Kadapa :జిల్లాల పేర్ల వ్యవహారంలో వైసీపీ హయంలో జరిగిన పొరపాట్లే కూటమి ప్రభుత్వంలో కొనసాగుతున్నాయి. ప్రజల అభిప్రాయాలతో సంబంధం లేకుండా జిల్లాల విభజన, వాటి పేర్లను నిర్ణయిస్తూ గత ప్రభుత్వం చేసిన తప్పుల్ని కూటమి ప్రభుత్వం సరిచేసే ప్రయత్నాలు చేయడం లేదు.వైసీపీ హయాంలో జిల్లాల విభజన, జిల్లాల పేర్ల మార్పులు విషయంలో నాటి ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించింది.
కడప కో రూల్.. విజయవాడ కో రూలా.
విజయవాడ, మే 30
జిల్లాల పేర్ల వ్యవహారంలో వైసీపీ హయంలో జరిగిన పొరపాట్లే కూటమి ప్రభుత్వంలో కొనసాగుతున్నాయి. ప్రజల అభిప్రాయాలతో సంబంధం లేకుండా జిల్లాల విభజన, వాటి పేర్లను నిర్ణయిస్తూ గత ప్రభుత్వం చేసిన తప్పుల్ని కూటమి ప్రభుత్వం సరిచేసే ప్రయత్నాలు చేయడం లేదు.వైసీపీ హయాంలో జిల్లాల విభజన, జిల్లాల పేర్ల మార్పులు విషయంలో నాటి ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించింది. చారిత్రక నేపథ్యం, పురాతన వారసత్వం, స్థానిక ప్రజల మనోభావాలను పట్టించుకోకుండా రాజకీయ కారణాలతో జిల్లాల విభజన ఎడాపెడా చే సేశారు.ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో అప్పట్లో కొందరు అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై కసరత్తు ప్రారంభించినపుడు ప్రధానంగా లోక్సభ నియోజక వర్గాలను ప్రాతిపదికగా చేసుకున్నారు. కడపను వైఎస్సార్ కడపగా మార్చిన ప్రభుత్వం ఎన్టీఆర్ జిల్లాను మాత్రం విస్మరించింది.ఈ క్రమంలో జిల్లాలు, స్థానిక మండలాల్లోని గ్రామాల్లో ప్రజలకు ఉన్న అనుబంధాలను పోగొట్టుకోవాల్సి వచ్చింది. పార్లమెంటు నియోజక వర్గాలు వేర్వేరుగా ఉన్నా ఉమ్మడి జిల్లాలకు మాత్రం ఐదారు దశాబ్దాలుగా కొనసాగుతూ వచ్చాయి. జిల్లాల సరిహద్దుల విభజనలో ఏకపక్షంగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి.
ఒక్కో జిల్లాలో సగటున 16-17 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉండేవి. ఉదాహరణకు ఉమ్మడి కృష్ణా జిల్లాలో తూర్పు కృష్ణాలోని మచిలీపట్నం పార్లమెంటు నియోజక వర్గం పరిధిలో 7 సెగ్మెంట్లు, విజయవాడ పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండేవి.జిల్లాల ఏర్పాటులో తూర్పు కృష్ణాను కృష్ణా జిల్లాగా, విజయవాడను ఎన్టీఆర్ జిల్లాగా విభజించారు. జిల్లాలోని కైకలూరు, నూజివీడు అసెంబ్లీ నియోజక వర్గాలు ఏలూరు పార్లమెంటు పరిధిలో ఉండేవి. దీంతో ఆ రెండు నియోజక వర్గాలను ఏలూరు జిల్లాలో కలిపేశారు. దీంతో కొల్లేరు ప్రాంతానికి కృష్ణా జిల్లాతో ఉన్న బంధం తెగిపోయింది. నూజివీడును విజయవాడకు దూరం చేసేశారు. చివరకు విజయవాడ నగరం పక్కనే ఉండే గన్నవరం విమానాశ్రయం కూడా కృష్ణా జిల్లాలో కలిసిపోయింది.విజయవాడ పార్లమెంటు నియోజక వర్గం పరిధిలో ఉన్న విజయవాడ తూర్పు, సెంట్రల్, పశ్చిమ నియోజక వర్గాలతో పాటు మైలవరం, తిరువూరు, జగ్గయ్యపేట, నందిగామ నియోజక వర్గాలతో ఎన్టీఆర్ జిల్లాగా కొత్త జిల్లాను వైసీపీ ప్రభుత్వం ప్రకటించింది.విజయవాడ నగరానికి ఉన్న ఘనకీర్తిని మసకబార్చేలా వ్యవహరించారు. చారిత్రకంగా నదీతీరాల్లో విలసిల్లిన నగరాల్లో విజయవాడ ఒకటి.
అందుబాటులో ఉన్న శాసనాల్లో శాతవాహనుల కాలం నుంచి విజయవాడ ప్రస్తావన చరిత్రలో ఉంది. కృష్ణానదికి ఉత్తరం వైపున ఉన్న విజయవాడ నగరం ప్రస్తావన అనే శాసనాల్లో వెలుగు చూసింది. చరిత్రలో కృష్ణానదీ తీరంలో విలసిల్లిన విజయవాడ నగరం ఘనమైన వారసత్వాన్ని లేకుండా చేశారు. రాజకీయంగా ప్రత్యర్థుల్ని ఇరకాటంలో పెట్టడానికే ఎన్టీఆర్ పేరును జిల్లాకు పెట్టేశారు.ఆంధ్రప్రదేశ్ చరిత్రలో విజయవాడ ప్రస్తావన శాతవాహనుల కాలం నుంచి శాసనాల్లో కనిపిస్తుంది. అయా కాలాలను బట్టి రకరకాల పేర్లతో విజయవాడ నగరాన్ని శాసనాల్లో ప్రస్తావించారు.అందుబాటులో ఉన్న చరిత్ర ఆధారాలతో మధ్యాంధ్ర యుగంలో ప్రముఖ శైవమత క్షేత్రాల్లో ఒకటిగా విజయవాడ నగరం ప్రసిద్ధి పొందింది. బెజవాడ పేరును ప్రస్తావిస్తూ ఆయా కాలాల్లో పాలకులు, మాండలీకులు నుంచి సామాన్యుల వరకు వేయించిన శాసనాల్లో విజయవాడ పేరును పలు రకాలుగా పేర్కొన్నారు.ఇలా బెజవాడచారిత్రకంగా ఇన్ని విధాలుగా వ్యవహరించబడి, చివరికి విజయవాడగా ప్రసిద్ధిపొందింది.ఇవి కాకుండా అమ్మవారిని కొలువైన బెజవాడను బీజవాటిక, బీజపురి, బెజ్జంవాడ, చోళరాజేంద్రపురం, అర్జునపురి, ఆంగ్లేయుల పాలనలో బ్లేజ్వాడగా కూడా పేర్కొన్నారు.
బెజవాడ ఎండల్ని తాళలేక ఆంగ్లేయులు బ్లేజ్వాడగా పేర్కొన్నప్పటికీ బెజవాడ నామానికి దానికి సంబంధం లేదు.జిల్లాల విభజన సమయంలో ప్రజాభిప్రాయాన్ని సేకరించిన సమయంలో విజయవాడ జిల్లాగా ప్రకటించాలని స్థానికులు, విద్యావంతులు పెద్ద ఎత్తున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అప్పట్లో దానిని వైసీపీ ఖాతరు చేయలేదు. రాజకీయ కారణాలతో టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరు తారక రామారావు పేరుతో జిల్లాను ఏర్పాటు చేశారు. అప్పటికే వైసీపీ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను తొలగించుకునే క్రమంలో ఎన్టీఆర్ పేరుతో జిల్లా పేరును ప్రకటించారనే విమర్శలు కూడా ఉన్నాయి. ఎన్టీఆర్ జన్మించిన కృష్ణా జిల్లాకు ఆయన పేరు పెట్టాల్సి ఉన్నా అప్పట్లో జగన్ ప్రభుత్వం అలా చేయలేదు.ఏపీలో టంగుటూరి ప్రకాశం పంతులు పేరుతో ప్రకాశం జిల్లా, అమరజీవి పొట్టి శ్రీరాములు పేరుతో ఎస్పీఎస్సార్ నెల్లూరు జిల్లాలు ఉన్నాయి. మాజీ సీఎం వైఎస్ మరణం తర్వాత కడప జిల్లా పేరుకు ముందు వైఎస్సార్ పేరును చేర్చారు. జిల్లాల పునర్విభజన సమయంలో వైఎస్సార్ కడప కాస్త వైఎస్సార్ జిల్లాగా మారింది.
విజయవాడ పార్లమెంటు నియోజక వర్గం పరిధిలో ఏర్పాటైన జిల్లాకు మాత్రం ఎన్టీఆర్ పేరును పెట్టారు. మిగిలిన చోట్ల పార్లమెంటు నియోజక వర్గ కేంద్రాలతోనే జిల్లాలు ఏర్పాటు చేశారు. దీనిపై అభ్యంతరాలు వ్యక్తమైనా నాటి ప్రభుత్వం ఖాతరు చేయలేదు.కడపలో మహానాడు కార్యక్రమం ప్రారంభించడానికి ఒక్క రోజు ముందే వైఎస్సార్ జిల్లా పేరును వైఎస్సార్ కడపగా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్టీఆర్ జిల్లా పేరు విషయంలో మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఒకప్పుడు విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్న విజయవాడ విమానాశ్రయాన్ని కూడా పక్క జిల్లాలోకి వెళ్లిపోయింది. కూటమి ప్రభుత్వంలో జిల్లా సరిహద్దులు, పేరు విషయంలో చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తులు వచ్చినా పరిష్కృతం కాలేదు.జిల్లా పేర్లు మార్పు వెనుక ప్రభుత్వానికి దురుద్దేశాలు లేకుంటే,సెంటిమెంట్ ప్రకారం పాత జిల్లా పేర్లు కొనసాగించాలని కోరిక ఉంటే, విజయవాడ నగరానికి NTR జిల్లాగా కాకుండా, ఎన్టీఆర్ విజయవాడ జిల్లాగా పేరు మార్చాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల డిమాండ్ చేశారు. వైఎస్సార్ జిల్లా వైఎస్సార్ కడప జిల్లాగా మార్చినప్పుడు .. ఎన్టీఆర్ జిల్లాను NTR విజయవాడ జిల్లాగా మారిస్తే తప్పేంటని షర్మిల ప్రశ్నించారు.
