Revanth Reddy Football Practice
Revanth Reddy Football Practice : తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ఫుట్‌బాల్ షూలు తొడిగి గ్రౌండ్‌లోనే ప్రాక్టీస్ ప్రారంభించారు. ప్రపంచ ప్రఖ్యాత ఫుట్‌బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ జట్టుతో జరగనున్న ప్రత్యేక మ్యాచ్ కోసం సీఎం సిద్ధమవుతున్నారు. ఆదివారం రాత్రి హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ గ్రౌండ్లో ఆయన సుమారు గంటపాటు శిక్షణ సెషన్లో పాల్గొన్నారు. ఈ ప్రాక్టీస్‌కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయ్యాయి.
డిసెంబర్ 13న మెస్సీ హైదరాబాద్ పర్యటనలో భాగంగా ఉప్పల్ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఒక ఫుట్‌బాల్ మ్యాచ్ ఏర్పాటు కానుంది. ఈ మ్యాచ్‌లో మెస్సీతో పాటు సీఎం రేవంత్ రెడ్డి కూడా తన టీమ్‌తో కలిసి ఆడనున్నారు. ఇందుకోసమే సీఎం ముందుగానే ప్రాక్టీస్‌ను ప్రారంభించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.
ప్రాక్టీస్ సమయంలో సీఎం రేవంత్ రెడ్డి డ్రిబ్లింగ్, పాసింగ్ వంటి మౌలిక నైపుణ్యాలను ప్రదర్శిస్తూ మంచి ఉత్సాహం కనబర్చారు. ఈ ప్రత్యేక మ్యాచ్‌లో మెస్సీ తన ప్రసిద్ధ 10వ నంబర్ జెర్సీతో బరిలోకి దిగనుండగా, సీఎం రేవంత్ రెడ్డి 9వ నంబర్ జెర్సీను తొడుక్కోనున్నట్లు సమాచారం.
ఈ ఈవెంట్ ద్వారా రాష్ట్రంలో క్రీడా ప్రోత్సాహం పెంపొందించడంతో పాటు యువతలో ఫుట్‌బాల్‌పై ఆసక్తి పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యమంత్రి స్వయంగా క్రీడల్లో పాల్గొనడం పట్ల సోషల్ మీడియాలో నెటిజన్లు “సూపర్ సీఎం” అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ మ్యాచ్ హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ క్రీడా వేదికపై మరింత ప్రతిష్ఠత కలిగిస్తుందని క్రీడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
