- సీఎం కేసీఆర్‌ను తాకిన బీసీ సెగ
- తమవాళ్లకు టిక్కెట్లు ఇవ్వాలని మున్నూరు, మరాఠీల పట్టు
- 11 సీట్లు కేటాయించాలని ముఖ్యమంత్రికి లేఖ
కాంగ్రెస్‌లో కలవరం రేపుతోన్న బీసీ గళం.. తాజాగా అధికార పార్టీలోనూ వినిపిస్తోంది. బీఆర్ఎస్అధినేత కేసీఆర్ ఇటీవల ప్రకటించిన 115 ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా అధికార పార్టీలో అసంతృప్తికి ఆజ్యం పోసిన విషయం తెలిసిందే. ఇప్పటికే అసంతృప్త నేతలను బుజ్జగించడం సవాలుగా మారిన కేసీఆర్‌కు కొత్త సమస్య వచ్చిపడింది. వచ్చే ఎన్నికల్లో మున్నూరు కులానికి 11 స్థానాలు కేటాయించాలంటూ ఆ వర్గం పట్టుబడుతోంది. ఈ మేరకు ఆదివారం హైదరాబాద్‌లో సమావేశమైన ఆ కుల నాయకులు వేములవాడ నుంచి డాక్టర్ గోలి మోహన్ కు టిక్కెట్ఇవ్వాలంటూ కేసీఆర్‌ను డిమాండ్‌చేశారు. ఉప్పల్ టిక్కెట్టు బొంతు రామ్మోహన్ కు, నిజామాబాద్ లో ఆకుల లలితకు, చిరుముల రాకేశ్‌కు పెద్దపల్లి, ఆర్వీ మహేందర్ కు గోషామహల్, మున్నూరు రవికి మహబూబ్ నగర్, శంబీపూర్ రాజుకు కుత్బుల్లాపూర్ టిక్కెట్టు ఇవ్వాలని తీర్మానించారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది.
ఇప్పటి వరకు ఆయా స్థానాల నుంచి తమకే టిక్కెట్టు వస్తుందనే ఆశతో ఎదురుచూసిన ఆయా నేతలు.. బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన తర్వాత తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనే పట్టుదలతో ఉన్న నేతలు టిక్కెట్ల కోసం కుల నాయకత్వంతో అధిష్టానంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా మరాఠీలు సైతం గోషామహల్టిక్కెట్టు ఆశిస్తున్నారు. ఈ మేరకు మహారాష్ట్రలో కేసీఆర్ కు మరాఠీల మద్దతు కావాలంటే ఇక్కడ గోషామహల్టిక్కెట్టు తమకు కేటాయించాల్సిందేనని ఆల్టీమేటం జారీ చేయడం చర్చనీయాంశమైంది. కాగా మున్నూరు కులస్తులకు టిక్కెట్ల వ్యవహారంపై గులాబీ అధినేత కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.