MithraMandali : మిత్ర మండలి రివ్యూ : కథ లేదు సరే, కనీసం నవ్వించారా? నిర్మాత చెప్పినంత కామెడీ ఉందా?

  • కథ లేని కామెడీ సినిమా 

  • విసుగు పుట్టించే సన్నివేశాలు

ఈ దీపావళి సీజన్‌లో విడుదలవుతున్న సినిమాలలో మొదటగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘మిత్ర మండలి’. పూర్తి వినోదాత్మకమైన కథాంశంతో, ఎలాంటి కథ, లాజిక్‌లు లేకుండా కేవలం ప్రేక్షకులను నవ్వించడమే లక్ష్యంగా ఈ సినిమా తెరకెక్కిందని చిత్ర యూనిట్ ప్రచారం చేసింది. నిర్మాత బన్నీవాస్ అయితే తమ సినిమాపై కావాలనే నెగెటివ్ ప్రచారం చేస్తున్నారని ఆరోపించడం, వినోదంతో పాటు ఈ వివాదం కూడా పబ్లిసిటీ ఆయుధాలుగా ‘మిత్ర మండలి’ని ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చాయి. మరి ఈ ‘మిత్ర మండలి’ ప్రేక్షకుల కడుపుబ్బ నవ్వించారా? అనేది రివ్యూలో చూద్దాం.

కథ:

సినిమా ప్రచారంలో చెప్పినట్లుగానే, ఈ సినిమాకు కథ అంటూ ఏమీ లేదని ప్రారంభంలోనే చెప్పేశారు. నిజానికి, ఇది చాలా చిన్న కథ. తుట్టేకులం అనే ఫిక్షనల్ కులానికి నాయకుడు నారాయణ (వీటీ గణేశ్). తన కులం అంటే పిచ్చి. కులబలంతో ఎమ్మెల్యే కావాలని కలలు కంటాడు. ఈ క్రమంలో, నారాయణ కూతురు స్వేచ్చ (నిహారిక) ఇంటి నుంచి పారిపోతుంది. ఈ విషయం తన కులానికి లేదా టిక్కెట్ ఇచ్చే పార్టీకి తెలిస్తే ఎమ్మెల్యే కల చెదిరిపోతుందని భయపడిన నారాయణ.. కూతురు కిడ్నాప్ అయ్యిందని ఎస్సై సాగర్.కె.చంద్ర (వెన్నెల కిషోర్) సహాయంతో వెతకడం మొదలుపెడతాడు. ఈ కిడ్నాప్ ఉదంతం వెనుక నలుగురు యువకులు – చైతన్య (ప్రియదర్శి), అభయ్ (రాగ్ మయూర్), సాత్విక్ (విష్ణు), రాజీవ్ (ప్రసాద్ బెహరా) ఉన్నారని తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? స్వేచ్చ ఎవరిని ప్రేమించింది? నారాయణ ఎమ్మెల్యే అయ్యాడా? లేదా అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.

విశ్లేషణ:

కథ లేకుండా సినిమా చేయాలనుకోవడం నిర్మాతల సాహసమే. అయితే, కథ లేకపోతే దానికి మించిన బలమైన స్క్రీన్‌ప్లే, ఆసక్తికరమైన సన్నివేశాలు ఉండాలి. ఈ సినిమాలో కథతో పాటు మిగతా అంశాలు కూడా బలంగా లేకపోవడమే ప్రధాన లోపం. సినిమా మొదలైనప్పటి నుంచి చివరి వరకు ప్రేక్షకుడి ఓపికకు పరీక్ష పెట్టినట్లు ఉంటుంది. చిన్న చిన్న కామెడీ సన్నివేశాల్లో కామెడీని వెతుక్కునే వారికి కూడా ఈ సినిమాలో వినోదం మచ్చుకు కూడా కనిపించదు. ఒక కల్పిత కులం, ఆ కులం నాయకుడు, అతని కూతురు పారిపోవడం, నలుగురు యువకులు చేసే గందరగోళం… ఇదే ఈ సినిమా కథ. ఎక్కడా కూడా ప్రేక్షకులను నిజంగా ఎంటర్‌టైన్ చేయాలనే తపన, ఆలోచన కనిపించవు.

జాతి రత్నాలు నుండి ఇటీవలి ‘లిటిల్ హార్ట్స్’ వరకు చిన్న కథలకు పూర్తి వినోదాన్ని జోడించి విజయం సాధించిన చిత్రాలు ఉన్నాయి. అయితే, వాటిలో జోడించిన కామెడీ సహజంగా, ఆమోదయోగ్యంగా ఉంది. ఆ సినిమాల స్ఫూర్తితోనే మిత్ర మండలి కథను, సన్నివేశాలను అల్లుకున్నట్లు అనిపిస్తుంది. కామెడీ సినిమా అనగానే ప్రేక్షకులు ఎలాంటి సన్నివేశాలైనా చూస్తారు, ఎలాంటి కథనైనా యాక్సెప్ట్ చేస్తారు అనే నిర్లక్ష్యంతో తీసిన సినిమాలా ఇది ఉంది. సినిమా ఆద్యంతం ప్రేక్షకులను నవ్వించడానికి బలవంతంగా ప్రయత్నం చేసినట్లు అనిపిస్తుందే తప్ప ఎక్కడా సహజమైన వినోదం పండలేదు. ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న కామెడీ నటులు చాలా మంది ఉన్నా, కథలో, సన్నివేశాల్లో బలం లేకపోవడంతో వారందరి కృషి కూడా వృథా ప్రయత్నంగానే మిగిలిపోయింది.

నటీనటుల పనితీరు:

సినిమాలో నటించిన కామెడీ ఆర్టిస్టులందరూ మంచి నటులే. వారి కామెడీ టైమింగ్ గత చిత్రాలలో బాగా అలరించింది. కానీ ఈ సినిమాలో ఏ పాత్రకు సరైన క్యారెక్టరైజేషన్ లేకపోవడంతో ఎవరి పాత్ర కూడా ఆకట్టుకోదు. మంచి కమెడియన్లుగా పేరున్న సత్య, వెన్నెల కిషోర్ పాత్రలు కూడా వినోదాన్ని పంచడంలో విఫలమయ్యాయి. నిహారిక పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. వీటీవీ గణేష్ నారాయణ పాత్రలో ఫర్వాలేదు అనిపించాడు. సాంకేతికంగా చూస్తే, నిర్మాణ విలువలు చాలా నాసిరకంగా ఉన్నాయి. కొన్ని సన్నివేశాల్లో ఆ లోపం స్పష్టంగా కనిపిస్తుంది.

ఫైనల్ తీర్పు:

సినిమా ప్రారంభంలో స్నేహితులు నలుగురు చేతిలో బ్యాట్, బాల్, వికెట్స్ ఏమీ లేకుండా.. అవి ఉన్నట్లుగా ఊహించుకుని క్రికెట్ ఆడుతుంటారు. అప్పుడు ఒక వ్యక్తి మరో వ్యక్తితో, “ఏంటీ సార్, వాళ్ల చేతిలో ఏమీ లేకుండా క్రికెట్ ఆడినట్లుగా నటిస్తున్నారు ఎందుకని?” అంటే, “వాళ్లు అంతేనండి, అలా ఆడుతూ అందరిని బకరాలను చేస్తుంటారు” అని అంటాడు. ఈ సన్నివేశం ‘మిత్ర మండలి’ సినిమా ఫలితానికి కరెక్ట్‌గా సరిపోతుంది.

కడుపుబ్బ నవ్వుకున్నానని, ఆ కామెడీ భరించలేక కడుపునొప్పి వచ్చిందని” ఈ చిత్ర ప్రెస్‌మీట్‌లో నిర్మాత బన్నీవాస్ చెప్పారు. అయితే, సినిమా చూసిన ప్రేక్షకులకు నిజంగా అప్పుడు దర్శకుడు ఈ కథ, ఈ సన్నివేశాలే చెప్పాడా? అనే సందేహం రాకమానదు. ఇలాంటి కథ లేని కథలతో, వినోదం లేని వినోదంతో ప్రేక్షకులను అలరించాలని ఆశపడటం అత్యాశే అవుతుంది. కామెడీ సినిమా అనే ట్యాగ్ చేసి, ఎలాంటి కామెడీని తెరకెక్కించినా ప్రేక్షకులు చూస్తారు అనే నిర్లక్ష్యం ఈ సినిమాలో ప్రతి ఫ్రేమ్‌లో కనిపించింది. ఫైనల్‌గా, ఈ సినిమా ‘మిత్ర మండలి’ చేసిన విఫల ప్రయత్నం అనే చెప్పాలి.

Read also : BunnyVasu : బుక్ మై షోపై బన్నీ వాసు సంచలన వ్యాఖ్యలు:రేటింగ్‌లు ఎందుకు పెడుతున్నారు

Related posts

Leave a Comment