Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

సీక్రెట్​ఫ్రెండ్స్!

0
  • హస్తానికి బీఆర్ఎస్ ​రెబల్స్ రహస్య మద్దతు?
  • టిక్కెట్​ఆశించి భంగపడ్డ ఆశావహులు
  • అధిష్టానాన్ని ఎదిరించలేక, సొంతంగా పోటీ చేయలేక సతమతం
  • ఉత్కంఠ రేపుతోన్న అసంతృప్తుల తీరు
  • తెరచాటు రాజకీయాలకు సిద్ధమవుతున్న ద్వితీయ శ్రేణి లీడర్లు
  • ఇప్పటికే అనుచరులతో సమావేశాలు.. నిర్ణయాలు
  • అసంతృప్తులను బుజ్జగిస్తున్న సీఎం కేసీఆర్
  • అయినా అలక వీడని నేతలు

బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే టిక్కెట్లు ఆశించి భంగపడ్డ అసంతృప్త నేతల తీరు సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలతో విభేదించి సొంత కుంపటి ఏర్పాటు చేసుకున్న ద్వితీయ శ్రేణి నాయకులు.. ఏకంగా పార్టీపై తిరుగుబాటు బావుటా ఎగరేసేందుకు సిద్ధమవుతున్నారు. అలాగే బీఆర్ఎస్​అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కల్పించని అధినేత కేసీఆర్ పై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆశావాహులు.. వచ్చే ఎన్నికల్లో ఎలాంటి పాత్ర పోషిస్తారోనని పార్టీ కార్యకర్తలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అధిష్టానం నిర్ణయించిన అభ్యర్థికి మద్దతు తెలుపుతారా.? లేక పార్టీ మారుతారా..? లేక వచ్చే ఎన్నికల్లో పార్టీ ప్రకటించిన అభ్యర్థికి వ్యతిరేకంగా పని చేస్తారా.? అనే చర్చ ప్రస్తుతం రాష్ట్రంలో హాట్ టాపిక్​ గా మారింది.

సీఎం కేసీఆర్​ఒకేసారి 115 మంది బీఆర్ఎస్​అభ్యర్థులను ప్రకటించడంతో.. పలు నియోజకవర్గాల్లో అసంతృప్తులు అధినేతకు వ్యతిరేకంగా గళం పెంచుతున్నారు. కొన్నేళ్లుగా ప్రజల్లో విస్తృతంగా పర్యటించిన అసంతృప్తులు కొందరు రెబల్స్ గా పోటీకి సిద్ధమవుతుంటే.. ఇంకొందరు స్వతంత్ర్య అభ్యర్థులుగా బరిలోకి దిగాలని నిర్ణయం తీసుకున్నారు. కేవలం అధికార పార్టీ బీ ఫాంతోనే బరిలో దిగాలని భావించి, టిక్కెట్​వరించక భంగపడి వచ్చే ఎన్నికల్లో పోటీ ఆలోచనను విరమించుకున్న కొందరు నేతలు.. ఏకంగా తెరచాటు రాజకీయాలకు సిద్ధమవుతున్నారు. ఆయా నియోజకవర్గాల్లో అధికార పార్టీని ఓడించే కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులకు మద్దతు తెలపాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఇప్పటికే అసంతృప్తులపై దృష్టిసారించిన సీఎం కేసీఆర్​ఆయా జిల్లాలకు చెందిన సీనియర్లను రంగంలో దింపి.. వారిని బుజ్జగించే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. సీనియర్ల బుజ్జగింపులకు కొందరు ససేమిరా అనడంతో బీఆర్ఎస్​లో గందరగోళ పరిస్థితి నెలకొన్నది.

నల్లగొండ ఎమ్మెల్యేతో విభేదాలు..
వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా తనకే టిక్కెట్​వస్తుందనే ఆశతో నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డితో విభేదించిన పట్టణంలోని 8వ వార్డు కౌన్సిలర్​ పిల్లి రామరాజు యాదవ్ సొంత కుంపటి ఏర్పాటు చేసుకున్నారు. ఓ ట్రస్టును ఏర్పాటు చేసిన ఆయన ప్రజాసేవ పేరిట సుమారు రూ.20లక్షలు ఖర్చు పెట్టారు. హైదరాబాద్​లోని తన సామాజిక వర్గానికి చెందిన ఓ సీనియర్ నాయకుడి ద్వారా టిక్కెట్​కోసం విశ్వప్రయత్నాలు చేసిన ఆయన.. చివరకు బీసీ కార్డునూ ప్రదర్శించారు. అయినా ఆయనకు టిక్కెట్టు వరించలేదు. బీఆర్ఎస్​అధినేత కేసీఆర్ సిట్టింగ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి వైపే మొగ్గు చూపారు. దీంతో అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న రామరాజు వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా బరిలో దిగాలని నిర్ణయం తీసుకున్నారు.

స్వతంత్ర అభ్యర్థిగా దిగాలని యోచన?
టిక్కెట్​దక్కకపోవడంతో రామరాజు యాదవ్ బీసీ మద్దతు కూడగట్టి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగే యోచనలో ఉన్నట్లు సమాచారం. మరోవైపు ఎన్నికలు భారీ ఖర్చుతో కూడుకుని ఉండడం, అధిష్టానం నుంచి ఒత్తిడి వచ్చే అవకాశాలున్న నేపథ్యంలో కాంగ్రెస్​ నుంచి బరిలో దిగనున్న భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఆయన రహస్య మద్దతు తెలిపే యోచనలో ఉన్నట్లు కూడా ప్రచారం కూడా జరుగుతోంది. ఇదే పరిస్థితి రాష్ట్రంలో పలు నియోజకవర్గాల్లో నెలకొన్నది. టిక్కెట్టు రాక భంగపడ్డ అసంతృప్తుల్లో చాలా మంది అధిష్టానంతో ఢీకొనే సత్తాలేక, తిరుగుబావుటా ఎగురవేయలేక.. సొంత పార్టీ అభ్యర్థి ఓటమికి పరోక్ష మద్దతు తెలపాలని భావిస్తున్నట్లు సమాచారం.

మొదలైందిలా..!
పనితీరు బాగాలేని, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సిట్టింగ్​ఎమ్మెల్యేకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్​రాదనే ప్రచారం జరగడం, పలువురు ఎమ్మెల్యేలను ఏకంగా సీఎం కేసీఆర్ గతంలో హెచ్చరించడం ఆయా సెగ్మెంట్ల నుంచి బరిలో దిగాలనే ఆలోచనతో ఉన్న బీఆర్ఎస్​అభ్యర్థుల్లో ఆశలు చిగురించాయి. దీంతో కొన్నిచోట్ల ఎమ్మెల్యేలతో అంతర్గత విభేదాలు ఉన్న నేతలు ఏకంగా సిట్టింగ్ లపై తిరుగుబావుటా ఎగురవేశారు. తమ వర్గంతో వేరుపడి పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలను వేర్వేరుగా నిర్వహిస్తూ వస్తున్నారు. ఇటు సిట్టింగ్ లతో ఎలాంటి విభేదాలు లేక కేవలం ఎమ్మెల్యే కావాలనే పట్టుదలతో ఉన్న ఇంకొందరు సైతం వేర్వేరు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. వీరంతా టిక్కెట్ల కోసం తమతమ స్థాయుల్లో ప్రయత్నాలు మొదలుపెట్టారు. చివరకు టిక్కెట్లు రాక భంగపడ్డారు. ఇన్నాళ్లూ ఈసారి ఎమ్మెల్యే టిక్కెట్​తమకే వస్తుందంటూ కార్యకర్తలు, అనుచరులకు హామీ ఇచ్చిన అసంతృప్తులు.. ఇప్పుడు డైలామాలో పడ్డారు. కాగా కొన్ని చోట్ల అసంతృప్తులను బుజ్జగించడానికి సీఎం కేసీఆర్​స్వయంగా రంగంలోకి దిగినా కొందరు లీడర్లు అలక వీడనట్లు సమాచారం.

ఆందోళనలో క్యాడర్..
వచ్చే ఎన్నికల్లో తమ నాయకుడికే టిక్కెట్​ఖరారవుతుందని నమ్మి సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా పని చేసిన అసంతృప్త నేతల అనుచరుల్లోనూ ఆందోళన మొదలైంది. మళ్లీ సిట్టింగ్ కే ఎమ్మెల్యేలకే టిక్కెట్​ఇచ్చిన అధిష్టానం నిర్ణయానికి వ్యతిరేకంగా పని చేయడం ఇష్టం లేని కొందరు తిరిగి సొంతగూటికి చేరేందుకు దారులు వెతుక్కుంటున్నారు. ఇన్నాళ్లూ నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డికి వ్యతిరేకంగా పని చేసిన క్యాడర్.. మళ్లీ ఆయన వర్గంలో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నట్లు తెలిసింది. ఇప్పటికే వారంతా ఎమ్మెల్యే వద్దకు రాయబారాలు మొదలుపెట్టడం హాట్ టాపిక్​ గా మారింది. కొత్తగూడెం, మంచిర్యాల, అలంపూర్ ఇతర సెగ్మెంట్లలో విభేదిత నేతల అనుచరులు సైతం మళ్లీ తమ ఎమ్మెల్యేల గూటికి చేరాలని భావిస్తున్నట్లు సమాచారం. అయితే రానున్న రోజుల్లో అసంతృప్త బీఆర్ఎస్​నేతలు ఎమ్మెల్యే పోటీ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు..? బీఆర్​ఎస్​ కు వ్యతిరేకంగా పని చేసేందుకు గులాబీ కార్యకర్తలు సిద్ధపడతారా..? భవిష్యత్​ల్లో ఆయా నియోజకవర్గాల్లో ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie