Will Donald Trump be removed ?
Trump : అమెరికా, ఇజ్రాయల్, ఇరాన్ ల యుద్దం తీవ్ర రూపం దాల్చి పరస్పరం భీకర దాడులకు దారి తీసింది. అమెరికా, ఇజ్రాయిల్ దేశాలు ఒక వైపు విరుచుకుపడుతుంటే, సింహం సింగిల్ గా వస్తుంది అన్నట్టుగా ఇరాన్ దేశం ఒక్కటే ఆమెరాకా, ఇజ్రాయల్ దేశాలకు కొరక రాని కొయ్యలాగా మారిపోయింది. ఆ దేశాలతో ప్రత్యక్షంగా పోరాటం చేస్తూనే, అమెరికా కి సహాయ సహకారాలు అందిస్తున్న దేశాలైన గల్ఫ్ దేశాలపై విరుచూపడి బెంబేలెత్తించింది. అంతే కాకుండా ముఖ్యంగా హోర్ముజ్ జలసంధిని నిర్భంధించి, అ జలసంధి గుండా వెళ్ళ వలసిన చమురు వగైరా రవాణా నౌకలను ఆపేసి ప్రపంచ దేశాలను ఒత్తిడిలోకి నెట్టేసింది. దాంతో అ జలసంధిని ఎలాగైనా ఓపెన్ చేయించాలని trump చేయని ప్రయత్నం లేదు. ఇరాన్ కు గడువు మీద గడువు ఇస్తూ పోతున్నాడు Trump. అయితే ఈ హోర్ముజ్ జలసంధి ఉద్రిక్తతలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఒక వైపు ఇరాన్‌తో పెరుగుతున్న ఘర్షణల మధ్య అమెరికా అధ్యక్షుడు Donald Trump చేసిన వ్యాఖ్యలు మరింత సంచలనంగా మారాయి.
ఇరాన్ నుంచి వరుసగా ఎదురుదెబ్బలు తగలడం… ఒప్పందానికి పెట్టిన గడువు ముగియడం… అయినప్పటికీ ఇరాన్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం… ఈ పరిణామాల మధ్య ట్రంప్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఆయన సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్ అయిన ట్రూత్ లో చేసిన పోస్టులో ఆయన కఠిన హెచ్చరికలు జారీ చేశారు. హోర్ముజ్ జలసంధిని వెంటనే తెరవాలని… లేకపోతే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు. ఇంతటితో ఆగకుండా… మంగళవారం నుంచి ఇరాన్‌లోని కీలక మౌలిక వసతులపై దాడులు ప్రారంభిస్తామని ప్రకటించారు. ముఖ్యంగా పవర్ ప్లాంట్లు, వంతెనలు లక్ష్యంగా ఉంటాయని పేర్కొన్నారు. “ఇది యుద్ధంలో కీలక ఘట్టం అవుతుంది” అంటూ పరిస్థితి తీవ్రతను తెలియజేశారు. ఇక అమెరికా సైనిక చర్యల గురించి మాట్లాడిన ట్రంప్… టెహ్రాన్‌లో జరిగిన దాడుల్లో పలువురు ఇరాన్ సైనికాధికారులు మరణించారని వెల్లడించారు. కూల్చివేయబడిన F-15E యుద్ధవిమానానికి చెందిన ఇద్దరు పైలట్లలో ఒకరిని తక్షణమే రక్షించామని… మరొకరిని ప్రమాదకర పర్వత ప్రాంతం నుంచి అత్యంత సాహసోపేతంగా బయటకు తీసుకొచ్చామని చెప్పారు.
ఈ ఆపరేషన్‌ను అమెరికా చరిత్రలోనే అత్యంత క్లిష్టమైన రక్షణ చర్యగా ఆయన అభివర్ణించారు. శత్రువుల గగనతలంలో ఏడు గంటలపాటు కొనసాగిన ఈ ఆపరేషన్‌లో ఒక్క అమెరికన్ సైనికుడూ ప్రాణాలు కోల్పోకపోవడం తమ మిలిటరీ సామర్థ్యానికి నిదర్శనమని అన్నారు. తీవ్ర గాయాలతో ఉన్న పైలట్ కూడా ధైర్యంగా వ్యవహరించాడని పేర్కొన్నారు. అయితే మరోవైపు… రాజకీయంగా పరిస్థితి మరింత ఉత్కంఠభరితంగా మారుతోంది. ఇరాన్‌తో యుద్ధ వాతావరణం నెలకొన్న సమయంలో… అమెరికాలో ట్రంప్ భవిష్యత్తుపై పెద్ద చర్చ మొదలైంది. ఆయనను పదవి నుంచి తొలగించే అవకాశాలపై ఊహాగానాలు ఊపందుకున్నాయి. అమెరికా రాజ్యాంగంలోని 25వ సవరణ ప్రకారం… ఒక అధ్యక్షుడు తన బాధ్యతలను సరిగా నిర్వహించలేకపోతున్నారని భావిస్తే… ఉపాధ్యక్షుడు మరియు కేబినెట్ మెజారిటీ సభ్యులు కలిసి ఆయనను పదవి నుంచి తొలగించే అవకాశం ఉంది. ప్రస్తుతం ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు దేశ భద్రతకు ముప్పు కలిగిస్తున్నాయంటూ ప్రతిపక్ష డెమొక్రాట్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఆశ్చర్యకరంగా… ఆయన సొంత పార్టీకి చెందిన కొందరు రిపబ్లికన్ నేతలు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ అంశంపై ఒక చట్టసభ్యుడు అధికారిక ప్రతిపాదన తీసుకొచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉంటే… ప్రిడిక్షన్ మార్కెట్లలో కూడా ఆసక్తికర మార్పులు కనిపిస్తున్నాయి. Kalshi వంటి ప్లాట్‌ఫామ్‌లలో ట్రంప్ పదవి కోల్పోయే అవకాశాలపై పందాలు వేస్తున్నారు. గత నెలలో కేవలం 28 శాతం మంది మాత్రమే ఆయన తొలగింపును ఊహించగా… ఇప్పుడు ఆ సంఖ్య 35 శాతానికి పెరిగింది. అంటే… ఆయన పదవీకాలం పూర్తయ్యేలోపే పరిస్థితులు మారే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇరాన్‌తో పెరుగుతున్న ఘర్షణలు, మిత్రదేశాలతో సరైన సమన్వయం లేకుండా తీసుకుంటున్న నిర్ణయాలు… ఇవన్నీ కలిపి ఈ పరిస్థితికి దారితీసినట్లు అంతర్జాతీయ వర్గాలు చెబుతున్నాయి. శాంతిని కాపాడాల్సిన నాయకుడు… యుద్ధోన్మాదంతో వ్యవహరిస్తున్నాడనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు ఎప్పుడూ చూడని విధంగా… సొంత వ్యవస్థలోనే అధ్యక్షుడిపై వ్యతిరేక స్వరం పెరుగుతుండటం గమనార్హం.
