Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

ఆనం, కోటంరెడ్డి బాటలో వరప్రసాద్

0

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు వైసీపీ నుంచి దూరం జరిగారు. ఇప్పుడు మరో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తలనొప్పిగా మారుతున్నారు. ఆయనే గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్. జగన్ పై ఆయనకు ఉన్న విశ్వాసం ఏమాత్రం సన్నగిల్లలేదుకానీ, స్థానిక నాయకులతో ఆయన సర్దుకుపోవడం లేదు. తాజాగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మేరిగ మురళి విజయోత్సవానికి గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ డుమ్మా కొట్టారు. భారీ ఎత్తున నిర్వహించిన ఈ కార్యక్రమంలో నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి హడావిడి చేశారు. ఇతర స్థానిక నాయకులు పాల్గొన్నారు, కానీ స్థానిక ఎమ్మెల్యేగా వరప్రసాద్ మాత్రం రాలేదు.వాస్తవానికి మేరిగ మురళి గతంలో గూడూరు టికెట్ ఆశించారు. కానీ తిరుపతి ఎంపీగా ఉన్న వరప్రసాద్ ని గూడురుకి తెచ్చి పోటీ చేయించారు జగన్. అప్పుడే మురళికి తగిన ప్రాధాన్యమిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఎమ్మెల్సీని చేశారు. కానీ గూడూరు టికెట్ వ్యవహారంలో ఒకే సామాజిక వర్గానికి చెందిన వరప్రసాద్, మురళి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. తీరా ఇప్పుడు మురళి ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత కూడా వరప్రసాద్ మొహం చాటేయడం విశేషం.

స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికైన మేరిగ మురళి తొలిసారిగా గూడూరులో ఏర్పాటు చేసిన స్వాగత సభకు హాజరయ్యారు. పార్టీని నమ్ముకుని నిబద్ధతతో పనిచేస్తే తగిన గుర్తింపు ఉంటుందని  దానికి తానే ఉదాహరణ అని అన్నారు మురళి. ఎన్నో సంవత్సరాలుగా తమ కుటుంబం రాజకీయాల్లో ఉందని ప్రత్యేకించి గూడూరు నియోజకవర్గం తో అనుబంధం కలిగి ఉన్నామని చెప్పారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామన్నారాయన.గూడూరు ఎమ్మల్యే వరప్రసాద్ పై ఇప్పటికే జగన్ వద్ద చాలా ఫిర్యాదులున్నట్లు తెలుస్తోంది. స్థానికంగా అందుబాటులో ఉన్న గ్రూపుల్ని ప్రోత్సహిస్తున్నారని, పార్టీ కోసం పనిచేసిన వారిని దూరం పెట్టారని అంటున్నారు. దానికి తోడు స్థానిక సమస్యల పరిష్కారంలో కూడా ఆయన చొరవ చూపించడంలేదు. దీంతో స్థానిక నాయకులెవరూ ఆయనకు దగ్గరగా లేరు.

ఆయనే ఒంటరిగా కార్యక్రమాలు చేసుకుంటుంటారు. అంతమాత్రాన జోరుగా గడప గడపకు ప్రభుత్వం నిర్వహిస్తున్నారని కూడా అనుకోలేం. ఇరుగు పొరుగు నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో కూడా వరప్రసాద్ కి సఖ్యత లేదని అంటారు. స్థానిక నేత మేరిగ మురళితో కూడా వివాదాలున్నాయి. ఇప్పుడు మురళి ఎమ్మెల్సీ కావడంతో తనకు ప్రాధాన్యత తగ్గుతుందనే భావన ఆయనలో ఉందివచ్చే దఫా ఉమ్మడి నెల్లూరు జిల్లానుంచి వైసీపీ టికెట్లు కష్టం అనుకునేవారిలో వరప్రసాద్ కూడా ఒకరు. వాస్తవానికి ఆయనకు ఉన్న సీనియార్టీ ప్రకారం, తొలి దఫా ఆయనకు మంత్రి పదవి ఇవ్వాల్సి ఉంది. ఎస్సీ కోటాలో ఆయన మంత్రి అవుతారని అందరూ అనుకున్నారు. కనీసం రెండోసారి కూడా ఆయనకు జగన్ ఛాన్స్ ఇవ్వలేదు. ఇక 2024  ఎన్నికల్లో ఆయనకు టికెట్ రాదని కూడా ప్రచారం జరుగుతోంది. కానీ ఆయన మాత్రం మారలేదు. స్తానిక నాయకులతో కలవడంలేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మేరిగ మురళి స్థానం ఏకగ్రీవం అయినా కూడా ఆయన విజయోత్సవ ర్యాలీని ఘనంగా నిర్వహించారు. పట్టభద్రుల స్థానంలో వైసీపీ మూడు చోట్లా ఓడిపోవడంతో అందరూ సైలెంట్ గా ఉన్నారు. ఆ సైలెన్స్ ని బ్రేక్ చేయడం కోసమే గూడూరులో కావాలని ఈ విజయోత్సవ ర్యాలీ పెట్టుకున్నారు. కానీ స్థానిక ఎమ్మెల్యే మాత్రం హ్యాండిచ్చారు.

Leave A Reply

Your email address will not be published.