West Bengal : పశ్చిమ బెంగాల్‌లో మహిళల భద్రతపై తీవ్ర ఆందోళన: న్యాయ కళాశాల ప్రాంగణంలోనే విద్యార్థినిపై సామూహిక అత్యాచారం

Another Horror in West Bengal: Law Student Gang Raped, Sparks Political Row Over TMC Allegations

West Bengal : పశ్చిమ బెంగాల్‌లో మహిళల భద్రతపై తీవ్ర ఆందోళన: న్యాయ కళాశాల ప్రాంగణంలోనే విద్యార్థినిపై సామూహిక అత్యాచారం:పశ్చిమ బెంగాల్‌లో మహిళల భద్రత మరోసారి ప్రశ్నార్థకమైంది. కోల్‌కతాలోని ఆర్జీకర్‌ వైద్య కళాశాల విద్యార్థినిపై జరిగిన అత్యాచార ఘటన మరువకముందే, తాజాగా ఒక న్యాయ కళాశాల ప్రాంగణంలోనే 24 ఏళ్ల విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది.

పశ్చిమ బెంగాల్‌లో మహిళల భద్రతపై తీవ్ర ఆందోళన

పశ్చిమ బెంగాల్‌లో మహిళల భద్రత మరోసారి ప్రశ్నార్థకమైంది. కోల్‌కతాలోని ఆర్జీకర్‌ వైద్య కళాశాల విద్యార్థినిపై జరిగిన అత్యాచార ఘటన మరువకముందే, తాజాగా ఒక న్యాయ కళాశాల ప్రాంగణంలోనే 24 ఏళ్ల విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనలో ప్రధాన నిందితుడికి అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు తీవ్ర రాజకీయ దుమారానికి దారితీశాయి.

కోల్‌కతాలోని ఓ న్యాయ కళాశాలలో చదువుతున్న విద్యార్థినిపై అదే కళాశాలకు చెందిన ఇద్దరు సీనియర్లు, ఒక పూర్వ విద్యార్థి కలిసి కళాశాల ప్రాంగణంలోనే ఈ దారుణానికి పాల్పడ్డారు. బాధితురాలిపై సామూహిక అత్యాచారం జరిగినట్లు వైద్య పరీక్షల్లో నిర్ధారణ అయిందని ఒక సీనియర్ పోలీసు అధికారి వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి గురువారం ఇద్దరిని, శుక్రవారం ప్రధాన నిందితుడైన మనోజిత్ మిశ్రా (31)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనను వదిలేయమని వేడుకున్నా నిందితులు కనికరించలేదని, ఈ అఘాయిత్యాన్ని వీడియో తీసి అందరికీ పంపిస్తామని బెదిరించారని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. తాను తప్పించుకునేందుకు ప్రయత్నించగా హాకీ స్టిక్‌తో దాడి చేశారని ఆమె పోలీసులకు వివరించింది.

ఈ ఘటనపై గతంలో అత్యాచారానికి గురైన ఆర్జీకర్‌ వైద్య విద్యార్థిని తండ్రి తీవ్రంగా స్పందించారు. టీఎంసీ ప్రభుత్వ ఉదాసీనత వల్లే రాష్ట్రంలో ఇలాంటి దారుణాలు పునరావృతమవుతున్నాయని ఆయన ఆరోపించారు. “నా కుమార్తె విషయంలో వేలాది మంది రోడ్లపైకి వచ్చి పోరాడారు. అయినా మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. నా కుమార్తెలాంటి అభాగ్యులు ఇంకెంత మంది ప్రభుత్వ నిర్లక్ష్యానికి బలి కావాలి? ఈ కేసులో నిందితులకు కఠిన శిక్ష పడినప్పుడే ఇటువంటివి ఆగుతాయి” అని ఆయన అన్నారు. నిందితులందరూ అధికార పార్టీకి చెందినవారేనని ఆయన ఆరోపించారు.

ఈ ఘటనపై టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ చేసిన వ్యాఖ్యలు పెను దుమారానికి కారణమయ్యాయి. “విద్యార్థినిపై ఆమె స్నేహితులే అత్యాచారం చేస్తే ఎవరు మాత్రం ఏం చేయగలరు? పోలీసులు ప్రతి కళాశాలలో కాపలా ఉండాలా?” అంటూ ఆయన మీడియాపై విరుచుకుపడ్డారు. మహిళలు ప్రభుత్వాలపై కాకుండా, ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్న పురుషులకు వ్యతిరేకంగా పోరాడాలని ఆయన వ్యాఖ్యానించారు. కల్యాణ్ బెనర్జీ వ్యాఖ్యలను ప్రతిపక్ష బీజేపీ నేతలు తీవ్రంగా ఖండిస్తూ ప్రభుత్వ బాధ్యతారాహిత్యానికి ఇది నిదర్శనమని మండిపడ్డారు.

Read also:Madhapur : మాదాపూర్ సున్నం చెరువు: భూగర్భ జలాలు కూడా కలుషితం

 

 

Related posts

Leave a Comment