A place where you need to follow for what happening in world cup

మరో కొత్త స్కీమ్ కు కసరత్తులు

0

హైదరాబాద్, ఫిబ్రవరి 8,
రాష్ట్ర పరిధి దాటి జాతీయ స్థాయికి పార్టీని విస్తరింపజేస్తున్న కేసీఆర్ ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ అనే నినాదాన్ని వల్లిస్తున్నారు.ఇలాంటి పరిస్థితుల్లో అబ్బురపడే స్కీమ్ రైతాంగానికి, వ్యవసాయానికి సంబంధించినదే అయి ఉంటుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సరిగ్గా ఎన్నికల సమయంలో పథకాన్ని ప్రకటించాలన్న ఆలోచన ఉండొచ్చని, అందుకే తాజా బడ్జెట్‌లో దీని ప్రస్తావన లేదనే సంకేతాలు పార్టీ వర్గాల నుంచి వ్యక్తమయ్యాయి. ఇందుకు ఉదాహరణగా 2018 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రకటించిన రైతుబంధు స్కీమ్‌ను ప్రస్తావిస్తున్నారు. ఈ స్కీమ్‌ను బడ్జెట్‌లో పెట్టలేదని, అసెంబ్లీని రద్దు చేసే సందర్భంగా సీఎం ఆకస్మికంగా ప్రకటించారని ఉదహరించారు. ఈసారి కూడా డిసెంబరులో ఎన్నికలు జరగనున్నందున దానికి కొన్ని వారాల ముందు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించేలా షాకింగ్ స్కీమ్ ప్రకటించడానికే.. ఇప్పుడు బడ్జెట్‌లో ఎలాంటి కొత్త పథకాలను, హామీలను, వరాలను ఇవ్వలేదనే అభిప్రాయమూ వ్యక్తమవుతున్నది.

సస్పెన్స్ గా ఉంచి సంచలనంగా ప్రకటించాలన్న ఉద్దేశంతోనే బడ్జెట్‌లో పెట్టలేదనే వాదన కూడా వినిపిస్తున్నది.మొదటి టర్ములో కేసీఆర్.. రైతులందరికీ ఉచితంగా యూరియా, ఎరువులు తదితరాలను ఇవ్వనున్నట్టు ప్రకటించారు. కానీ రెండో టర్ము సమయానికి దాన్ని ప్రస్తావించలేదు. ఇప్పటికీ అది అమలుకు నోచుకోని హామీగానే ఉండిపోయింది. ఈ స్కీమ్ కారణంగా ప్రభుత్వానికి పెద్దగా ఆర్థిక భారమేమీ పడదని, 25 లక్షల టన్నులను ఉచితంగా ఇవ్వడానికి ఇబ్బంది కూడా ఏమీ లేదని పేర్కొన్నారు. బీఆర్ఎస్‌తో ఇతర రాష్ట్రాల్లోకి ఎంట్రీ కావాలనుకుంటున్న కేసీఆర్.. రైతులకు పింఛను ఇవ్వడంపై కసరత్తు చేసినట్టు పార్టీ నేతల ద్వారా సమాచారం లీక్ అయింది. తెలంగాణలో దీన్ని అమలు చేసి అన్ని రాష్ట్రాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలనే ఆలోచనతో ఆయన ఉన్నట్టు తెలిసింది.

ఇప్పటికే రైతుల సంక్షేమం కోసం రైతుబంధు, రైతుబీమా, నీటి తీరువా రద్దు, 24 గంటలూ ఉచితంగా వ్యవసాయ విద్యుత్ తదితరాలను తెలంగాణ అమలు చేస్తున్నదని, ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉన్నదని పలు సందర్భాల్లో ముఖ్యమంత్రే కామెంట్ చేశారు. సరిగ్గా ఎన్నికల సమయానికి రైతులకు పింఛన్ లాంటి పథకాన్ని ప్రకటించి వెంటనే అమల్లోకి తెచ్చే ఆలోచన ఉన్నట్టు చర్చలు జరుగుతున్నాయి.ఇతర రాష్ట్రాల్లో విస్తృతంగా ప్రచారం చేసుకుని సంస్థాగతంగా బలపడడానికి, ఇక్కడి ఎన్నికల్లో లబ్ధి పొందడానికి బీఆర్ఎస్‌కు ఇలాంటి షాకింగ్ స్కీమ్ ఉపయోగపడుతుందనేది ఆ పార్టీ భావన. ఇప్పుడు బడ్జెట్‌లో లేదని నిరాశపడిన ప్రజలే ఆ స్కీమ్‌ను ప్రకటించిన తర్వాత మనసు మార్చుకుంటారన్నది కూడా పార్టీ వర్గాలు బలంగా నమ్ముతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా దాదాపు ఎనిమిది నెలల సమయం ఉన్నందున బడ్జెట్‌లో పెడితే అప్పటి వరకు ఇది పాత స్కీమ్ అయిపోతుందని, ప్రజలు మర్చిపోతారనే వాదనలూ వినిపిస్తున్నాయి.

ఈ స్కీమ్ ద్వారా ఆశించిన లక్ష్యం, రాజకీయ ప్రయోజనం నెరవేరేందుకు.. ఎన్నికల సమయమే సరైనదిగా ఉంటుందనే అభిప్రాయమూ లేకపోలేదు. ఆ షాకింగ్ స్కీమ్ ఏమిటనేది ఇప్పటికి పార్టీ వర్గాల్లోనూ సస్పెన్స్‌గానే ఉన్నది. రాష్ట్రంలో రాజకీయపరంగా ఉన్న ముక్కోణపు పోటీలో బీఆర్ఎస్‌కు అనుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ.. గతం మాదిరి భారీ విజయాన్ని సొంత చేసుకుంటే జాతీయ పార్టీగా ఖ్యాతి దక్కుతుందని పార్టీ విశ్వసిస్తున్నది. అలాంటి విజయం కోసం ఎన్నికల సందర్భంగానే సరికొత్త స్కీమ్‌ను ప్రకటించడానికి పార్టీ ఆసక్తి చూపుతున్నట్టు సమాచారం. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయానికి రైతుబంధు కారణమైనట్లుగానే.. ఈ సారీ అదే ఫార్ములాను బీఆర్ఎస్ ఫాలో అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Leave A Reply

Your email address will not be published.