-
ఈరోజు నాకు ఎంతో ఆనందంగా ఉందన్న మంచు మనోజ్
-
నన్ను నమ్మిన దర్శక, నిర్మాతలకు రుణపడి ఉంటానని వ్యాఖ్య
-
నాతో పాటు నా కుటుంబాన్ని నిలబెట్టారన్న మంచు మనోజ్
నటుడు మంచు మనోజ్ తన తాజా చిత్రం అద్భుతమైన విజయం సాధించడంతో సంతోషం వ్యక్తం చేశారు. గత పన్నెండేళ్లుగా సరైన విజయం లేకపోవడంతో, తన ఫోన్ నిరంతరం మోగుతోందని, ఈ రోజు చాలా ఆనందంగా ఉందని ఆయన అన్నారు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తేజ సజ్జా, మంచు మనోజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా మొదటి రోజునే రూ. 27 కోట్లు వసూలు చేసింది.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్లో మంచు మనోజ్ మాట్లాడుతూ, తనను నమ్మిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయం తనకొక కలలా అనిపిస్తోందని, అభినందనలు వెల్లువెత్తుతున్నాయని ఆయన తెలిపారు. ఈ కథలో తనను భాగం చేసినందుకు దర్శకుడు కార్తీక్కి ప్రత్యేకంగా రుణపడి ఉంటానని పేర్కొన్నారు.
గతంలో తాను ఎక్కడికి వెళ్లినా సినిమా ఎప్పుడు చేస్తారని అడిగేవారని, బయటకు ధైర్యంగా ఉన్నప్పటికీ లోపల భయంగా ఉండేదని మనోజ్ పంచుకున్నారు. అనేక సినిమాలు చివరి నిమిషంలో ఆగిపోయాయని ఆయన గుర్తుచేసుకున్నారు. అలాంటి పరిస్థితుల్లో దర్శకుడు కార్తీక్ తనను నమ్మడం అదృష్టమని ఆయన అన్నారు. ఈ అవకాశం తనతో పాటు తన కుటుంబాన్ని కూడా నిలబెట్టిందని ఆయన తెలిపారు.
‘మనోజ్తో సినిమా వద్దని’ చాలామంది చెప్పి ఉంటారని, అయినప్పటికీ నిర్మాత విశ్వప్రసాద్ గారు ధైర్యంగా ఈ చిత్రాన్ని నిర్మించారని మనోజ్ ప్రశంసించారు. ‘మిరాయ్’ వీఎఫ్ఎక్స్ టీమ్ కూడా తెలుగు సినిమా గర్వపడేలా చేసిందని ఆయన అన్నారు. “ప్రతి ఇంట్లో నుంచి మనోజ్ గెలవాలని కోరుకున్న వారందరికీ పేరుపేరునా పాదాభివందనం” అని ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.
Read also : AP : ఆంధ్రప్రదేశ్లో వైద్య కళాశాలలు: పీపీపీ విధానంపై మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పందన
