Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

హాట్ టాపిక్ గా మాధవీలత

0

హైదరాబాద్, మార్చి 4 (న్యూస్ పల్స్)
తెలంగాణ బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదల తరువాత ఓ పేరు మాత్రం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతోంది. హైదరాబాద్ లోక్‌సభ స్థానంపై ఫోకస్ చేస్తోన్న బీజేపీ.. అక్కడి నుంచి ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీపై ఓ మహిళను బరిలో నిలుపుతున్నారు. డాక్టర్ మాధవి లత ను హైదరాబాద్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయించి, ఎంఐఎం కంచుకోటను బద్ధలుకొట్టాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. ఓ అగ్రనేతను కాకుండా మహిళా నేత మాధవి లతకు హైదరాబాద్ స్థానం నుంచి ఛాన్స్ ఇవ్వడంతో ఎవరీమే అని చర్చ జరుగుతోంది. కొంపెల్ల మాధవీ లత కోఠిలోని మహిళా కళాశాల లో రాజనీతి శాస్త్రంలో ఎంఏ చదివారు. డాక్టర్ కొంపెల్ల మాధవీ లత విరించి హాస్పిటల్స్ చైర్‌పర్సన్ గా సేవలు అందిస్తున్నారు. ఆమె ఒక ప్రొఫెషనల్ భరతనాట్యం డాన్సర్. తన పిల్లలకు హోమ్‌స్కూల్‌కు ఎంచుకున్నట్లు ఆమె చెబుతుండేవారు. ఆమె లోపాముద్ర ఛారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు. దాంతోపాటు మాధవీ లత లతామా ఫౌండేషన్ వ్యవస్థాపకురాలుగా ప్రసిద్ధి. హైదరాబాద్‌లోని తన లోపాముద్ర ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా నగరంలోని పలు ప్రాంతాల్లో పలు ఆరోగ్య సంరక్షణ, విద్య, ఆహార పంపిణీ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తుంటారు. ముఖ్యంగా హింధూ ధర్మం, హిందూ సాంప్రదాయాలపై ఆమె మాట్లాడే మాటలు, ఇచ్చే ప్రసంగాలో ఎందరినో ఆకట్టుకున్నాయి. హైందవ సంస్కృతి, సాంప్రదాయాలపై ఆమె చేసే వ్యాఖ్యలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఎన్ఎసీసీ క్యాడెట్‌గా, క్లాసికల్ మ్యూజికల్ సింగర్‌గా సైతం మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

ఎంఐఎం కంచుకోట పాతబస్తీలో తరుచూ ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టేవారు. ప్రధాని మోదీ నాయకత్వం, బీజేపీ విధానాలకు ఆకర్షితురాలై మాధవీ లత బీజేపీలో చేరారు. పాతబస్తీలో ఏమైనా సమస్యలు వస్తే, వాటికి పరిష్కారం చూపించేవారు. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలకు ఆమె కౌంటర్ ఇచ్చేవారు. బీజేపీ ప్రతినిధిగా అసదుద్దీన్ విధానాలను తనదైన శైలిలో వ్యతిరేకించడంతో పార్టీ అధిష్టానం దృష్టిలో పడ్డారు. గతంలో హైదరాబాద్ లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దిగిన బీజేపీ నేతలు రెండో స్థానంలో నిలిచారు కానీ విజయాన్ని మాత్రం అందుకోలేకపోయారు.  తెలంగాణలో ఎంఐఎం గెలిచే ఒక్క ఎంపీ స్థానం హైదరాబాద్. ప్రస్తుత ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ 2004 నుంచి వరుస ఎన్నికల్లో విజయం సాధిస్తున్నారు. 2009, 2014, 2019 నాలుగు వరుస లోక్ సభ ఎన్నికల్లో నెగ్గుతూ వస్తున్నారు. అసదుద్దీన్ కు ముందు ఆయన తండ్రి సలావుద్దీన్ ఒవైసీ 1984 నుంచి 2004 వరకు రెండు దశాబ్దాలపాటు పలుమార్లు ఎంపీగా గెలుపొందారు. అంటే హైదరాబాద్ సీటు 1984 నుంచి నాలుగు దశాబ్దాలుగా ఒవైసీల అడ్డా. ఈసారి ఎలాగైనా ఎంఐఎంకు చెక్ పెట్టి, విజయం సాధించాలని భావిస్తున్న బీజేపీ అధిష్టానం అనూహ్యంగా మాధవీ లతకు ఛాన్స్ ఇచ్చింది. ఎంతో ఆస్తి ఉన్నా సాధారణ జీవితమే తనకు ఇష్టమని చెప్పే మాధవీ లత ఆధ్యాత్మిక విషయాలు, సంస్కృతి, సాంప్రదాయాలపై తన అభిప్రాయాల్ని నిర్మోహమాటంగా చెబుతుంటారు. అసదుద్దీన్ పైనే పోటీకి నిలపడంతో మాధవీ లత మరోసారి హాట్ టాపిక్ అయ్యారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie