- అభ్యర్థుల ప్రకటనతో పలు నియోజకవర్గాల్లో నిరసనలు
- అభ్యర్థులను మార్చాల్సిందేనంటూ రోడ్డెక్కుతున్న నేతలు
- ఎమ్మెల్యేలు, ఆశావహుల మధ్య తారాస్థాయిలో విభేదాలు
- అసంతృప్త నేతలకు అధిష్టానం బుజ్జగింపులు
కారు కంట్రోల్ తప్పుతోంది. పలు నియోజకవర్గాల్లో ఎంపిక చేసిన అభ్యర్థుల జాబితాపై చిచ్చు రాజుకుంది. పలువురు అభ్యర్థులను మార్చాల్సిందేనంటూ బీఆర్ఎస్నేతలు రోడ్డెక్కి నిరసనలు చేపడుతున్నారు. పార్టీ అధిష్టానానికి నేరుగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దీంతో ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యేలు , ఆశావహుల మధ్య ఆగ్రహ జ్వాలలు ఎగిసిపడుతున్నాయి.
పార్టీ మారనున్న నేతలు..?
కార్యకర్తల నిరసనలతో పలు అసెంబ్లీ సెగ్మెంట్లలో గంగదగోళ పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ ఎమ్మెల్సీ సంతోష్ కుమార్, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం బుధవారం అధికార పార్టీకి గుడ్ బై చెప్పారు. వారు త్వరలో కాంగ్రెస్ గూటికి వెళ్లనున్నారని తెలుస్తోంది. అలాగే మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు కూడా బీఆర్ఎస్ కు రాజీనామా చేయనున్నారని ప్రచారం సాగుతోంది. మంత్రి హరీశ్‌రావుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన మల్కాజ్గిరి నియోజకవర్గం ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నారన్న వార్తలు వస్తున్నాయి. హరీశ్‌పై వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో పార్టీ అధిష్టానం మైనంపల్లిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. కాగా అందుకు ముందుగానే బీఆర్ఎస్ కు హన్మంతరావు రాజీనామా చేయాలనే యోచనలో ఉన్నట్లుగా సమాచారం. అలాగే ఖానాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే రేఖానాయక్ కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం దరఖాస్తు చేసుకుందనే వార్తలు వస్తున్నాయి. ఆమెకు తిరిగి టికెట్ ను కేటాయించకపోవడంతో తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. త్వరలోనే కారుకు టాటా చెప్పేసి హస్తం గూటికి చేరుకోవాలని రేఖానాయక్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.
అసంతృప్తులకు బుజ్జగింపులు..
ఒకేసారి 115 మందితో అభ్యర్థులను సీఎం ప్రకటించడంతో ఆశావహుల్లో అసంతృప్తులు పెల్లుబుకుతున్నాయి. దీంతో పలు నియోజకవర్గాల్లో ఆశావహులకు చెందిన అనుచరులు ఆందోళనలు చేస్తున్నారు. కోదాడ నియోజకవర్గాలని చెందిన పలువురు స్థానిక ప్రజాప్రతినిధులంతా సంతకాలు చేసి సీఎం కేసీఆర్ ఒక లేఖ పంపారు. కోదాడ సిట్టింగ్ అభ్యర్థి బొల్లం మల్లయ్య యాదవ్ ను మార్చకపోతే మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమంటూ బహిరంగంగానే హెచ్చరికలు జారీ చేశారు. స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే రాజయ్యకు అవకాశం దక్కకపోవడంతో ఆయనను బుజ్జిగించే బాధ్యతను పార్టీ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ కు అప్పగించింది. దీంతో ఆయన రాజయ్య ఇంటికి వెళ్లగా రాజయ్య విముఖతను చూపినట్లు తెలుస్తోంది. దీంతో రాజయ్యను కలువకుండానే పల్లా వెనక్కి వచ్చారు. అలాగే మాజీ మంత్రి తుమ్మలను బుజ్జగించేందుకు పార్టీ లోక్ సభా పక్ష నాయకుడు నామా నాగేశ్వర్ రావును రంగంలోకి దింపింది. దీంతో తుమ్మల ఇంటికి వెళ్లిన నామా గంటకుపైగా ఆయనతో చర్చించారు.
కాగా తుమ్మలకు కాంగ్రెస్, బీజేపీ నుంచి ఆహ్వానాలు వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. కరీంనగర్ కు చెందిన మాజీ ఎమ్మెల్సీ సంతోష్ కుమార్ బీఆర్ఎస్ కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మంత్రి గంగుల వైఖరితోనే తాను బీఆర్ఎస్ కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కూడా బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పనున్నట్లు ప్రకటించారు. నకిరేకల్‌లో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసిన వీరేశం పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. ఆయనతోపాటు జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ లు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. త్వరలోనే వీరేశం కాంగ్రెస్ లో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారని సమాచారం.