Andhra Pradesh:రాష్ట్రంలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఓవైపు వడగాలుల ప్రభావం తీవ్రంగా ఉంటుంది. మరోవైపు అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నాయి. మే 13న ఉత్తరాంధ్ర ప్రాంతంలో వడగాలులు, రాయలసీమ ప్రాంతంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని.. విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది.
వాతావరణం..
కోస్తాలో ఓలా.. రాయలసీమలో మరోలా
ఏలూరు, మే 12
రాష్ట్రంలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఓవైపు వడగాలుల ప్రభావం తీవ్రంగా ఉంటుంది. మరోవైపు అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నాయి. మే 13న ఉత్తరాంధ్ర ప్రాంతంలో వడగాలులు, రాయలసీమ ప్రాంతంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని.. విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. కొన్ని ప్రాంతాలలో 42 నుంచి 43.5 డిగ్రీల మధ్య గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.. అని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. 29 మండలాల్లో తీవ్ర వడగాలులు, మరో 41 మండలాల్లో వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉందని స్పష్టం చేసింది. సోమవారంప్రకాశం జిల్లా పెద్ద దోర్నాల, శ్రీకాకుళం జిల్లా జగ్గిలిబొంతులో 42.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 144 ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయని తెలిపింది. అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని.. విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది.
చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. ఉరుములు, మెరుపులు వచ్చినప్పుడు బహిరంగ ప్రదేశాల్లో ఉండొద్దని స్పష్టం చేశారు.రాష్ట్రంలో మొత్తం 670 మండలాలు ఉన్నాయి. వాటిల్లో 8 మండలాల్లో ఆదివారం తీవ్ర వడగాలులు వీచాయి. 15 మండలాల్లో వడగాలుల ప్రభావం ఉంది. 647 మండలాల్లో సాధారణ కంటే కాస్త ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 12వ తేదీన 29 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉంది. 41 మండలాల్లో వడగాలుల ప్రభావం ఉంటుందని.. విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
ఉత్తరాంధ్రపై ప్రభావం..
మే 13వ తేదీన 65 మండలాల్లో తీవ్ర వడగాలుల ప్రభావం ఉంటుందని.. విపత్తుల నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది. 107 మండలాల్లో వడగాలులు వీస్తాయని తెలిపింది. ముఖ్యంగా ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో వడగాలుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని అంచనా వేసింది. గ్రేటర్ రాయలసీమ ప్రాంతంలోని జిల్లాలపై వడగాలుల ప్రభావం పెద్దగా లేదు. సాధారణం కంటే కాస్త ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని విపత్తుల నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది.వడగాలుల సమయంలో డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండటానికి తరచుగా నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు తాగాలి. దాహం వేయకపోయినా సరే నీరు తాగడం ముఖ్యం. లేత రంగు దుస్తులు ధరించాలి. నలుపు వంటి ముదురు రంగు దుస్తులు వేడిని ఎక్కువగా గ్రహిస్తాయి. కాబట్టి లేత రంగు, వదులుగా ఉండే దుస్తులు ధరించడం మంచిది. ముఖ్యంగా ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల మధ్య ఎండ తీవ్రంగా ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో బయటకు వెళ్లకపోవడం ఉత్తమం. అత్యవసరమైతే గొడుగు, టోపీ, సన్ గ్లాసెస్ ఉపయోగించాలి.
ఆల్కహాల్ వద్దు..
శరీరాన్ని చల్లగా ఉంచుకోవాలి. చల్లటి నీటితో స్నానం చేయడం, తడి గుడ్డతో శరీరాన్ని తుడుచుకోవడం ద్వారా శరీరాన్ని చల్లబరుచుకోవచ్చు. ఆల్కహాల్, కెఫీన్ కు దూరంగా ఉండాలి. ఇవి శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తాయి. బరువుగా ఉండే పనులు మానుకోవాలి. ఎక్కువ శ్రమతో కూడిన పనులు ఎండలో చేయకూడదు. ఇంట్లో చల్లని వాతావరణం ఉండేలా చూసుకోవాలి. ఫ్యాన్, కూలర్ లేదా ఏసీ ఉపయోగించి చల్లని వాతావరణాన్ని మెయిన్టెయిన్ చేయవచ్చు. వృద్ధులు, పిల్లలు వడదెబ్బకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వారిని జాగ్రత్తగా చూసుకోవాలి.
