Jasprit Bumrah : జస్‌ప్రీత్ బుమ్రా లేకుండా బర్మింగ్‌హామ్ టెస్టుకు టీమిండియా

India's Pace Spearhead Bumrah to Miss Birmingham Test due to Workload Management

Jasprit Bumrah : జస్‌ప్రీత్ బుమ్రా లేకుండా బర్మింగ్‌హామ్ టెస్టుకు టీమిండియా:ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భారత పేస్ దళానికి నాయకత్వం వహిస్తున్న స్టార్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా, జులై 2న బర్మింగ్‌హామ్ వేదికగా ప్రారంభం కానున్న రెండో టెస్టుకు దూరమయ్యాడు.

ఇంగ్లండ్‌తో రెండో టెస్టుకు జస్‌ప్రీత్ బుమ్రా దూరం: టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ

ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భారత పేస్ దళానికి నాయకత్వం వహిస్తున్న స్టార్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా, జులై 2న బర్మింగ్‌హామ్ వేదికగా ప్రారంభం కానున్న రెండో టెస్టుకు దూరమయ్యాడు. పనిభారం నిర్వహణలో భాగంగా అతడికి విశ్రాంతి ఇవ్వాలని జట్టు యాజమాన్యం నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే, ఈ విషయంపై బీసీసీఐ నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.

లీడ్స్‌లో ముగిసిన మొదటి టెస్టులో బుమ్రా అద్భుత ప్రదర్శన కనబరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడగొట్టి భారత బౌలింగ్‌కు వెన్నెముకగా నిలిచాడు. అయితే, అతడికి ఇతర బౌలర్ల నుంచి సరైన సహకారం అందలేదు. యువ బౌలర్లు ప్రసిధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. ప్రసిధ్ కృష్ణ రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి 35 ఓవర్లలో 220 పరుగులు సమర్పించుకోగా, సిరాజ్ 41 ఓవర్లలో 173 పరుగులిచ్చి కేవలం రెండు వికెట్లకే పరిమితమయ్యాడు. బుమ్రా ఒక్కడే 43.4 ఓవర్లలో 3.20 ఎకానమీ రేటుతో 140 పరుగులిచ్చి 5 వికెట్లు తీయగా, మిగిలిన పేసర్లు దారుణంగా విఫలమవడం జట్టును ఆందోళనకు గురిచేస్తోంది.

ఈ సిరీస్ ప్రారంభానికి ముందే బుమ్రా పనిభారాన్ని దృష్టిలో ఉంచుకుని, అతడిని ఐదు టెస్టులకు గాను కేవలం మూడింటిలోనే ఆడించాలని యాజమాన్యం ప్రణాళిక రచించినట్లు సమాచారం. రెండో టెస్టు జులై 2న ప్రారంభం కానుండగా, మూడో టెస్టు జులై 10న లార్డ్స్‌లో మొదలవుతుంది. ఈ మధ్యలో లభించే కొద్దిపాటి విరామం కారణంగా బుమ్రా మూడో టెస్టు నాటికి మళ్లీ జట్టుతో చేరే అవకాశాలున్నాయి.

బుమ్రా గైర్హాజరీతో తుది జట్టులో ఎవరికి చోటు దక్కుతుందనే దానిపై ఆసక్తి నెలకొంది. జట్టులో స్పెషలిస్ట్ పేసర్లుగా ఆకాశ్ దీప్, అర్ష్‌దీప్ సింగ్ ఉన్నారు. వీరిలో ఎడమచేతి వాటం పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌ను తుది జట్టులోకి తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. అర్ష్‌దీప్‌కు టెస్టు అనుభవం లేనప్పటికీ టీ20 ఫార్మాట్‌లో 63 మ్యాచ్‌లలో 99 వికెట్లతో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. మరోవైపు బ్యాటింగ్ విభాగంలో బలం పెంచుకోవాలని భావిస్తే శార్దూల్ ఠాకూర్ స్థానంలో మీడియం పేస్ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డిని కూడా పరిగణనలోకి తీసుకోవచ్చు.

బుమ్రాకు విశ్రాంతినివ్వాలన్న నిర్ణయంపై మాజీ క్రికెటర్ల నుంచి భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. “బుమ్రాకు విశ్రాంతి ఇవ్వాలనుకుంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. అతను లేకుండా బరిలోకి దిగి 2-0తో వెనుకబడితే, సిరీస్‌లో పుంజుకోవడం చాలా కష్టమవుతుంది” అని భారత మాజీ కోచ్ రవిశాస్త్రి హెచ్చరించారు. మరోవైపు సునీల్ గవాస్కర్ వంటి దిగ్గజాలు బుమ్రాను ఐదు టెస్టుల్లోనూ ఆడించాలని సూచించారు.

అయితే, ఈ విమర్శలపై కోచ్ గౌతమ్ గంభీర్ స్పష్టతనిచ్చారు. “బుమ్రా వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ మాకు చాలా ముఖ్యం. భవిష్యత్తులో చాలా క్రికెట్ ఉంది. అతను జట్టుకు ఎంత కీలకమో మాకు తెలుసు. ఈ పర్యటనకు రాకముందే అతను మూడు టెస్టులు ఆడతాడని నిర్ణయించాం. అతని శరీరం ఎలా స్పందిస్తుందో చూద్దాం” అని తొలి టెస్టు అనంతరం జరిగిన మీడియా సమావేశంలో గంభీర్ వివరించాడు.

Read also:Trump : భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై ట్రంప్ కీలక సంకేతాలు

 

Related posts

Leave a Comment