-
నేడు ఆటోడ్రైవర్ సేవలో పథకం ప్రారంభం
-
ఆటో నడిపిన స్వర్ణలత అనే మహిళ
-
ఉండవల్లి నుంచి స్టేడియం వరకు సుమారు 11.5 కిలోమీటర్ల ప్రయాణం
ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ ఒక మహిళా ఆటో డ్రైవర్ నడిపిన ఆటోలో ప్రయాణించి అందరినీ ఆశ్చర్యపరిచారు. విజయవాడలో ‘ఆటో డ్రైవర్ సేవలో’ పథకం ప్రారంభోత్సవానికి హాజరయ్యేందుకు, ఆయన తన నివాసం నుంచి కార్యక్రమ స్థలానికి స్వర్ణలత అనే మహిళా డ్రైవర్ ఆటోలో వెళ్లారు. ఉండవల్లిలోని ఆయన నివాసం నుంచి మాకినేని బసవపున్నయ్య స్టేడియం వరకు సుమారు 11.5 కిలోమీటర్ల దూరం ఈ ప్రయాణం సాగింది.
ఈ ప్రయాణంలో మంత్రి లోకేశ్.. ఆటో డ్రైవర్ స్వర్ణలతతో మాట్లాడారు. ఆమె కుటుంబ నేపథ్యం, ఆర్థిక పరిస్థితులు, ప్రభుత్వ పథకాల లబ్ధి వంటి వివరాలను ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. తాను విజయవాడ ఆటోనగర్లో నివసిస్తున్నానని, తన భర్త ప్రోత్సాహంతోనే ఈ వృత్తిలో రాణిస్తున్నానని స్వర్ణలత మంత్రికి వివరించారు. తన కుమార్తె సీఏ చదువుతోందని, కుమారుడు సైన్యంలో చేరాలని లక్ష్యంగా పెట్టుకున్నాడని ఆమె తెలిపారు.
2014లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శిక్షణ పొంది, ఆయన చేతుల మీదుగానే ‘షీ ఆటో’ అందుకున్న విషయాన్ని స్వర్ణలత గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం పెట్రోల్ ఖర్చులు పోను నెలకు సుమారు ₹10,000 వరకు సంపాదిస్తున్నానని, తన ఆటోలో ఎక్కువగా మహిళా ప్రయాణికులే ఎక్కుతారని ఆమె పేర్కొన్నారు.
మహిళల సమస్యలను అర్థం చేసుకుని, వాటి పరిష్కారానికి మీరు చూపుతున్న చొరవ అభినందనీయమంటూ స్వర్ణలత మంత్రి లోకేశ్కు కృతజ్ఞతలు తెలిపారు. ‘ఆటో డ్రైవర్ సేవలో’ పథకం ద్వారా ప్రభుత్వం ₹15,000 ఆర్థిక సాయం అందించడంపై ఆమె సంతోషం వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన మంత్రి లోకేశ్, భార్యాభర్తలు ఇద్దరూ పనిచేస్తేనే కుటుంబం సజావుగా సాగుతుందని అన్నారు. రాష్ట్రంలో మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి కూటమి ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.
Read also : LongCOVID : లాంగ్ కోవిడ్ మరియు పాట్స్ మధ్య సంబంధం: తాజా అధ్యయనం ముఖ్యాంశాలు
