Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

సీట్ల సర్దుబాటుపై చర్చ…

0

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 14

2024 పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపేలక్ష్యంగా ఇండియా  కూటమి వ్యూహాలు రచిస్తోంది. వచ్చే ఎన్నికల్లో గెలిచి…సత్తా చాటాలని విపక్షాలు భావిస్తున్నాయి. ఇండియా కూటమి సమన్వయ కమిటీ తొలి సమావేశంలో  సీట్ల పంపకంపై దృష్టిపెట్టింది. సీట్ల సర్దుబాటుపై చర్చలు ప్రారంభించాలని కూటమి సమన్వయ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. రాష్ట్రాల వారీగా సీట్ల పంపకంపై ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్చలు ప్రారంభించడానికి సిద్ధమైంది. అతి త్వరలోనే సీట్ల షేరింగ్ పై నిర్ణయానికి రావాలని కూటమి పార్టీలు నిర్ణయించాయి. 12 పార్టీల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

ఎన్సీపీ అధినేత శరద్ పవార్ దిల్లీ నివాసంలో…ఇండియా కూటమి సమన్వయ కమిటీ తొలి సమావేశం నిర్వహించింది. పార్టీల మధ్య సీట్ల పంపకం ప్రక్రియ వెంటనే ప్రారంభించనున్నట్లు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. వీలైనంత త్వరగా దీనిపై పార్టీలు నిర్ణయానికి వస్తాయన్నారు. దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా సాధ్యమైనన్ని నియోజకవర్గాల్లో ఇండియా  కూటమి తరపున ఒకర్నే నిలబెట్టాలని నేతలు భావిస్తున్నారు. సీట్ల పంపకం ఫార్ములాపై వెంటనే ఓ నిర్ణయానికి రావాలని కూటమిలోని కొందరు నేతలు పట్టుబట్టారు. దీనిపై నిర్ణయానికి రావాలంటే…పార్టీలన్నీ త్యాగాలు చేయాల్సి ఉంటుందని కొందరు నేతలు సమావేశంలో స్పష్టం చేశారు. మహారాష్ట్ర, తమిళనాడు, బిహార్లో సీట్ల పంపకంపై ఇబ్బంది లేదు. పంజాబ్, ఢిల్లీ, పశ్చిమబెంగాల్ లోనే అభ్యంతరాలు ఉన్నాయి.

ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది ఇండియా కూటమి.  దేశవ్యాప్తంగా కూటమి తరఫున భారీ బహిరంగ సభలు నిర్వహించేందుకు రెడీ అవుతోంది. తొలి సభను అక్టోబర్ తొలి వారంలో భోపాల్లో నిర్వహించనున్నారు. ధరల పెరుగుదల, నిరుద్యోగం, బీజేపీ సర్కారు అవినీతిపై ప్రధానంగా దృష్టిసారించాలని నిర్ణయించారు. కులగణన అంశాన్ని లేవనెత్తాలని ఇండియా  కూటమి డిసైడయింది. మీడియా సమావేశాలకు సంబంధించి ఓ సబ్గ్రూప్ను ఏర్పాటు చేయాలని సమన్వయ కమిటీ నిర్ణయించింది. ఏఏ న్యూస్ యాంకర్ల కార్యక్రమాల్లో ఇండియా కూటమి నేతలు పాల్గొనకూడదనే విషయంపై ఈ సబ్ గ్రూప్ నిర్ణయించనుంది. టీఎంసీ ప్రతినిధిగా అభిషేక్ బెనర్జీ సమావేశానికి రాలేకపోయారు.

బీజేపీ ప్రతీకార రాజకీయాల్లో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆయనకు సమన్లు ఇవ్వడంతో ఆయన రాలేకపోయారు. 2024 ఎన్నికల్లో ఎన్డీఏను ఢీకొట్టేందుకు కసరత్తు చేస్తున్న విపక్ష పార్టీల బలం.. బీజేపీ ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేస్తోందని కూటమి నేతలు వ్యాఖ్యానించారు. విపక్ష కూటమి ఎంత పుంజుకుంటే బీజేపీ ప్రభుత్వం అంతలా ప్రతిపక్ష నాయకులపై దాడులకు దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతుందని ఆరోపించారు. కేంద్రంలో తొమ్మిదేళ్లుగా అధికారంలో ఉన్న నిరంకుశ ప్రభుత్వం నిష్క్రమణకు కౌంట్డౌన్ ప్రారంభమైందని చెబుతున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా రోడ్‌మ్యాప్‌ను ఖరారు చేయనున్నారు. జుడేగా భారత్, జీతేగా ఇండియా అన్న నినాదంలో ప్రజల్లోకి వెళ్తోంది ఇండియా కూటమి. 140 కోట్ల మంది భారతీయులు మార్పును తీసుకురావాలన్నదే లక్ష్యమని కూటమి నేతలు ప్రకటించారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie