West Bengal : పశ్చిమ బెంగాల్లో న్యాయ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం: దేశవ్యాప్తంగా కలకలం:పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో ఓ న్యాయ విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పెళ్లి ప్రతిపాదనను నిరాకరించిందనే కోపంతోనే ప్రధాన నిందితుడు, అధికార టీఎంసీ విద్యార్థి విభాగం నాయకుడు ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
పశ్చిమ బెంగాల్లో న్యాయ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం: దేశవ్యాప్తంగా కలకలం
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో ఓ న్యాయ విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పెళ్లి ప్రతిపాదనను నిరాకరించిందనే కోపంతోనే ప్రధాన నిందితుడు, అధికార టీఎంసీ విద్యార్థి విభాగం నాయకుడు ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ కేసులో ఇప్పటికే ప్రధాన నిందితుడితో పాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు.
బాధిత విద్యార్థినికి నిర్వహించిన వైద్య పరీక్షల్లో భయానక వాస్తవాలు వెలుగుచూశాయి. ఆమెపై సామూహిక అత్యాచారం జరిగినట్లు వైద్యులు ధ్రువీకరించారు. నిందితులు అత్యంత క్రూరంగా ప్రవర్తించినట్లు నివేదికలో స్పష్టమైంది. “బాధితురాలి మెడ, ఛాతీ భాగాలపై పదునైన పంటి గాట్లు ఉన్నాయి. గోళ్లతో రక్కిన ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆమె వ్యక్తిగత అవయవాలను కూడా తీవ్రంగా గాయపరిచారు” అని ఓ సీనియర్ పోలీసు అధికారి మీడియాకు తెలిపారు. ఈ నెల 25న కస్బా ప్రాంతంలోని సౌత్ కోల్కతా లా కళాశాలలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న బాధితురాలిని నిందితులు సెక్యూరిటీ సిబ్బంది గదిలోకి లాక్కెళ్లి బంధించారు. ఆ తర్వాత ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వారి బారి నుంచి తప్పించుకోవడానికి బాధితురాలు ప్రయత్నించగా, హాకీ స్టిక్తో ఆమెపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ దారుణాన్ని బయటపెడితే, ఆమె తల్లిదండ్రులపై తప్పుడు కేసులు బనాయించి జైలుకు పంపుతామని ప్రధాన నిందితుడు బెదిరించినట్లు బాధితురాలు తన వాంగ్మూలంలో పేర్కొంది.
ఈ కేసులో ప్రధాన నిందితుడు మోనోజిత్ మిశ్రా (31) అదే కళాశాల పూర్వ విద్యార్థి. ప్రస్తుతం న్యాయవాదిగా పనిచేస్తూ, అదే కాలేజీలో ఒప్పంద అధ్యాపకుడిగా కూడా కొనసాగుతున్నాడు. అతనికి తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. టీఎంసీ విద్యార్థి విభాగానికి దక్షిణ కోల్కతా జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాడు. దీంతో ఈ ఘటన రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఈ కేసులో మిశ్రాతో పాటు ఇద్దరు సీనియర్ విద్యార్థులను, వారికి సహకరించిన కళాశాల సెక్యూరిటీ గార్డును కూడా పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఈ కేసులో అరెస్టయిన వారి సంఖ్య నాలుగుకు చేరింది. ఘటనపై దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.
