Shubhanshu Shukla :భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అంతరిక్షంలోకి అడుగుపెట్టడానికి సిద్ధమవుతున్నారు. ఆగ్జియమ్-4 (యాక్స్-4) వాణిజ్య అంతరిక్ష యాత్రలో భాగంగా ఆయన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐ.ఎస్.ఎస్) వెళ్లనున్నారు.
అంతరిక్షంలోకి భారత వ్యోమగామి శుభాంశు శుక్లా: జూన్ 19న ఆగ్జియమ్-4 ప్రయోగం
భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అంతరిక్షంలోకి అడుగుపెట్టడానికి సిద్ధమవుతున్నారు. ఆగ్జియమ్-4 (యాక్స్-4) వాణిజ్య అంతరిక్ష యాత్రలో భాగంగా ఆయన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐ.ఎస్.ఎస్) వెళ్లనున్నారు. పలుమార్లు వాయిదా పడిన ఈ ప్రయోగాన్ని ఈనెల 19న చేపట్టేందుకు సర్వం సిద్ధమైంది. ఈ యాత్ర విజయవంతమైతే రాకేష్ శర్మ తర్వాత అంతరిక్షంలోకి వెళ్ళిన రెండో భారతీయుడిగా శుభాంశు శుక్లా చరిత్ర సృష్టిస్తారు. ఆగ్జియమ్ స్పేస్ సంస్థ, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సహకారంతో ఈ యాత్రను నిర్వహిస్తోంది.
స్పేస్‌ఎక్స్‌కు చెందిన ఫాల్కన్-9 రాకెట్ ద్వారా ఈ ప్రయోగం జరగనుంది. నలుగురు సభ్యుల బృందంలో శుభాంశు శుక్లా పైలట్‌గా వ్యవహరించనున్నారు. మిషన్ కమాండర్‌గా నాసా మాజీ వ్యోమగామి పెగ్గీ విట్సన్, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ప్రాజెక్ట్ వ్యోమగామి స్లావోస్జ్ ఉజ్నాన్‌స్కీ-విస్నీవ్‌స్కీ (పోలాండ్), టిబోర్ కాపు (హంగేరి) ఇతర సభ్యులుగా ఉన్నారు.వాస్తవానికి ఈ మిషన్ మే 29న ప్రారంభం కావాల్సి ఉండగా, ఫాల్కన్-9 రాకెట్‌లో ద్రవ ఆక్సిజన్ లీక్ సమస్య తలెత్తడంతో పలుమార్లు వాయిదా పడింది. తొలుత ఈనెల 8కి, ఆపై 10, మళ్లీ 11వ తేదీలకు మార్చినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు.
దీనికి తోడు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోని రష్యన్ జ్వెజ్డా మాడ్యూల్‌లో పీడన సమస్య కూడా తలెత్తడంతో నాసా, ఆగ్జియమ్ స్పేస్ సంస్థలు వ్యోమగాముల భద్రత దృష్ట్యా ప్రయోగాన్ని మరింత ఆలస్యం చేశాయి. అయితే, ఇటీవల జరిగిన సమన్వయ సమావేశంలో అన్ని సాంకేతిక సమస్యలను విజయవంతంగా పరిష్కరించినట్లు ఇస్రో ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో జూన్ 19న ప్రయోగానికి మార్గం సుగమమైందని పేర్కొంది. శుభాంశు శుక్లా యాత్రకు సంబంధించిన ఏర్పాట్లలో ఇస్రో చురుగ్గా పాలుపంచుకుంటోంది. ఈ ఆగ్జియమ్-4 మిషన్ విజయవంతమైతే వాణిజ్య అంతరిక్ష ప్రయాణ రంగంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలవడమే కాకుండా, అంతర్జాతీయ మానవసహిత అంతరిక్ష యాత్రలలో భారతదేశ పాత్రను మరింత బలోపేతం చేస్తుందని నిపుణులు భావిస్తున్నారు.
Read also:Kannappa : మంచు విష్ణు ‘కన్నప్ప’ ట్రైలర్ ఈరోజు సాయంత్రం 6 గంటలకు విడుదల