-
పల్నాడు జిల్లాలో స్వచ్ఛ ఆంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమం
-
మాచర్లలో ప్రజావేదిక సభలో చంద్రబాబు ప్రసంగం
-
రాష్ట్రంలో చెత్త రాజకీయాలను పూర్తిగా ప్రక్షాళన చేస్తామని ఉద్ఘాటన
పల్నాడు జిల్లాలోని మాచర్లలో ఇటీవల వరకు ఎంతటి భయానక వాతావరణం ఉండేదంటే, తన లాంటి నాయకుడు కూడా అక్కడికి వెళ్లలేని దుస్థితి ఉండేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఇప్పుడు ఎవరైనా స్వేచ్ఛగా ఈ ప్రాంతానికి వచ్చే పరిస్థితులు కల్పించామని ఆయన తెలిపారు. ‘స్వచ్ఛ ఆంధ్ర-స్వర్ణాంధ్ర’ కార్యక్రమంలో భాగంగా మాచర్లలో నిర్వహించిన ‘ప్రజా వేదిక’ బహిరంగ సభలో ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, రాష్ట్రంలో కేవలం చెత్తనే కాకుండా, “చెత్త రాజకీయాలను” కూడా పూర్తిగా ప్రక్షాళన చేస్తామని స్పష్టం చేశారు. “పల్నాడులో అరాచకాలు, దాడులు చేస్తే సహించేది లేదు. రౌడీయిజం, నేరాలు, ఘోరాలు చేస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు. ప్రజల ఆస్తులకు మేమే రక్షణగా నిలబడతాం” అని ఆయన గట్టిగా హెచ్చరించారు. గతంలో రాయలసీమలో ముఠా సంస్కృతిని అణచివేశామని, ఇక్కడ కూడా అలాంటి పరిస్థితులకు తావివ్వబోమని తేల్చిచెప్పారు.
గత వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు నాయుడు తీవ్ర విమర్శలు చేశారు. రోడ్లపై 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను పోయడమే కాకుండా, చెత్తపై పన్ను వేసి ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెట్టారని ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ పన్నును రద్దు చేశామని గుర్తుచేశారు. కేవలం రోడ్లపై ఉన్న చెత్తను తీసివేయడమే కాదని, మనసుల్లోని చెత్తను కూడా తొలగించాలని ఆయన పిలుపునిచ్చారు. మాచర్లలో ఇటీవల వరకు ప్రజాస్వామ్యం లేదని, ఎవరి ప్రవర్తన బాగాలేకపోయినా ప్రజలు క్షమించరని ఆయన వ్యాఖ్యానించారు.
Read also : AP : ఏపీ లిక్కర్ స్కామ్: ఎంపీ మిథున్ రెడ్డిని కస్టడీలోకి తీసుకున్న అధికారులు
