A place where you need to follow for what happening in world cup

HOT NEWS

సముద్రంలో చిన్నారి గల్లంతు

0

సింగరాయకొండ: కొద్దిరోజుల్లో ఆ ఇంట శుభకార్యం జరగాల్సి ఉంది.. ఇప్పటికే బంధువులంతా చేరుకుంటున్నారు. అంతా సందడిగా ఉంది. సమీపంలో ఉన్న సముద్ర తీరానికి విహారం కోసం వారంతా వచ్చారు. ఇంతలోనే ఘోరం జరిగిపోయింది. స్నానాలు చేస్తున్న సమయంలో రాకాసి అలల ఉద్ధృతికి ఇద్దరు చిన్నారులు గల్లంతవగా వారిలో ఒకరిని మత్స్యకారులు రక్షించగలిగారు. మరొకరి ఆచూకీ ఇప్పటికీ కానరాలేదు. ఈ ఘటన పాకల తీరం వద్ద చోటుచేసుకుంది.ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం సోమరాజుపల్లి పరిధి ఫకీర్‌పాలెంలో షేక్‌ అబ్దుల్‌ హమీద్‌ దంపతులు నివసిస్తున్నారు. పదేళ్ల క్రితం ఉత్తరప్రదేశ్‌ నుంచి ఇక్కడకు వచ్చిన వీరికి అయిదుగురు కుమార్తెలు, ఒక కుమారుడు సంతానం.

స్థానిక మసీదులో హమీద్‌ ప్రార్థనలు నిర్వహిస్తుంటారు. ఫిబ్రవరి మొదటివారంలో వీరి నూతన గృహ ప్రవేశ కార్యక్రమం ఉండటంతో బంధువులు వచ్చారు. ఆదివారం హమీద్‌ కుమారుడు అబ్దుల్‌ హమీద్‌ సిద్ధిఖీ(15), కుమార్తె అమల్‌, మరికొందరు బంధువులు కలిసి మొత్తం ఆరుగురు పాకల తీరం వద్దకు వచ్చారు. అంతా స్నానాలు చేస్తున్న వేళ రాకాసి వలలు విరుచుకుపడటంతో అన్నాచెల్లెలిద్దరూ కొట్టుకుపోయారు. బంధువులు పెద్దగా కేకలు వేయడంతో సమీపంలో ఉన్న మత్స్యకారులు అమల్‌ను రక్షించి ఒడ్డుకు చేర్చారు. సిద్ధిఖీ మాత్రం గల్లంతయ్యాడు. అపస్మారక స్ధితికి చేరుకున్న అమల్‌ను 108లో ఒంగోలు రిమ్స్‌కు.. అక్కడినుంచి మరో ప్రైవేట్‌ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉంది.

Leave A Reply

Your email address will not be published.