AP : ఎంపీ ఫొటోతో మేనేజర్‌ను మోసం చేసిన సైబర్ కేటుగాళ్లు

Cyber Fraud: Kakinada MP's Name Used to Swindle Rs. 92 Lakh from Company Manager
  • కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ‘టీ-టైమ్’ సంస్థలో భారీ మోసం

  • ఎంపీ ఫొటోతో వాట్సాప్‌లో నమ్మించిన సైబర్ నేరగాళ్లు

  • రూ.92 లక్షలు బదిలీ చేసిన ఫైనాన్స్ మేనేజర్

జనసేన పార్టీకి చెందిన కాకినాడ ఎంపీ, ‘టీ-టైమ్’ సంస్థ అధినేత ఉదయ్ శ్రీనివాస్ పేరును ఉపయోగించుకుని సైబర్ నేరగాళ్లు భారీ మోసానికి పాల్పడ్డారు. ఎంపీ ఫొటోను వాట్సాప్ ప్రొఫైల్‌గా పెట్టుకుని, ఆయన సంస్థ ఫైనాన్స్ మేనేజర్‌ను మోసగించి ఏకంగా రూ.92 లక్షలు కాజేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

అసలేం జరిగిందంటే..

టీ-టైమ్ సంస్థలో చీఫ్ ఫైనాన్స్ మేనేజర్‌గా పనిచేస్తున్న గంగిశెట్టి శ్రీనివాసరావుకు గత నెల 22న ఒక గుర్తుతెలియని నంబర్ నుంచి వాట్సాప్ సందేశం వచ్చింది. ఆ నంబర్ ప్రొఫైల్ ఫొటోలో ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ చిత్రం ఉండటంతో అది ఆయనేనని మేనేజర్ భావించారు. సైబర్ నేరగాళ్లు తాను కొత్త నంబర్ వాడుతున్నానని, అత్యవసరంగా కొంత డబ్బు పంపాలని సందేశాలు పంపారు.

తన యజమానే అడుగుతున్నారని పూర్తిగా నమ్మిన మేనేజర్, ఎటువంటి క్రాస్ చెక్ చేసుకోకుండానే నేరగాళ్లు సూచించిన వేర్వేరు బ్యాంకు ఖాతాలకు మొత్తం 11 విడతల్లో రూ.92 లక్షలు బదిలీ చేశారు.

ఈ నెల 8న ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ తన కంపెనీ బ్యాంకు ఖాతాలను తనిఖీ చేస్తున్నప్పుడు కొన్ని అనుమానాస్పద లావాదేవీలను గుర్తించారు. వెంటనే ఫైనాన్స్ మేనేజర్‌ను అడిగి తెలుసుకోగా అసలు విషయం బయటపడింది. తాను డబ్బుల కోసం ఎలాంటి సందేశాలు పంపలేదని, తన ఫోన్ నంబర్ కూడా మారలేదని ఎంపీ స్పష్టం చేయడంతో మేనేజర్ నివ్వెరపోయారు.

తాము మోసపోయామని గ్రహించిన వెంటనే వారు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, నగదు బదిలీ జరిగి రెండు వారాలు కావడంతో అప్పటికే నేరగాళ్లు ఎక్కువ మొత్తాన్ని డ్రా చేసుకున్నారు. పోలీసులు వెంటనే స్పందించి కేవలం రూ.7 లక్షల మొత్తాన్ని మాత్రమే ఫ్రీజ్ చేయగలిగారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read also : Telangana-AndhraPradesh : హైదరాబాద్-అమరావతి ఎక్స్‌ప్రెస్‌వే: ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుంది

Related posts

Leave a Comment