సంక్షిప్త వార్తలు : 20-05-2025:మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుకు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చారు. మాజీ సిఎం కెసిఆర్‌తో పాటు మంత్రులు హరీష్‌రావు, ఈటల రాజేందర్‌కు కూడా జస్టిస్ ఘోష్ కమిషన్ నోటీసులు ఇచ్చింది. 15 రోజుల్లో విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించిన లోపాలు, వైఫల్యాలపై గత ఏడాది నుంచి పిసి ఘోష్ కమిషన్ విచారణ జరిపింది.
కెసిఆర్, హరీష్ రావు, ఈటెలకు కాళేశ్వరం కమిషన్ నోటీసులు
హైదరాబాద్ మే 20
మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుకు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చారు. మాజీ సిఎం కెసిఆర్‌తో పాటు మంత్రులు హరీష్‌రావు, ఈటల రాజేందర్‌కు కూడా జస్టిస్ ఘోష్ కమిషన్ నోటీసులు ఇచ్చింది. 15 రోజుల్లో విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించిన లోపాలు, వైఫల్యాలపై గత ఏడాది నుంచి పిసి ఘోష్ కమిషన్ విచారణ జరిపింది.
కాళేశ్వరం ప్రాజెక్టు పై కేంద్ర ప్రభుత్వ సంస్థలు కాగ్, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ(ఎన్‌డిఎస్‌ఎ)లతో పాటు రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ విభాగం ఇచ్చిన నివేదికలను పిసి ఘోష్ కమిషన్ సున్నితంగా పరిశీలించి వాటిలోని అంశాలను కూడా పరిగణలోకి తీసుకుని తుది నివేదికను సిద్దం చేసినట్లు తెలుస్తోంది.
సాంకేతిక, ఆర్ధిక , విధానపరమైన అంశాలపై ఇంజినీర్లు, కాంట్రాక్టు ఏజెన్సీల నుంచి అఫిడవిట్ల తీసుకుని వాటి ఆధారంగా కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. దాదాపు వెయ్యి పేజీలకు పైగా నివేదికను జస్టిస్ పిసి ఘోష్ రూపొందించారని, ఈనెల మూడో వారంలో తన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయనున్నట్లుగా సమాచారం ముగ్గురిని పిలవకుండా నివేదిక ఇస్తే చెల్లుబాటు కాదని కమిషన్ అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. సహజ న్యాయ సూత్రాలకు విరుద్దంగా వెళ్లరాదని కమిషన్ యోచించినట్లు సమాచారం.
మెట్రో పెంచిన ధరలపై 10 శాతం చార్జీల తగ్గింపు
హైదరాబాద్ మే 20
నగర వాసులకు హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. ఇటీవల మెట్రో చార్జీలను భారీగా పెంచిన యాజమాన్యం కాస్తా దిగొచ్చింది. తాజాగా మెట్రో రైలు సంస్థ టికెట్ ధరలను సవరించింది. మంగళవారం మెట్రో చార్జీలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. పెంచిన ధరలపై 10 శాతం చార్జీలను తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తగ్గించిన టికెట్ ధరలను మే 24వ తేదీ నుండి అమలులోకి తీసుకురానున్నట్టు వెల్లడించింది. కాగా, ఇటీవల కనిష్టంగా ఉన్న రూ.10 టికెట్ ధరను 12 రూపాయలకు పెంచింది. గరిష్టంగా ఉన్న 60 రూపాయల టికెట్ ధరను 75 రూపాయలకు పెంచిన సంగతి తెలిసిందే.
తిరుమలలోని 48 అతిధి గృహాల పేర్లు మార్పు: టిడి ఈఓ శ్యామలరావు
అమరావతి మే 20
తిరుచానూరు, అమరావతి వెంకటేశ్వర స్వామి..ఒంటిమిట్ట ఆలయంతో పాటు మిగతా ఆలయాలు అభివృద్ధి చేస్తామని ఎపి టిటిడి ఈఓ శ్యామలరావు తెలిపారు. అమరావతిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాలను సందర్శించారు. ఈ ఆలయాల అభివృద్ధి, భక్తులకు సౌకర్యాలు కల్పించడంపై దృష్టి సారించారు. ఈఓ శ్యామలరావు, ఆలయాల అభివృద్ధికి అవసరమైన కార్యాచరణను రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తిరుమలలోని 48 అతిధి గృహాల పేర్లు మార్పు జరుగుతుందని అన్నారు. బిగ్, జనతా కాంటీన్స్ కి త్వరలో టెండర్లు పిలుస్తామని, ఆకాశగంగ, పాపవినాశనం ప్రాంతాలు అభివృద్ధి చేస్తామని చెప్పారు. నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగా స్విమ్స్ అభివృద్ధి చేస్తామని, స్విమ్స్ లో 597 పోస్టుల భర్తీ జరుగుతుందని ఈఓ శ్యామలరావు పేర్కొన్నారు
హైదరాబాద్ నగరం లో మరో అగ్నిప్రమాదం
హైదరాబాద్ మే 20
;హైదరాబాద్ నగరం లో మరో అగ్నిప్రమాదం జరిగింది. నగరంలోని ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఓ భవనం రెండో అంతస్తులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. భారీగా మంటలు ఎగసిపడుతుండటంతో దట్టంగా పొగ కమ్ముకుంది. మంటలు చెలరేగడంతో భవనంలోని నివాసితులు వెంటనే కిందకు వచ్చి ప్రాణాలు కాపాడుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఫైరింజన్లతో మంటలను అదుపు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని తెలిపారు. కాగా, రెండు రోజుల క్రితం పాతబస్తీలో భారీ అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబంలోని 17మంది ప్రాణాలు కోల్పోయారు.