-
బ్లాక్మెయిల్ చేసి పేటీఎం ద్వారా డబ్బుల వసూలు
-
ఫ్లాట్‌కు వెళ్లి పర్సులోని నగదు కూడా దోపిడీ
-
బాధితుడి ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన ఘటన
సాంకేతికత ఎంతగా పెరిగి, పరిచయాలు సులభమవుతున్నాయో, అదే స్థాయిలో ఆన్లైన్ మోసాలు కూడా పెరుగుతున్నాయి. తాజాగా, హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఒక దారుణమైన ఘటన వెలుగు చూసింది. డేటింగ్ యాప్‌లో పరిచయమైన వ్యక్తి చేతిలో ఒక వైద్యుడు ఘోరంగా మోసపోయాడు. తన కోరిక తీర్చలేదన్న కోపంతో ఆ వైద్యుడిపై దాడి చేసి, బ్లాక్మెయిల్ చేసి డబ్బులు గుంజాడో యువకుడు.
పోలీసుల వివరాల ప్రకారం, నగరానికి చెందిన ఆ వైద్యుడికి వారం రోజుల క్రితం తేరాల శరణ్ భగవాన్‌రెడ్డి అనే వ్యక్తితో ఒక గే డేటింగ్ యాప్‌లో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ కొంతకాలం చాటింగ్ చేసుకున్నారు. ఈ క్రమంలో, ఈ నెల 21న కలుద్దామని భగవాన్‌రెడ్డి ఆ వైద్యుడిని మాదాపూర్‌లోని ఒక హాస్టల్‌కు పిలిచాడు.
అక్కడికి వెళ్లిన వైద్యుడితో నిందితుడు అనుచితంగా ప్రవర్తించగా, వైద్యుడు అడ్డుకున్నాడు. దీంతో కోపంతో రగిలిపోయిన భగవాన్‌రెడ్డి ఆ వైద్యుడిపై దాడి చేశాడు. ఈ విషయం కుటుంబ సభ్యులకు, ఆసుపత్రికి చెబుతానని బెదిరించాడు. తాను చెప్పినట్లు వినకపోతే చంపేస్తానంటూ హెచ్చరించాడు.
భయపడిపోయిన వైద్యుడు వెంటనే పేటీఎం ద్వారా రూ. 5,000 నిందితుడికి బదిలీ చేశాడు. అంతటితో ఆగకుండా, నిందితుడు బాధితుడి ఫోన్ లాక్కొని, అతని ఫ్లాట్‌కు వెళ్లి పర్సులో ఉన్న మరో రూ. 3,000 కూడా దోచుకున్నాడు. నిందితుడి వేధింపులు భరించలేక బాధితుడు ఈ నెల 22న ఉమెన్ సేఫ్టీ వింగ్‌ను ఆశ్రయించాడు. వారు ఈ కేసును మాదాపూర్ పోలీసులకు అప్పగించగా, పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read also : GST : జీఎస్టీ తగ్గింపుతో రికార్డు: ఒక్క రోజులోనే ₹11 లక్షల కోట్ల డిజిటల్ లావాదేవీలు!
