Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

సెంటిమెంట్ నే నమ్ముకున్న ఈటల

0

కరీంనగర్, నవంబర్ 1, 

సాధారణంగా ఏదైనా కార్యక్రమం మొదలుపెట్టే ముందో.. ఏదైనా పనిని ప్రారంభించే ముందో చాలామంది కొన్ని సెంటిమెంట్లు ఫాలో అవుతుంటారు. కొంతమంది తల్లిదండ్రుల ఆశీస్సులు తీసుకోవడం, ఇంకొందరు ఇంట్లో వాళ్లతో తిలకం దిద్దించుకోవడం, మరికొందరు ఆలయాల్లో పూజలు చేయడం లాంటివి పాటిస్తుంటారు. ఓటమి ఎరుగని నాయకుడిగా పేరున్న హుజురాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ నేత ఈటల రాజేందర్ కూడా ఇలాంటి సెంటిమెంట్ నే ఫాలో అవుతున్నారు. ఏ ఎన్నికల ప్రచారాన్నైనా ఆయన ఒకే చోటు నుంచి ప్రారంభిస్తూ.. ఇప్పటికీ ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇప్పుడు ఎనిమిదోసారి అసెంబ్లీ బరిలో నిలిచారు.

ఈటల రాజేందర్.. రాష్ట్ర రాజకీయాలకు పరిచయం అక్కర్లేని పేరు. రెండేండ్ల కిందటి వరకు అధికార బీఆర్ఎస్ లో మంత్రిగా పని చేసిన ఆయన.. భూకబ్జాల ఆరోపణలతో పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఆ తరువాత నిర్వహించిన ఉప ఎన్నికలో విజయం సాధించి మరోసారి సత్తా చాటారు. కాగా రాష్ట్ర రాజకీయాల్లో అంతటి ప్రభావవంతమైన వ్యక్తి.. ప్రతి ఎన్నికల సమయంలో ఒక విషయాన్ని సెంటిమెంట్ గా భావిస్తున్నారు. హుజురాబాద్ నియోజకవర్గ పరిధి హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని గోపాలపూర్ బత్తివానిపల్లిలో ఆంజనేయ స్వామి గుడి ఉండగా.. ఆ ఆలయంలో హనుమంతుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన తరువాతనే ప్రచార కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు.

అక్కడ నిర్వహించిన పూజల మహత్యమో.. ఏమో కానీ ఆయన ఏ ఎన్నికల్లో పోటీ చేసినా ఇంతవరకు విజయమే వరిస్తూ వచ్చింది.ఈటల రాజేందర్ ఇప్పటివరకు నాలుగు సాధారణ, మూడు ఉప ఎన్నికల్లో పోటీ చేశారు. పోటీ చేసిన ప్రతిసారీ బత్తివానిపల్లి హనుమాన్ గుడి నుంచే ప్రచార కార్యక్రమాలు ప్రారంభించి వరుసగా ఏడుసార్లు విజయం సాధించారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి 2004 ఎన్నిక‌ల్లో క‌మ‌లాపూర్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి తొలిసారిగా పోటీ చేసిన ఈటల.. అప్పటి టీడీపీ అభ్యర్థి ముద్దసాని దామోదర్‌ రెడ్డిపై విజయం సాధించారు. ఆ తరువాత 2008 ఉప ఎన్నిక జరగగా.. రెండోసారీ విజయాన్నందుకున్నాడు. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో కమలాపూర్‌ నియోజకవర్గం హుజూరాబాద్‌గా మారింది. కాగా 2009లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి వకుళాభరణం కృష్ణమోహన్‌ రావు పై గెలిచి మొదటి హ్యాట్రిక్ కొట్టాడు.

2010 ఉప ఎన్నికల్లో ముద్దసాని దామోదర్ రెడ్డి పై విజయం సాధించగా.. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత జరిగిన 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కేతిరి సుదర్శన్‌రెడ్డిపై గెలుపొందారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లగా.. అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డిపై నెగ్గి డబుల్ హ్యాట్రిక్ విజయాలను అందుకున్నారు. కాగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రిగా పని చేస్తుండగా.. 2021 మే నెలలో భూకబ్జా ఆరోపణల నేపథ్యంలో ఆయనను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేశారు. దీంతో మనస్తాపానికి గురైన ఆయన బీజేపీలో చేరారు. అనంతరం 2021 అక్టోబర్ 30న జరిగిన హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగి వరుసగా ఏడోసారి విజయాన్ని అందుకున్నారు.

ఈ ఏడు ఎన్నికల ప్రచార కార్యక్రమాలను ఈటల రాజేందర్ బత్తివానిపల్లి ఆంజనేయస్వామి గుడి నుంచే ప్రారంభించడం విశేషం.తెలంగాణలో నవంబర్ 30న అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. ఈటల రాజేందర్ హుజురాబాద్ నుంచి ఎనిమిదో సారి బరిలో నిలుస్తున్నారు. ఈ మేరకు తాను సెంటిమెంట్ గా భావించే బత్తివానిపల్లి హనుమంతుడి గుడిలో పూజలు నిర్వహించిన అనంతరం సోమవారం ప్రచార కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. కాగా సాధారణంగా లెఫ్ట్ ఐడియాలజీ కలిగిన ఆయన.. కొన్నేండ్లుగా బత్తివానిపల్లి ఆలయ సెంటిమెంట్ పాటిస్తుండటం, ఇక్కడి నుంచే ప్రతిసారి ప్రచార కార్యక్రమాలు స్టార్ట్ చేస్తుండటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie