A place where you need to follow for what happening in world cup

తెలంగాణ మున్సిపాల్టీల్లో అసమ్మతులు

0

హైదరాబాద్, ఫిబ్రవరి 6,
తెలంగాణలో ఒక మున్సిపాలిటీ నుంచి మరో మున్సిపాలిటీకి పాకుతున్న రాజకీయ అలజడి. పదవులపై ఆశ కలుగుతుందో లేక ఎమ్మెల్యేలు, మంత్రులపై ఉన్న ఆగ్రహమో కానీ.. మున్సిపల్‌ కార్పొరేషన్‌ స్థాయి నుంచి నగర పంచాయితీల వరకు ఒకే సీన్‌ కనిపిస్తోంది. మొదట్లో రాజధానికి ఆనుకుని ఉన్న కొన్ని పురపాలికల్లో బీజంపడ్డ అసమ్మతి ఇప్పుడు అన్ని జిల్లాల్లోనూ అధికాపార్టీలో కంపనాలు తీసుకొస్తోంది. అధిష్ఠానం వారిస్తున్నా.. ఎమ్మెల్యేలు బుజ్జగిస్తున్నా స్థానిక సంస్థల్లోని ప్రజాప్రతినిధులు వినే పరిస్థితి కనిపించడం లేదు. పార్టీ మాటను కూడా లెక్క చేయకుండా ఛైర్మన్లు, మేయర్లు, ఛైర్‌పర్సన్లపై సొంత పార్టీ ప్రజాప్రతినిధులే అవిశ్వాసం ప్రకటిస్తున్నారు. అధికారులకు నోటీసులు ఇచ్చేస్తున్నారు కూడా.కొన్ని మున్సిపాలిటీలలో మున్సిపల్‌ ఛైర్మన్లు, మేయర్లను తొలగించేందుకు అధికారపార్టీ కౌన్సిలర్లు, కార్పొరేటర్లకు విపక్షపార్టీ సభ్యులు తోడు కావడం కలకలం రేపుతోంది.

ఏకంగా క్యాంపు రాజకీయాలు నడిపేస్తున్నారు. అవసరమైతే పక్క రాష్ట్రాల్లో క్యాంపులు వేయడానికి కూడా ఏర్పాటు చేసుకోవడం ఆశ్చర్యపరుస్తోంది. ప్రస్తుతం ఉన్న మున్సిపల్‌ ఛైర్మన్లను దింపేస్తే ఆ సీటులో కూర్చోవాలని చూస్తున్న నాయకులు వేగంగా పావులు కదుపుతున్నారు. తమతో కలిసి వచ్చేది ఎంత మందో రూఢీ చేసుకున్న తర్వాత క్షణం ఆలస్యం చేయడం లేదు. నగర శివారుల్లోని ఫాం హౌస్‌లు లేదా మామిడి తోటల్లో రహస్య సమావేశాలు నిర్వహించి స్థానిక ఎమ్మెల్యేలకు గుబులు పుట్టిస్తున్నారు. కొన్ని జిల్లాల్లో మంత్రుల మాటలను కూడా కార్పొరేటర్లు, కౌన్సిలర్లు లెక్క చేయడం లేదు.ఈ సమస్యకు మున్సిపల్‌ చట్టంలో ఉన్న కొన్ని నిబంధనలు కూడా కారణంగా అధికారపార్టీ నేతలు భావిస్తున్నారు. ఇప్పుడున్న చట్టం ప్రకారం మున్సిపల్‌ ఛైర్మన్లుగా పదవి చేపట్టిన వారిపై మూడేళ్లు దాటిన తర్వాత అవిశ్వాసం ప్రకటించొచ్చు.

ప్రస్తుతం రాష్ట్రంలో చాలా పురపాలిక సంఘాల్లో మూడేళ్ల పదవికాలం పూర్తయిన ఛైర్మన్లే అధికం. ఈ సమస్యను పసిగట్టిన అధికారపార్టీ మున్సిపల్‌ చట్టానికి సవరణలు తీసుకొచ్చింది. నాలుగేళ్ల వరకు మున్సిపల్ ఛైర్మన్లు, మేయర్లపై అవిశ్వాసం పెట్టకుండా సవరణలు చేసింది. గవర్నర్‌ ఆమోదం కోసం రాజ్‌భవన్‌లో పెండింగ్‌లో ఉన్న బిల్లుల్లో ఈ చట్ట సవరణ కూడా ఉందట. ఆ బిల్లుకు గవర్నర్‌ ఆమోద ముద్ర వేస్తే మున్సిపల్‌ ఛైర్మన్లకు మరో ఏడాది వెసులుబాటు దక్కేది. కానీ.. రాజ్‌భవన్‌లో బిల్లు పెండింగ్‌లో ఉండటంతో.. మున్సిపాలిటీల్లో అలజడి రేపుతున్నారు అధికారపార్టీలోని కొందరు నేతలు. ఈ ఏడాదిలోనే అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఈ సమయంలో నియోజకవర్గాల్లోని మున్సిపాలిటీల్లో తలెత్తుతున్న సమస్యలు ఎమ్మెల్యేలను ఉలిక్కి పడేలా చేస్తున్నాయి. కరవమంటే కప్పకు విడవమంటే పాముకు కోపం అన్నట్టుగా ఎమ్మెల్యే పరిస్థితి ఉంది. వీలైనంత త్వరగా అసమ్మతికి చెక్‌ పెట్టాలని చూస్తున్నారట. అధిష్ఠానం కూడా ఇదే ఆలోచనలో ఉంది. కానీ.. పదవులు ఆశిస్తున్న నాయకులు.. ఎమ్మెల్యేలపై అసంతృప్తితో ఉన్నవారు మాత్రం ఎంత వరకు దారిలోకి వస్తారన్నది ప్రశ్నే.

Leave A Reply

Your email address will not be published.