అదిలాబాద్, సెప్టెంబర్ 23, (న్యూస్ పల్స్)
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలకి కేరాఫ్‌గా ఉన్న రామగుండం నియోజకవర్గంలో ఆ మాజీ ఎమ్మెల్యే అంటే ఒక ప్రత్యేకత ఉంది. FCIలో ఇంజనీర్‌గా పనిచేసిన సోమారపు సత్యనారాయణ ప్రజాసేవపై ఆసక్తితో ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయ అరంగేట్రం చేశారు. పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన వెంటనే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి రామగుండం మున్సిపాలిటీ తొలిచైర్మన్‌గా గెలిచారు సోమారపు. ఇంజనీర్‌గా తనకున్న అనుభవంతో చైర్మన్ హోదాలో పట్టణాభివృద్ధిపై దృష్టిపెట్టటంతో.. సోమారపు సత్యనారాయణకు స్థానిక ప్రజల్లో ఇమేజ్ పెరిగింది.
తర్వాత ఇండిపెండెంట్‌గా పోటీచేసిన సోమారపుని ఎమ్మెల్యేగా గెలిపించి అసెంబ్లీకి పంపారు రామగుండం ప్రజలు.ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా గెలిచాన కాంగ్రెస్ పార్టీ అనుబంధ సభ్యుడిగా కొనసాగుతూ వచ్చిన సోమారపు సత్యనారాయణ తెలంగాణ ఉద్యమ సమయంలో గులాబీపార్టీకి జైకొట్టారు. తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి రామగుండంనుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 2018 ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌నుంచి సోమారపు మళ్లీ పోటీచేసినా పార్టీ రెబల్ అభ్యర్థి కోరుకంటి చందర్ చేతిలో ఓటమిపాలయ్యారు.
అధికారపార్టీ అగ్రనేతలే తనను ఓడించారని భావించిన సోమారపు సత్యనారాయణ బీఆర్‌ఎస్‌కి గుడ్ బై చెప్పారు. బీజేపీలో చేరిన సోమారపు సత్యనారాయణ అనుభవానికి తగ్గట్లు ఆయనకు జిల్లా బిజెపి అధ్యక్ష పదవి ఇచ్చింది ఆ పార్టీ నాయకత్వం.కమలంపార్టీ జిల్లా పగ్గాలతో సోమారపు సంతృప్తిచెందినా.. ఆ పార్టీ పాతనేతలు కొందరికి ఇది మింగుడుపడలేదు. నిన్నామొన్న వచ్చిన నాయకుడు మనమీద పెత్తనం చేయడమా అంటూ కొందరు సోమారపు సత్యనారాయణకు దూరంగా ఉంటున్నారు. ముక్కుసూటిగా వ్యవహరించే సోమారపు పార్టీలో పరిణామాలతో ఆవేదనకు గురై BJP జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.
అయితే ఆయన రాజీనామాని కొన్నాళ్లపాటు కోల్డ్ స్టోరేజ్‌లో పెట్టిన అధిష్ఠానం చివరికి ఆయన సూచనలతో మరో నాయకుడికి పార్టీ జిల్లా పగ్గాలు అప్పగించింది. వచ్చే ఎన్నికల్లో రామగుండం బీజేపీ టికెట్‌పై సోమారపు సత్యనారాయణకి పార్టీ అగ్రనేతలు హామీ కూడా ఇచ్చినట్లు సమాచారం. అయితే స్థానికంగా బీజేపీకి పెద్దగా పట్టు లేకపోవడంతో సోమారపు అనుచరులు ఆ పార్టీపై అనాసక్తి చూపుతున్నారట. బీజేపీనుంచి పోటీచేస్తే సహకరించలేమని కూడా నిక్కచ్చిగా చెప్పినట్లు సమాచారం.బీజేపీ నాయకత్వం టికెట్ ఇస్తామంటున్నా సోమారపు అనుచరులు వద్దే వద్దంటున్నారు.
దీంతో ఎటూ తేల్చుకోలేకపోతున్నారట మాజీ ఎమ్మెల్యే. అనుచరుల సహకారం లేకుండా బీజేపీ నుంచి పోటీచేయడం కష్టమని మల్ల గుల్లాలు పడుతున్నారు రామగుండం సీనియర్. వయసు రీత్యా ఇవే తనకు చివరి ఎన్నికలని భావిస్తున్న సోమారపు సత్యనారాయణ.. కచ్చితంగా పోటీ చేయాల్సిందేనని నిర్ణయించుకున్నారు. కానీ బీజేపీనుంచి పోటీపైనే ఒక క్లారిటీకి రాలేకపోతున్నారాయన. మరోవారం వేచి చూసి అనుచరుల అభిప్రాయంతో ఫైనల్ నిర్ణయానికి రావాలని భావిస్తున్నారట సోమారపు. అప్పటికి కూడా అనుచరులు బీజేపీకి నై అంటే.. సోమారపు స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసే అవకాశాలు లేకపోలేదంటున్నారు. మరో వారం తర్వాత తన రాజకీయ భవిష్యత్తుపై సోమారపు స్పష్టమైన ప్రకటన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.