Savings : వారెన్ బఫెట్ ఆర్థిక సూత్రాలు: ధనవంతులుగా మారే మార్గం:ఒక రూపాయి పొదుపు చేయడమంటే ఆ రూపాయిని సంపాదించినట్లే” అని పెద్దలు చెబుతుంటారు. సంపాదన ఎంత ఉన్నప్పటికీ, పొదుపుగా ఉండడం, ఖర్చుల విషయంలో తెలివిగా వ్యవహరించడం ద్వారా ధనవంతులుగా మారవచ్చని వారెన్ బఫెట్ నొక్కి చెబుతున్నారు.
ఆర్థిక క్రమశిక్షణతో ధనవంతులుగా మారండి: వారెన్ బఫెట్ సూచనలు
ఒక రూపాయి పొదుపు చేయడమంటే ఆ రూపాయిని సంపాదించినట్లే” అని పెద్దలు చెబుతుంటారు. సంపాదన ఎంత ఉన్నప్పటికీ, పొదుపుగా ఉండడం, ఖర్చుల విషయంలో తెలివిగా వ్యవహరించడం ద్వారా ధనవంతులుగా మారవచ్చని వారెన్ బఫెట్ నొక్కి చెబుతున్నారు. ప్రతి వ్యక్తికీ ఆర్థిక క్రమశిక్షణ చాలా ముఖ్యం అని, సంపాదించిన డబ్బును ఎలా ఖర్చు చేస్తున్నామనేది మరింత కీలకమని ఆయన తెలిపారు. ముఖ్యంగా, అవసరానికి, ఆడంబరానికి తేడా తెలుసుకుని ఖర్చు చేయాలని యువతకు సూచిస్తున్నారు. ఎక్కడ డబ్బు వృథా చేయకూడదో తెలిసిన వాడే డబ్బును కాపాడగలడని ఆయన చెప్పారు. ఖర్చులన్నీ చేశాకే పొదుపు చేస్తామనడం సరైన పద్ధతి కాదని, పొదుపు చేశాకే ఖర్చుల లెక్క చూసుకోవాలని బఫెట్ చెబుతున్నారు. ఉద్యోగంలో చేరాక చాలామందికి సొంతింటి కల ఉంటుంది.
సొంతింట్లో ఉండే ఆనందమే వేరు. అయితే, ఇల్లు కొనుగోలు చేయడంలోనూ అవసరాలను పరిగణనలోకి తీసుకోవాలని బఫెట్ సూచిస్తున్నారు. చిన్న కుటుంబానికి డబుల్ బెడ్రూం ఇల్లు సరిపోతుంది. కేవలం డబ్బు ఉందని లేక బంధుమిత్రుల ముందు గొప్పతనం కోసమో మూడు, నాలుగు బెడ్రూంలు ఉన్న ఇల్లు తీసుకోవడం సరికాదు. అవసరానికి మించిన ఇంటిని కొనుగోలు చేస్తే దానికి మెయింటెనెన్స్, ట్యాక్సులు, ఈఎంఐల రూపంలో పెద్ద మొత్తంలో ఖర్చు అవుతుంది. ఇల్లు మన అవసరానికి సరిపోయేలా ఉండాలి కానీ, మన దర్పాన్ని చూపించుకోవడానికి కాదని ఆయన వివరించారు.ఉద్యోగస్తులకు బ్యాంకులు ఇచ్చే క్రెడిట్ కార్డుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని బఫెట్ హెచ్చరిస్తున్నారు. షాపింగ్ కోసం కార్డును వాడడం ఎంత సులభమో, నెలాఖరున ఆ మొత్తం చెల్లించడం అంత ప్రయాసతో కూడుకున్నదని గుర్తుంచుకోవాలన్నారు.
తెలివిగా వాడుకుంటే క్రెడిట్ కార్డుతో చాలా ప్రయోజనం ఉంటుంది. లేదంటే, క్రెడిట్ కార్డే అప్పుల ఊబిలోకి నెడుతుందని ఆయన స్పష్టం చేశారు. సొంత కారులో తిరగాలనేది చాలామంది కల. ప్రస్తుతం బ్యాంకులు ఇస్తున్న వాహన రుణాలతో ఈ కలను నెరవేర్చుకోవడం పెద్ద కష్టం కాకపోవచ్చు. అయితే, ఇప్పుడు కారు అవసరమా అనేది ఎవరికి వారే ఆలోచించుకోవాలని బఫెట్ చెబుతున్నారు. జీతం పెరిగిందనో, స్థోమత వచ్చిందనో వెంటనే కారు కొనుగోలు చేయడం సరైన పద్ధతి కాదంటున్నారు. ఒకసారి షోరూం నుంచి కారు బయటకు వచ్చిందంటే రోజురోజుకూ దాని విలువ తగ్గిపోతూ ఉంటుందని గుర్తించాలన్నారు. ఐదేళ్లలోనే దాని విలువ దాదాపు 60 శాతం మేర పడిపోతుంది. అంటే కారుపై పెట్టిన పెట్టుబడి (ఖర్చు) తగ్గిపోతుందని వివరించారు. మన పెట్టుబడులు ఎప్పుడూ వాటి విలువ పెంచే వాటిలో ఉండాలే తప్ప, తగ్గించే వాటిలో కాదని బఫెట్ చెప్పారు.
రోజుకో కొత్త కారులో తిరిగే స్తోమత ఉన్న బఫెట్ ఇప్పటికీ 2014లో కొనుగోలు చేసిన కారులోనే తిరుగుతుంటారు. బఫెట్ ఆ కారును కూడా డిస్కౌంట్ లో కొన్నారట.ఆరు రూపాయల లాటరీతో ఓ సామాన్యుడు కోటి రూపాయలు గెల్చుకున్నాడని ఇటీవల ఓ వార్త వైరల్ అయింది. ఇలా లాటరీలు, జూదంలో పెద్ద మొత్తంలో గెలుచుకునే అవకాశం ఉందని చాలామంది అటువైపు మొగ్గుతుంటారు. కానీ అది ఆరోగ్యకరం కాదని, జూదంలో గెలుచుకునే అవకాశం అతి స్వల్పమని బఫెట్ అంటున్నారు. ఆ అదృష్టం దక్కేది కేవలం 10 లక్షల మందిలో ఒక్కరికి మాత్రమేనని వివరించారు. జూదంలో పోగొట్టుకోవడమే తప్ప పొందేది ఏమీ ఉండదని ఆయన స్పష్టం చేశారు.ఎవరు చెప్పినా సరే, తెలియని పథకాల్లో పెట్టుబడులు పెట్టవద్దని బఫెట్ సూచిస్తున్నారు. సొంతంగా అవగాహన చేసుకున్నాకే పెట్టుబడులు పెట్టాలని చెప్పారు. మీరు పెట్టుబడి చేస్తున్న పథకం అసలు మీకు అర్థం కాకపోతే మీ డబ్బును రిస్క్లో పెడుతున్నట్లేనని ఆయన అన్నారు. “రిటర్న్స్ ఎక్కువ” అనే పదం వెనుక “రిస్క్ కూడా ఎక్కువ” అనే విషయం దాగి ఉందని గుర్తించాలని బఫెట్ తెలిపారు.
Read also:Kavitha : జయశంకర్ సార్ విగ్రహ గద్దె కూల్చివేత: కవిత ఆగ్రహం
