-
అధికారికంగా ప్రకటించిన నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్
-
సీక్వెల్లో ఆమె పాత్రను కుదించడమే ప్రధాన కారణమని కథనాలు
పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘కల్కి 2898 ఏడీ’ సినిమాకు సీక్వెల్ రాబోతోంది. ఈ భారీ ప్రాజెక్టు నుంచి బాలీవుడ్ నటి దీపికా పదుకొణె తప్పుకున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ అధికారికంగా ప్రకటించింది. ఈ నిర్ణయం వెనుక బలమైన కారణాలు ఉన్నట్లు ఇండస్ట్రీలో తీవ్రంగా చర్చ జరుగుతోంది.
వైజయంతీ మూవీస్ తమ అధికారిక X (గతంలో ట్విట్టర్) ఖాతా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. “కల్కి 2898 ఏడీ సీక్వెల్ ప్రాజెక్టులో దీపికా పదుకొణె భాగం కావడం లేదని అధికారికంగా తెలియజేస్తున్నాము. అనేక చర్చల తర్వాత, మా ఇద్దరి దారులు వేరని నిర్ణయించుకున్నాం. ఈ ప్రాజెక్టుకు అవసరమైన పూర్తి సహకారం, నిబద్ధత కుదరలేదు. ఆమె భవిష్యత్ ప్రాజెక్టులకు మా శుభాకాంక్షలు,” అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
అయితే, ఈ ప్రకటన వెనుక అసలు కారణాలు వేరే ఉన్నాయని పలు జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. సీక్వెల్లో దీపికా పోషించాల్సిన సుమతి పాత్రను కేవలం అతిథి పాత్రగా మార్చడమే ఆమె తప్పుకోవడానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. మొదట ఆమె పాత్ర ప్రధానంగా ఉంటుందని చెప్పి, ఇప్పుడు మార్పులు చేయడంతో దీపికా బృందం నిరాశకు గురైనట్లు సమాచారం.
మరోవైపు, పారితోషికం విషయంలోనూ విభేదాలు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. మొదటి భాగం కంటే 25 శాతం ఎక్కువ పారితోషికం డిమాండ్ చేయడంతో పాటు, రోజుకు కేవలం 7 గంటలు మాత్రమే షూటింగ్లో పాల్గొంటానని ఆమె షరతు పెట్టినట్లు తెలుస్తోంది. తన 25 మంది సిబ్బందికి ఫైవ్-స్టార్ హోటళ్లలో వసతి కల్పించాలని కోరడం కూడా నిర్మాతలకు అదనపు భారాన్ని కలిగించిందని కొన్ని కథనాలు చెబుతున్నాయి.
కాగా, ప్రభాస్ సినిమా నుంచి దీపికా ఇలా మధ్యలో తప్పుకోవడం ఇది రెండోసారి. గతంలో సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలోని ‘స్పిరిట్’ సినిమా విషయంలోనూ ఇదే జరిగింది. ఆ సినిమా కోసం రూ. 20 కోట్ల పారితోషికం, లాభాల్లో వాటా, రోజుకు 6 గంటల పనివేళలు వంటి డిమాండ్లు పెట్టడంతో పాటు, తెలుగులో డైలాగులు చెప్పడానికి నిరాకరించారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇప్పుడు ‘కల్కి 2’లో దీపికా స్థానంలో ఏ హీరోయిన్ను తీసుకుంటారనే దానిపై ఆసక్తి నెలకొంది.
Read also : Sukumar : సుకుమార్ కొత్త ప్రాజెక్టులు: రామ్ చరణ్ సినిమాతో పాటు 6 కొత్త చిత్రాలు!
