- జిల్లాలో తొలిసారిగా గురువారం నుంచి ‘పది’ మూల్యాంకనం
- జిల్లాకు నూతనంగా మంజూరైన మూల్యాంకన కేంద్రం
- ఇప్పటికే జిల్లాకు చేరిన సమాధాన పత్రాలు
- మూల్యంకనంలో పాల్గొననున్న నాగర్ కర్నూలు, వనపర్తి జిల్లాలకు చెందిన 500 మంది సబ్జెక్ట్ ఉపాధ్యాయులు
ముద్ర ప్రతినిధి: నాగర్ కర్నూల్,వనపర్తి జిల్లా లోపదో తరగతి ప్రధాన పరీక్షలు మంగళవారం ముగిశాయి. కాగా, ప్రధాన పరీక్షలు ముగియడం, ఇప్పటికే సమాధాన పత్రాలు చేరడంతో మూల్యాంకనానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. నాగర్ కర్నూలు జిల్లాలో ఈ ఏడాది నూతనంగా మూల్యాంకన కేంద్రాన్ని రాష్ట్ర విద్యాశాఖ ఏర్పాటు చేసింది.పదో తరగతి సమాధాన పత్రాల మూల్యాంకనం ఈ నెల 13వ తేదీ నుంచి 21వ తేదీ వరకు కొనసాగనుంది. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని లిటిల్ ఫ్లవర్ హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన మూల్యాంకన కేంద్రానికి ఇప్పటికే సమాధాన పత్రాలు చేరాయి.మొత్తం 1లక్షల 31వేల 736 సమాధాన పత్రాలను మూల్యాంకనం చేయనున్నారు.
వీటిని నిఘా నేత్రాలు, పోలీసుల భద్రత నడుమ క్యాంప్ అధికారులు భద్రపరిచారు. మూల్యాంకనం నిర్వహించే నాగర్ కర్నూలు, వనపర్తి జిల్లాలకు చెందిన సబ్జెక్ట్ నిపుణుల జాబితా రూపొందించిన జిల్లా విద్యాశాఖ అధికారులు వారికి ఆర్డర్ కాపీలను సైతం పంపించారు.
జిల్లాల్లో ఏర్పాటు చేసిన కేంద్రాలో 500మంది ఉపాధ్యాయులు సమాధాన పత్రాలను మూల్యాంకనం చేయనున్నారు. మూల్యాంకనానికి వచ్చే ఉపాధ్యాయులు సెల్‌ఫోన్ తీసుకురావద్దని క్యాంప్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అంతేగాక మూల్యంకన సమాచారం బయటికి వెళ్లకుండా ఉండేలా అధికారులు కట్టుదిట్ట చర్యలు తీసుకుంటున్నారు.
మూల్యాంకనం ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు నిర్వహించనున్నారు. ప్రతీ ఉపాధ్యాయుడు రోజుకు 40 సమాధాన పత్రాల మూల్యాంకనం చేయాల్సి ఉంటుంది. అందుకు ఒక్కో పత్రానికి ప్రభుత్వం రూ.10 చెల్లించనుంది. జిల్లాలో 366మంది ఎగ్జామినర్లు, అసిస్టెంట్ ఎగ్జామినర్లు మూల్యాంకనం విధుల్లో పాల్గొనున్నారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స ఉపాధ్యాయులు ఈనెల 13న ఉదయం 9గంటలకు, సోషల్ సబ్జెక్టు ఉపాధ్యాయులు 14వ తేదీన ఉదయం 9గంటలకు మూల్యాంకన కేంద్రంలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఉత్తర్వులు అందుకున్న ఉపాధ్యాయులు తప్పకుండా విధుల హాజరు కావాల్సి ఉంటుందని, ఇందులో ఎలాంటి మినహాయింపు లేదని ఉమ్మడి జిల్లా డీఈవోలు ఆదేశాలు జారీ చేశారు.ఎవరైనా విధులకు గైర్హాజరైతే సీసీఏ నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
నిఘా నడుమ మూల్యాంకనం, సెల్ ఫోన్ కు అనుమతి లేదు
మూల్యాకనం కేంద్రంలో ఎలాంటి పొరపాట్లు లేకుండా నిఘా నడుమ నిర్వహించనున్నాం. మూల్యాంకనానికి వచ్చే ఎగ్జిమినర్లు సమయపాలన పాటించాలి. అంతేగాక నియమ నిబంధనలు పాటిస్తూ మూల్యాంకనం చేయాలి. అందుకు ఉపాధ్యాయులకు అవగాహన కల్పింస్తాం. విద్యార్థులకు అన్యాయం జరకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం.మూల్యాంకనానికి వచ్చే ఉపాధ్యాయులకు ఇప్పటికే ఆర్డర్స్ పంపించాం. ఉపాధ్యాయుల సెల్‌ఫోన్‌కు మూల్యాంకన కేంద్రంలో అనుమతి లేదు. బయటి వ్యక్తులతో సంబంధాలు లేకుండా, క్యాంప్ సమాచారం బయటికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. డీఈఓ గోవిందరాజులు