికి కల్పిస్తామన్న ప్రయోజనాలు .. ఇస్తామన్న ప్లాట్లు.. భవిష్యత్‌పై నమ్మకం కల్పించాల్సి ఉంది. అలా కల్పించకపోతే చట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లించాలి. ఈ రైతుల దగ్గర గతంలో ప్రభుత్వం భూసేకరణ చేసి ఉన్నాసమస్య ఉండేది కాదు. రైతులందరికీ నష్టపరిహారం చెల్లించేసి.. రాజధానిని తరలించేవారు. కానీ భూసమీకరణ చేశారు. అంటే రైతులకు రూపాయి కూడా నష్టపరిహారం ఇవ్వలేదు. అభివృద్ధి ఫలాల్ని అందిస్తామన్నారు. ఇప్పుడు రాజధాని తరలిస్తే రైతులు అన్యాయమైపోతారు. ఇలా తమను సుప్రీంకోర్టు అన్యాయం చేస్తుందని రైతులు కూడా అనుకోవడం లేదు. అందుకే రాజధాని తరలించాలంటే ముందుగా రైతులకు న్యాయం చేయాల్సి ఉంటుంది. కానీ ఇది కూడా అంత తేలికగా జరగే విషయం కాదనేది నిపుణుల మాట. వ్యక్తిగతంగా సీఎం విశాఖ వెళ్లి క్యాంప్ ఆఫీస్ పెట్టకోవచ్చు. ఎలాంటి అభ్యంతరాలు ఉండవు. కానీ కార్యాలయాలు తరలించడం మాత్రం కష్టమన్న అభిప్రాయం వినిపిస్తోంది.